తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Theertham: తీర్థ ప్రసాదాలు ఎప్పుడు తీసుకోకూడదు? తీర్థం తీసుకునేటప్పుడు పాటించాల్సిన నియమాలు ఏంటి?

Theertham: తీర్థ ప్రసాదాలు ఎప్పుడు తీసుకోకూడదు? తీర్థం తీసుకునేటప్పుడు పాటించాల్సిన నియమాలు ఏంటి?

Gunti Soundarya HT Telugu

23 December 2023, 12:00 IST

google News
    • Thirtha prasadam: తీర్థ ప్రసాదాలు తీసుకునేటప్పుడు కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి. 
ఎప్పుడు తీర్థం తీసుకోకూడదు
ఎప్పుడు తీర్థం తీసుకోకూడదు (bhakti youtube)

ఎప్పుడు తీర్థం తీసుకోకూడదు

Thirtha prasadam: గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకున్న తర్వాత ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా తీర్థ ప్రసాదాలు తీసుకుంటారు. అవి తీసుకోకుండా గుడి నుంచి బయటకి రారు. ఒక్కొక్క ఆలయంలో ఒక్కో విధమైన తీర్థం ఇస్తారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం తీర్థాన్ని తీసుకునేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి.

తీర్థం తీసుకునేటప్పుడు ఈ నియమాలు తప్పనిసరి

తీర్థాన్ని హస్త గోకర్ణ ముద్ర వేసి తీసుకోవాలి. కొంతమంది కుడి చేత్తో తీర్థాన్ని తీసుకుంటారు. కానీ అలా అసలు చేయకూడదు. ఎడమ చేతి మీద కుడి చెయ్యి పెట్టి తీసుకోవాలి. బొటనవేలు, చూపుడు వేలు మూసి మిగతా మూడు వేళ్ళు ముందుకు చాపి తీసుకుంటారు. ఈ ముద్రలో భగవంతుని పవిత్ర జలాన్ని తీసుకుని నోట్లో వేసుకోవాలి. తీర్థం తాగేటప్పుడు శబ్దం రాకూడదు. అలాగే తీర్థం కిందపడకూదడు. మరొకరికి పంచిపెట్టకూడదు. ఓం అచ్యుత, ఆనంతా, గోవిందా అనే నామాలు స్మరిస్తూ భక్తి శ్రద్దలతో దేవుడిని తలుచుకుంటూ తీర్థాన్ని తాగాలి.

తీర్థం కొద్ది మొత్తంలోనే తీసుకోవాలి. చాలా మంది తీర్థం తీసుకున్న తర్వాత కుడి చేతిని తల మీడ రాసుకుంటారు. కానీ అది చాలా తప్పు. తలపైన బ్రహ్మదేవుడు ఉంటాడు. మన ఎంగిలి బ్రహ్మకి అర్పణ చేసిన వాళ్ళం అవుతాం. అందుకే తీర్థం సేవించిన తర్వాత చేతిని రుద్దుకోవడం లేదంటే తుడుచుకోవడం చేయాలి. తీర్థాన్ని మూడు సార్లు తీసుకుంటారు. అలా ఎందుకు తీసుకుంటారో చాలా మందికి తెలియదు. మొదటి సారి తీర్థం శారీరక, మానసిక శుద్ధి కోసం ఇస్తారు. రెండోసారి న్యాయ ధర్మ ప్రవర్తన సరిగా ఉండాలని ఇస్తారు. మూడోసారి పవిత్రమైన పరమేశ్వరుని పరమ పదం అనుకుంటూ తీసుకోవాలి.

కొంతమంది ప్రసాదం తీసుకున్న తర్వాత అలాగే కుడి చేతిలో ఉంచుకుని తినేస్తూ ఉంటారు. అలా చేయడం తప్పు. కుడి చేత్తో ప్రసాదం తీసుకున్న తర్వాత దాన్ని ఎడమ చేతిలోకి మార్చుకోవాలి. ఆ తర్వాత ప్రసాదాన్ని కళ్లకి అద్దుకుని కొద్ది కొద్దిగా తినాలి. పక్షి మాదిరిగా ఒక చేతిలోనే ఉంచుకుని తింటే మరుజన్మలో పక్షిగా పుడతారని అంటారు.స్త్రీలు తీర్థంతో పాటు పూలు లేదా ఫలాలు తీసుకునేటప్పుడు తప్పనిసరిగా చీర కొంగు పట్టుకుని వాటిని అందుకోవాలి.

తీర్థ ప్రసాదాలు ఎప్పుడు తీసుకోకూడదు

అపరిశుభ్రంగా ఉన్నప్పుడు తీర్థం తీసుకోకూడదు. స్నానాధికాలు ముగించకుండా, మలమూతరాదులు ముగించుకున్నాక కాళ్ళు కడుక్కోకుండ ఉన్నప్పుడు తీర్థం తీసుకోకూడదు. అది అపవిత్రమైన చర్య. నుదుట విభూతి, కుంకుమ లేనప్పుడు కూడా తీర్థ ప్రసాదాలు తీసుకోకూడదు. అందుకే గుడికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ ముందుగా కుంకుమ తీసుకుని నుదుటిన బొట్టు పెట్టుకుంటారు. స్త్రీలు నెలసరి సమయంలోనూ తీర్థ, ప్రసాదాలు ముట్టుకోకూడదు. పూజ గదివైపు వెళ్లకూడదు.

తీర్థం ఎన్ని రకాలు

తీర్థం నాలుగు రకాలుగా చెప్తారు. మొదటిది జలతీర్థం. అకాల మరణం, సర్వ రోగాల నుంచి విముక్తి లభిస్తుంది. కషాయ తీర్థం రాత్రీపూజ తర్వాత పంచుతారు. ఇది కొన్ని దేవాలయాలలో మాత్రమే ఇస్తారు. పంచామృత తీర్థం తీసుకుంటే బ్రహ్మలోకం ప్రాప్తిస్తుందని నమ్ముతారు. పానక తీర్థం ఇస్తారు. ఇవి మాత్రమే కాదు తులసి తీర్థం, బిల్వ తీర్థం, పచ్చ కర్పూర తీర్థం కూడా పంచుతారు.

టాపిక్

తదుపరి వ్యాసం