Makara sankranti: మకర సంక్రాంతి ప్రాధాన్యత ఏంటి.. కనుమ రోజు రథం ముగ్గు ఎందుకు వేస్తారు?
15 January 2024, 9:59 IST
- Makara sankranti 2024: సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన రోజుని మకర సంక్రాంతి జరుపుకుంటారు. ఈరోజు ఎటువంటి పనులు చేయాలి, ఏం దానం చేయాలో తెలుసుకుందాం.
సంక్రాంతి సంబరాలు
Makara sankranti 2024: సంక్రాంతి ప్రత్యేకత శాస్త్రపరంగా చాలా ఉందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. నక్షత్రాలు ఇరవై ఏడు. మళ్ళీ ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు. మొత్తం 108 పాదాలుగా విభజింపబడినాయి. తిరిగి 108 పాదాలను 12 రాశులుగా విభాగించారు. అవి... 1.మేషం, 2. వృషభం, 3.మిధునం, 4 కర్కాటకము, 5. సింహము, 6. కన్య, "7. తుల, 8. వృశ్చికము, 9. ధనుస్సు, 10. మకరం, 11. కుంభము, 12. మీనం. సూర్యుడు నెలకొక రాశిలో ప్రవేశిస్తాడు. సూర్యుడు ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ రాశి ఆ సంక్రాంతిగా వ్యవహరించబడుతుంది. ఇలా సంవత్సరానికి 12 సంక్రాంతులు ఉంటాయి. సంవత్సరాన్ని మళ్ళీ రెండు అయనములుగా విభజించారు.
ఉత్తరాయణం.. దక్షిణాయనం
ఏడాదిలో 6 నెలలు ఉత్తరాయణం అయితే మిగిలిన 6 నెలలు దక్షిణాయనం. ఖగోళ శాస్త్ర ప్రకారం ప్రతి సంవత్సరం జూలై 16 నుంచి జనవరి 14 వరకు ఉన్న కాలాన్ని దక్షిణాయనము అంటారు. జనవరి 15 నుంచి జూలై 15 వరకూ ఉత్తరాయణం అంటారు. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు ఆ రాశిని 'మకర సంక్రాంతి” అని అంటారు. మకర సంక్రమణం నుంచి ఉత్తరాయనం ప్రారంభమవుతుంది. ఆ తరువాత కుంభ, మీన, మేష, వృషభ, మిధున రాశులలో సూర్యుడు కొనసాగినంత కాలం ఉత్తరాయనం. శారీరక పరిశ్రమకు, పూజలకు, సాధనలకు, కృషికి అనువైన కాలం ఇది. సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు మొదలై సింహ, కన్య, తుల, వృశ్చికం, ధనూ రాశులలో కొనసాగినంతకాలం దక్షిణాయనం. మానసికమైన అర్చనకు, ధ్యానానికీ, యోగానికీ, దీక్షలకు, బ్రహ్మచర్యానికి, నియమనిష్టలకు అనువైన, ఆవశ్యకత ఉన్న కాలం దక్షిణాయనం.
సంవత్సర కాలంలో ఆరునెలలు ఉత్తరాయనం దేవతలకు ఒక పగలు, దక్షిణాయనం ఆరునెలలు వారికి ఒక రాత్రి. దేవతలు మేలుకొని ఉండే కాలం ఉత్తరాయనం పుణ్యకాలం. కనుకనే ఉత్తరాయనం వరకు అంపశయ్యపై ఎదురు చూసిన భీష్ముడు ఉత్తరాయనం వచ్చాకే తనువు చాలించాడు. మకర సంక్రాంతి పండుగలో సంక్రాంతికి ముందు రోజు భోగి పండుగను జరుపుకుంటారు. ఆ రోజు చలిపులిని తరిమికొడుతూ ప్రజలు ఉదయాన్నే చలిమంటలు వేసుకుంటారు. తమలోని పాత ఆలోచనలు అగ్నికి ఆహుతై కొత్త ఆలోచనలు చిగురించాలని అగ్నిదేవుడిని వేడుకుంటారు. ఇందుకు గుర్తుగా తమ ఇంటిలోని పాత చెత్తా చెదారాన్ని ఆ అగ్నిలో ఆహుతి చేస్తారు. ఇంటి ఎదుట రంగురంగుల ముగ్గులను వేస్తారు. చిన్నారులకు భోగిపండ్లు పోస్తారు. సంగ్రాంతి పండుగ మూడో రోజు పండుగను కనుమ అని పిలుస్తారు. ఈ రోజు పిండివంటలు చేసుకొని బంధువులతో విందు వినోదాలలో పాల్గొంటారని ప్రముఖ అధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
మకర సంక్రాంతి : సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే శుభదినం. “సంక్రాంతిలో “సం” అంటే మిక్కిలి, “క్రాంతి” అంటే అభ్యుదయము. మంచి అభ్యుదయాన్ని ఇచ్చు క్రాంతి కనుక దీనిని 'సంగక్రాంతి'గా పెద్దలు వివరణ చెబుతూ “మకరం” అంటే మొసలి అని అర్థం. ఇది పట్టుకుంటే వదలదు అని మనకు తెలుసు. కాని మానవుని ఆధ్యాత్మిక మార్గానికి అడుగడుగునా అడ్డు తగులుతూ, మోక్షమార్గానికి అనర్హుని చేయుటలో ఇది అందెవేసిన చేయి. అందువల్ల ఈ ‘మకర సంక్రమణం” పుణ్యదినాలలో దీని బారినుండి తప్పించుకునేందుకు ఒకటే మార్గం. "అది ఎవరికి వారు యథాశక్తి లేదు అనకుండా దానధర్మాలు చేయటమే మంచిదని శాస్త్రకోవిదులు చెబుతూ ఉంటారు.
సంక్రాంతి రోజున ఏం దానం చేయాలి
ధాన్యం, ఫలాలు, విసనకర్ర, వస్త్రం, కాయగూరలు, దుంపలు, నువ్వులు, చెరకు, బూడిద గుమ్మడికాయలు మొదలైనవి సాధారణంగా దానం చేస్తారు. ఈ కాలంలో చేసే గోదానం వలన స్వర్గవాసం కలుగుతుందని విశ్వసిస్తారని ప్రముఖ అధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
సంక్రాంతి పురుషుడు లేదా సంకురుమయ ప్రతి సంవత్సరం వేరు వేరు వాహనాలపై వస్తాడు. సంక్రాంతి పురుషుడు ఏ వాహనాన్ని ఎక్కితే దానికి ఆ ఏడాది ఎక్కువ నష్టం వాటిల్లుతుందని భావిస్తారు. సంక్రాంతి పండుగకు ఒక దేవి ఉంది. ఆ దేవి పేరు సంక్రాంతి పండగ వారంతో ముడిపడి ఉ టుంది. ఆదివారం వస్తే దేవత పేరు ఘోర. సోమవారమైతే ధ్వంక్షి మంగళవారం... మహోదరి, బుధవారం.. మందాకిని, గురువారం.. మంద, శుక్రవారం.. మిథశ్ర శనివారం... రాక్షసి. మకర సంక్రాంతి పుణ్యదినాన దానధర్మాలు చేయటం ద్వారా జన్మజన్మల దరిద్ర బాధలు తొలగి పోతాయని విశ్వాసం. సంక్రాంతి రోజున స్త్రీలు పువ్వులు, పసుపు, కుంకుమ, పండ్లను దానం చేయడం ద్వారా సకల సంపదలతో పాటు దీర్ఘ సుమంగళీ ప్రాప్తం లభిస్తాయి. సంక్రాంతి ఒంటరిగా రాదని పెద్దలంటూ ఉంటారు. మహారాణిలా ముందు 'భోగి” (భోగి పండుగ), వెనుక 'కనుమి (కనుమ పండుగను)లను వెంటేసుకొని చెలికత్తెల మధ్య రాకుమార్తెలా సంక్రాంతి వస్తుందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
పితృదేవతారాధన ముఖ్యం
సంగ్రాంతి రోజున పితృ దేవతారాధన చేయడం వల్ల వారి శుభాశీస్సులతో వర్ధిల్లుతారని పురోహితులు అంటున్నారు. సంవత్సరంలో మిగిలిన రోజుల్లో నువ్వులు వాడరు. కానీ సంక్రాంతి పర్వదినాన మాత్రం నల్లనువ్వులతో పితృదేవతలకు చాలామంది తర్పణాలు ఇస్తూ ఉంటారు. దీన్నే కొందరు పెద్దలకు పెట్టుకోవడం అంటారు. ప్రతీ సంక్రమణానికీ తర్పణాలు ఇవ్వాలి. కానీ మిగిలిన 11 సంక్రమణాలకు ఇవ్వకపోయినా ఈ మకర సంక్రమణానికి మాత్రం తప్పకుండా పితృ తర్పణాలు ఇస్తారు. సంక్రాంతి పర్వదినాలలో వారి వారి ఆచార సంప్రదాయాలను అనుసరించి ఈ కార్యక్రమం చేస్తుంటారు.
సంక్రాంతి రోజున సూర్యోదయానికి ముందే లేచి పూజామందిరము, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. గడపకు పసుపు, కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజా మందిరమును ముగ్గులతో అలంకరించుకోవాలి. స్రీలు తెల్లవారుజాముననే లేచి వారివారి ముంగిళ్ళలో రంగవల్లులను తీర్చిదిద్దుకోవాలి. సంక్రాంతి రోజున పాలుపొంగించి దానితో మిఠాయిలు తయారుచేస్తారు. దాదాపుగా అందరి ఇళ్ళలో అరిసెలు, బొబ్బట్లు, జంతికలు, సకినాలు, పాల తాలికలు, సేమ్యా పాయసం, పరమాన్నం, పులిహోర, గారెలు మొదలైన వంటకాలు చేసి కొత్త బట్టలు ధరించి ఈ పండుగను ఆస్వాదిస్తారు. సంక్రాంతి రోజున ఆడపడుచులని, అల్లుళ్ళను ఇంటికి ఆహ్వానించి, వారికి కొత్త బట్టలు పెట్టి బంధుమిత్రులతో కలసి ఆనందంగా ఉత్సాహంగా జరుపుకుంటారు. సంక్రాంతి సందర్భంగా మహిళలు కొన్ని కొన్ని వ్రతాలను ఆచరిస్తారని చిలకమర్తి తెలిపారు.
సంక్రాంతి రోజులలో శుభాలనిచ్చే కొన్ని వ్రతాలు/నోములు: లోకసాక్షి అయిన సూర్యభగవానుని అర్చించి ఆయన కరుణా కటాక్ష వీక్షణాలను పొందే శుభదినమే సంక్రాంతి. సంక్రాంతి రోజు అరుణోదయ వేళ స్నాన, జప, అర్హగ్ర ప్రదాన, తర్పణ, దానాదులన్నీ అనేక కోట్ల రెట్ల పుణ్యఫలములను ఆయురారోగ్య సంపదలను ఇస్తాయని పురాణ కథనం. సంక్రాంతి రోజున శ్రీ సత్యనారాయణస్వామి వ్రతం చేసినవారికి శోక, దుఃఖాలు తొలగి ధన ధాన్యాభివృద్ధి చెంది సంతాన సౌభాగ్యాలు కలిగి సర్వత్రా విజయం లభించి కోరిన కోరికలు తీరతాయి.
సంక్రాంతి నెల పట్టాక కన్నెలు, ముత్తయిదువలు ఎన్నో వ్రతాలు, నోములు నోచుకుంటారు. వాటిలో...
గొబ్బ్చిగౌరి వ్రతము: ఈ వ్రతం భోగి రోజు మొదలవుతుంది. భోగి పండగ నాటి సాయంత్రం నట్టింట్లో ఓవైపు మంటపం కట్టి అలంకరిస్తారు. ఆ కాలంలో దొరికే పండ్లు కూరగాయలు, చెరకు గడలతో దాన్ని అలంకరిస్తారు. మండపం మధ్య బియ్యం పోసి నడుమ గౌరీదేవిని ఉంచి పూజలు చేస్తారు. భోగి నుంచి నాలుగోరోజు ఉద్వాసన పలికి మంటపంలో అలంకరించిన కూరగాయలతో ఓ కూర వండుకుంటారు. దాన్నే గొబ్బీకూర అంటారని చిలకమర్తి తెలిపారు.
గోదాదేవి నోము: పూర్వము గోదాదేవి పూర్వ ఫల్గుణి నక్షత్రంలో కర్కాటక లగ్నంలో తులసి వనంలో జన్మించినది. ఆమె శ్రీరంగనాథుని ఆరాధించింది.
ఈమె నెలపట్టిన రోజు నుంచి ధనుర్మాసమంతా ఒక నెలరోజులు కాత్యాయిని వ్రతమాచరించి చివరి రోజైన మకర సంక్రాంతినాడు రంగనాథస్వామిని పెళ్ళి చేసుకుంది. శ్రీకృష్ణుని కీర్తిస్తూ ఆమె తిరుప్పావై పాశురములను రచించింది. వాటిలో గోపికలు శ్రీకృష్ణుడిని ఆరాధించిన తీరును అద్భుతంగా వర్ణించింది. తమిళ భక్తి సాహిత్యంలో గోదాదేవి రచించిన తిరుప్పావై పాశురములు మంచి కీర్తిని గడించాయి.
ఈ వ్రతకాలంలో ఆమె తనను ఒక గోపికగా సంభావించుకుంది. మనం ఈనాడు పెట్టే గొబ్బెమ్మలే గోపికలు. జనవాడుకలో గోపి బొమ్మలే గొబ్బెమ్మలుగా పిలవబడుతున్నాయి. పెళ్ళికాని ఆడపిల్లలంతా గొబ్బెమ్మలు పెట్టి వాటి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ పాటలు పాడుతూ తాము గోపికలుగా భావించుకొని కృష్ణభగవానుని మదిలో అర్చిస్తే మంచి భర్త లభిస్తాడని ఓ నమ్మకం. పుష్యమాసంలో వైష్ణవ భక్తులు ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి సంక్రాంతి పండుగ రోజున గోదాకల్యాణం జరిపి తమ వ్రతాన్ని పరిసమాప్తిగావించి తరిస్తారని ప్రముఖ అధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
బొమ్మలనోము: గతంలో అడపిల్లలకు చిన్నవయసులోనే వివాహాలను చేసేవారు. వారితో ముక్క్మనుమ నాడు బొమ్మలనోము పేరుతో 'సావిత్రి గౌరీదేవి నోము” నోయించేవారు. ఈ నోమును వరుసగా తొమ్మిదేళ్ళు చేయాల్సి ఉంటుంది. దీనివల్ల గృహిణులకు శుభాలు కలుగుతాయని నమ్మకం.
మూడో రోజు కనుమ: దీన్నే పశువుల పండుగ అని అంటారు. తమ చేతికి వచ్చిన పంటను తామేకాక పశువులు, పక్షులు పాలుపంచుకోవాలని పిట్టల కోసం ధాన్యపు కంకులు ఇంటి గుమ్మాలకు కడతారు. పల్లెల్లో పశువులే గొప్ప సంపద. అవి ఆనందంగా ఉంటే రైతులు ఉత్సాహం. పంటల్లో వీటి పాత్ర ఎంతో ఉంది. వాటిని ప్రేమగా చూసుకొనే రోజును కనుమను భావిస్తారని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చగ్రవర్తి శర్మ తెలిపారు.
రథం ముగ్గు: మూడు రోజులతో పూర్తవుతూ అందరికీ ఆనందాన్ని పంచిన సంక్రాంతి పండుగను ఘనంగా సాగనంపేందుకు పుట్టినదే రథం ముగ్గు. అందరూ ఒకరికి ఒకరు తోడుంటూ కలసి సహజీవనం సాగించాలి అనే సంకేతాలతో ఒక రథం ముగ్గు తాడును మరొక ఇంటివారి ముగ్గుతో కలుపుతూ పోతూ ఉంటారు. కనుమ రోజున గారెలతో తృప్తి పడతారు. కనుమ రోజున ప్రయాణాలు చేయకపోవడం సంప్రదాయమని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.