తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  1983 World Cup Special : రెండే రెండు టికెట్లు అడిగితే ఇవ్వలేదు.. 1983 వరల్డ్ కప్​నే పట్టుకొచ్చారు

1983 World Cup Special : రెండే రెండు టికెట్లు అడిగితే ఇవ్వలేదు.. 1983 వరల్డ్ కప్​నే పట్టుకొచ్చారు

Anand Sai HT Telugu

25 June 2023, 10:08 IST

google News
    • 1983 World Cup 40th Anniversary : ఇప్పుడంటే.. బీసీసీఐ క్రికెట్ ప్రపంచాన్ని శాసిస్తుంది.. కానీ.. ఒకప్పుడు ఎన్నో అవమానాలు. అసలు ఇండియాకు క్రికెట్ అంటే ఏంటో తెలుసా అని వెక్కిరించినవాళ్లే చాలా మంది. అలాంటి సమయంలో ఒక్క వరల్డ్ కప్ ఇండియన్ క్రికెట్ చరిత్రనే మార్చేసింది.
1983 వరల్డ్ కప్
1983 వరల్డ్ కప్

1983 వరల్డ్ కప్

1983 జూన్ 25.. చాలా మంది భారత క్రికెట్ అభిమానులకు గుర్తుండిపోయే రోజు. ఎవరూ ఊహించని విధంగా భారత్ క్రికెట్ చరిత్రలో తనదైన ముద్రను వేసుకున్న రోజు. క్రికెట్ ప్రపంచంలో అసలు భారత్‌ను పరిగణించని దేశాలపై టీమ్ ఇండియా పులులు అందరినీ మంత్రముగ్ధులను చేసిన రోజు. ప్రపంచ క్రికెట్‌లో రాణిస్తున్న కరీబియన్ దిగ్గజాలను ఓడించి భారత్ ప్రపంచకప్ గెలిచిన రోజు. ఇంగ్లిష్ గడ్డపై టీమ్ ఇండియా(Team India) విజయ పతాకాన్ని ఎగురవేసిన రోజు. కపిల్‌దేవ్‌ నేతృత్వంలో లార్డ్స్‌ మైదానంలో భారత్‌ ప్రపంచకప్‌ గెలిచి 40 ఏళ్లు పూర్తయ్యాయి. 1983 ప్రపంచ కప్(1983 World Cup) తర్వాతే భారత క్రికెట్‌కు గణనీయమైన మలుపు వచ్చింది... ఎవరు అవును అన్నా.. కాదు అన్నా.. ఈ విషయం నిజం.

ఆ ఒక్క ప్రపంచకప్(World Cup) విజయం టీమ్ ఇండియాలో చాలా మార్పు తీసుకొచ్చింది. ఇప్పుడు ఎలాంటి బలమైన జట్టును అయినా ఓడించే సత్తా టీమ్ ఇండియాకు ఉంది. అయితే 40 ఏళ్ల క్రితం పరిస్థితి వేరేలా ఉండేది కాదు. అందరూ టీమిండియాను తక్కువ చేసి చూసినవారే. ఆ ప్రపంచకప్‌లో పాల్గొన్న 8 దేశాల్లో ఏ ఒక్కటీ భారత్‌ ప్రపంచకప్‌ గెలుస్తుందని ఊహించలేదు. కానీ అన్ని దేశాలకు షాక్ ఇచ్చి.. కపిల్ దేవ్(Kapil Dev) నాయకత్వంలో భారత్ ప్రపంచకప్ సాధించింది. అయితే ఈ ప్రపంచకప్ ప్రయాణంలో భారత్‌కు ఎదురైన అవమానాలు ఒకటి రెండు కాదు. ఇండియాతో ఆతిథ్య ఇంగ్లండ్ ప్రవర్తించిన తీరు దారుణంగా ఉంది. అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు ఎన్‌కేపీ సాల్వే(NKP Salve)ను ఇంగ్లండ్ అవమానించినందుకు భారత్ ప్రతీకారం తీర్చుకున్న తీరు ఇప్పటికీ క్రికెట్ అభిమానుల మదిలో ఉంటుంది.

ఎన్‌కేపీ సాల్వే 1982 నుంచి 1985 వరకు బీసీసీఐ(BCCI) అధ్యక్షుడిగా ఉన్నాడు. అతని పదవీకాలంలో 1983 ప్రపంచ కప్ కోసం భారతదేశం ఇంగ్లాండ్‌కు వెళ్లింది. అనూహ్యమైన ప్రదర్శనతో భారత్ ఫైనల్స్‌లోకి ప్రవేశించింది. ఆ సమయంలో, BCCI అధ్యక్షుడు NKP సాల్వే ఆతిథ్య ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు నుండి ఫైనల్ మ్యాచ్ చూడటానికి రెండు టిక్కెట్లు మాత్రమే అడిగాడు. అయితే ఆయనకు టిక్కెట్టు ఉన్నప్పటికీ సాల్వేకు ఇంగ్లండ్ బోర్డు టికెట్ ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో విసిగిపోయిన సాల్వే ఇంగ్లండ్ బోర్డు దురహంకారానికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని అనుకున్నాడు. ఈ సమయంలో ఆటగాళ్లను ఎలాగైనా గెలవాలని సాల్వే బాగా మోటివేట్ చేశాడని చెబుతారు.

ఫైనల్ మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను ఓడించిన భారత్, ప్రపంచకప్‌ను గెలుచుకుని స్వదేశానికి తిరిగి వచ్చింది. అయితే సాల్వే మనసులో మాత్రం ఇంగ్లండ్ బోర్డు చేసిన అవమానం అలాగే ఉండిపోయింది. ఇంగ్లండ్‌పై ప్రతీకారం తీర్చుకుంటానని తనలో తాను శపథం చేసిన సాల్వే.. కేవలం నాలుగేళ్లలోనే ఆంగ్లేయులు చేసిన అవమానానికి ప్రతీకారం తీర్చుకున్నాడు.

ఇంగ్లండ్ దురహంకారానికి బ్రేక్ వేయడానికి సాల్వే చేసిన మొదటి పని ఇంగ్లాండ్ వెలుపల ప్రపంచ కప్ నిర్వహించడం. కానీ భారత క్రికెట్ అప్పుడు ఇప్పుడున్నంత బలంగా లేదు. కాబట్టి ఇంగ్లండ్ వెలుపల ప్రపంచకప్‌ను నిర్వహించడం అంత సులభం కాదు. కానీ సాల్వే పట్టుదలగా ప్రయత్నించాడు. 1987 ప్రపంచ కప్‌(1987 World Cup)ను భారతదేశం మరియు పాకిస్తాన్ భాగస్వామ్యంతో నిర్వహించాలని నిర్ణయించుకున్నాడు. ప్రపంచకప్‌కు ఆతిథ్యమిస్తున్న విషయంతో కంగుతిన్న ఇంగ్లండ్.. ఆసియా దేశాలు ఇంత పెద్ద ఈవెంట్‌ను నిర్వహించలేవని పేర్కొంది.

ఇంగ్లండ్ బోర్డు చేసిన ఈ ప్రకటన సాల్వే మరింత గట్టిగా పని చేసేందుకు ఉత్సాహాన్ని ఇచ్చింది. లాహోర్‌లో పాకిస్థాన్ కౌన్సిల్‌తో సమావేశం నిర్వహించి అన్నింటికీ వరల్డ్ కప్ నిర్వహించేందుకు తుది మెరుగులు దిద్దారు. సాల్వే ప్రయత్నాల ఫలితంగా 1987 ప్రపంచకప్ మొదటిసారిగా ఇంగ్లాండ్ వెలుపల జరిగింది. పాకిస్థాన్‌తో టోర్నీని భారత్ విజయవంతంగా నిర్వహించింది. అప్పటి నుండి, భారతదేశం ఇప్పటివరకు 3 సార్లు ఆతిథ్యం ఇచ్చింది. ఈ సంవత్సరం నాల్గో సారి ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది.

తదుపరి వ్యాసం