Bhogi festival: భోగీ పండుగ వైభవాన్ని చూడాలంటే ఈ ఊళ్లకు వెళ్లాల్సిందే
10 January 2024, 11:47 IST
- Bhogi celebrations: సంక్రాంతి ముందు రోజు వచ్చే భోగి పండుగని చాలా సరదాగా గడుపుతారు. భోగి మంటలు వేసి నృత్యాలు చేస్తూ సందడి చేస్తారు. ఈ ప్రాంతాల్లో భోగి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయి.
పంజాబ్ లో లోహ్రీ సంబరాలు
Bhogi festival: భోగభాగ్యాలని తీసుకొచ్చే పండుగ భోగి. మకర సంక్రాంతి ముందు రోజు వచ్చే భోగి పండుగని ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా పిలుస్తారు. ఉత్తర భారతదేశంలో భోగి పండుగని లోహ్రి అని పిలుస్తారు. పంజాబ్ రాష్ట్రంలో జరుపుకునే అత్యంత ప్రసిద్ది చెందిన పండుగా ఇది. ఆనందం, ఐక్యత, ఉత్సాహ భరితంగా అందరూ కలిసి నృత్యాలు చేస్తూ పంజాబ్ సంస్కృతి సాంప్రదాయాలు కళ్లకి కట్టినట్టు చూపిస్తారు. లోహ్రీ వేడుకలు చూడాలంటే ఈ ప్రదేశాలకి వెళ్ళాల్సిందే అనేంతగా సంబరాలు ఉంటాయి.
ఆనందపూర్ సాహిబ్
పంజాబ్ లోని ఈ ప్రదేశాన్ని లోహ్రీ రాజధాని అని పిలుస్తారు. సిక్కుల చారిత్రక ప్రాముఖ్యత కలిగిన నగరం. ఇక్కడ భోగి పండుగ రోజు సంప్రదాయ గట్కా ప్రదర్శనలు, భక్తి గీతాలు పాడుతూ భోగి మంటలు వేస్తారు. ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక వాతావరణం, సాంస్కృతిక ఉత్సవాలు జరుగుతూ కనిపిస్తాయి. భోగి మంటల్లో నువ్వులు, బెల్లం, చెరకు వంటి వాటిని వేస్తారు. సంప్రదాయ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తారు. ఈ సంబరాలు చూసేందుకు రెండు కళ్ళూ సరిపోవు.
లూథియానా
పారిశ్రామిక కేంద్రంగా పేరు తెచ్చుకున్న లూథియానా లోహ్రీ సమయంలో సంస్కృతికి స్వర్గధామంగా మారుతుంది. జానపద నృత్యాలు, భోగి మంటలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. భాంగ్రా, గిద్దా వంటి సంప్రదాయ జానపద నృత్యాలు లేకుండా లోహ్రీ వేడుకలు అసంపూర్ణంగా ఉంటాయి. వీళ్ళు వేస్తున్న డాన్స్ చూస్తుంటే మనం కూడా కాలు కదపకుండా అసలు ఆగలేము. ఫుల్ బీట్ తో రంగు రంగుల దుస్తులు ధరించి నృత్యాలు చేస్తూ సంతోషంగా గడుపుతారు.
అమృత్ సర్
గోల్డెన్ టెంపుల్ ని లోహ్రీ సందర్భంగా మరింత సుందరంగా డెకరేట్ చేస్తారు. మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీప కాంతుల్లో స్వర్ణ దేవాలయం మెరిసిపోతుంది. చుట్టుపక్కల ప్రదేశం మొత్తం భక్తి పాటలతో ప్రతి ధ్వనిస్తుంది. నువ్వులు, బెల్లంతో చేసిన తీపి పదార్థాలు, సంప్రదాయ పంజాబీ వంటకాలు ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటూ తినిపించుకుంటూ సందడి చేస్తారు. స్నేహితులు, కుటుంబ సభ్యులు బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు.
పటియాలా
రాయల్ సిటీగా పేరొందిన పటియాలా రాచరిక శిల్పకళకి ప్రసిద్ధి చెందింది. ఇక్కడ లోహ్రీ వేడుకలు వైభవంగా జరుపుకుంటారు. భోగి మంటల కోసం పూజా తాలీ సిద్ధం చేస్తారు. ఇందులో నువ్వులు, బెల్లం, వేరుశెనగ, స్వీట్లు పెట్టుకుని పూజ చేస్తారు. సూర్యుడికి పూజ చేసి కృతజ్ఞతలు తెలుపుతారు. లోహ్రీ పాటలు, శ్లోకాలు పాడుతూ ఆనందంగా గడుపుతారు. కొన్ని కమ్యూనిటీలు లోహ్రీ వేడుకల కోసం మేళాలు ఏర్పాటు చేస్తాయి. సాంస్కృతిక ప్రదర్శనలు, సంగీతం, నృత్యం చేస్తూ సందడిగా గడుపుతారు.
చండీగఢ్
పంజాబ్, హరియాణా రాజధాని చండీగఢ్ లో లోహ్రీ వేడుకలు కన్నుల పండుగగా జరుగుతాయి. సంప్రదాయ పంజాబీ దుస్తులు ధరించి జానపద పాటలకు నృత్యాలు చేస్తూ, భోగి మంటల చుట్టూ డాన్స్ చేస్తారు. ఈరోజు ప్రత్యేక కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఏర్పాటు చేస్తారు.