Coco Gauff: టెన్నీస్ ప్లేయర్ సంచలనం.. అతి పిన్న వయస్కురాలిగా రికార్డ్
10 September 2023, 10:07 IST
US Open 2023 Title Winner Coco Gauff: క్రీడల్లో అప్పుడప్పుడు అద్భుతాలు జరుగుతుంటాయి. ఎవరూ ఎప్పుడూ ఎవరి రికార్డు బద్దలు కొడతారో చెప్పలేం. తాజాగా యూఎస్ ఓపెన్‍లో 19 ఏళ్ల కోకో గాఫ్ సంచలనం సృష్టించింది. అందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
కోకో గాఫ్ విజయం
US Open 2023: యూఎస్ ఓపెన్ మహిళల టెన్నీస్ టోర్నీలో అమెరికా టీనేజర్ కోకో గాఫ్ అరుదైన ఫీట్ సాధించింది. శనివారం (సెప్టెంబర్ 9) జరిగిన యూఎస్ ఓపెన్ ఫైనల్‍లో బెలారస్‍కు చెందిన సెకెండ్ సీడ్ అరీనా సబలెంకాను ఓడించి తొలి యూఎస్ ఓపెన్ టైటిల్‍ను గెలుచుకుంది. సుమారు 2 గంటల 6 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‍లో ప్రత్యర్థిని 2-6, 6-3, 6-2 పాయింట్ల తేడాతో చిత్తు చేసింది ఈ యువ క్రీడకారిణి. అంతేకాకుండా ఈ టోర్నమెంట్‍లో దుమ్మురేపిన కోకో గాఫ్ మహిళల టెన్నీస్ దిగ్గజం అయినా సెరెనా విలియమ్స్ సరసన నిలిచింది.
యూఎస్ ఓపెన్ తొలి సెట్‍లో కోకో గాఫ్ ఓటమి పాలైంది. అయినప్పటికీ ఆ తర్వాతి రెండు సెట్లలో తిరిగి పుంజుకుని ప్రత్యర్థిని చిత్తు చేసింది. ఇక సెమీ ఫైనల్స్ లో చెక్ రిపబ్లిక్‍కు చెందిన కరోలినా మునిచ్‍ను కోకో గాఫ్ ఓడించింది. అలాగే సెరెనా విలియమ్స్ తర్వాత యూఎస్ ఓపెన్ ట్రోఫీని అందుకున్న అత్యంత పిన్న వయస్కురాలిగా కోకో గాఫ్ రికార్డు నెలకొల్పింది. కాగా రెండేళ్లలో కోకో గాఫ్‍కు ఇది 25వ గ్రాండ్ స్లామ్ విజయం. సెరెనా తర్వాత ఈ ఘనత సాధించిన తొలి అమెరికా క్రీడాకారణిగా కూడా కోకో గాఫ్ చరిత్ర సృష్టించింది.
ఇక యూఎస్ ఫైనల్‍లో గెలిచి ట్రోఫీ అందుకున్న కోకో గాఫ్ కన్నీటి పర్యంతం అయింది. తన కళ్ల నుంచి ఆనంద బాష్పాలు వచ్చాయి. ఈ సందర్భంగా తన తల్లిదండ్రులను ప్రేమగా కౌగింలించుకుంది కోకో గాఫ్. తల్లిదండ్రులతోపాటు గ్రాండ్ పేరెంట్స్ కు కృతజ్ఞతలు తెలిపింది. "నన్ను నమ్మని ప్రజలకు ధన్యవాదాలు. ఒక నెల క్రితం నేను టైటిల్ గెలిచినప్పుడు అంతటితో ఆగిపోమ్మని ప్రజలు చెప్పారు. రెండు వారాల క్రితం మరో టైటిల్ గెలిస్తే చాలా గొప్పగా పొగిడారు. ఇప్పుడు 3 వారాల తర్వాత ఈ ట్రోఫీతో నేను ఇక్కడ ఉన్నాను" అని కోకో గాఫ్ తెలిపింది.