Vastu Tips | ఖాళీ గోడవైపు చూడొద్దు..జీవితంలో విజయం సాధించటానికి వాస్తు చిట్కాలు!
19 December 2022, 12:13 IST
- Astrological & Vastu Tips for Life: జీవితంలో ఏదైనా సాధించాలంటే ఏం ఉన్నా, లేకపోయినా మీలో ఆత్మవిశ్వాసం ఉండాలి. అది కూడా లేకపోతే ప్రత్యామ్నాయ పరిష్కారాలు ఉన్నాయి. జీవితంలో విజయం సాధించేందుకు ఇక్కడ కొన్ని వాస్తు పరిహారాలు ఉన్నాయి, పరిశీలించండి.
vastu tips for life
Astrological & Vastu Tips for Life: జీవితంలో విజయం సాధించాలంటే ఏ వ్యక్తికైనా ఆత్మవిశ్వాసం అనేది చాలా అవసరం. చాలాసార్లు ఎంత కష్టపడి పని చేసినా వరుస వైఫల్యాలు ఎదురవవచ్చు, చేతిలో డబ్బు అయిపోవచ్చు, మీకు సహాయం అందించేవారు ఏ ఒక్కరు లేకపోవచ్చు. అయితే ఇవేమీ లేకపోయినా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే కచ్చితంగా ఏదో ఒకరోజు విజయం అనేది దక్కుతుంది. జీవితంలో గొప్పవారు కాగలరు. ఇది ఎవరైనా అంగీకరించాల్సిన వాస్తవం. కానీ, ఆత్మవిశ్వాసం పొందడం ఎలా అంటే? మీరు జ్యోతిష్యం, వాస్తు శాస్త్రాలు నమ్మేవారైతే ఇక్కడ మీకు కొన్ని పరిష్కారాలు అందిస్తున్నాము.
మీ ఆత్మవిశ్వాసం సన్నగిల్లినపుడు, మీకు వేరే ఏ ప్రత్యామ్నాయాలు లేనపుడు వాస్తు పరిహారాలు పాటిస్తే మంచిదని ఈ రంగానికి చెందిన నిపుణులు అంటున్నారు. ఆత్మవిశ్వాసం పెరగటానికి, జీవితంలో విజయం సాధించటానికి వాస్తు శాస్త్రంలో కొన్ని ప్రత్యేక నివారణల గురించి ప్రస్తావన ఉన్నట్లు వారు తెలిపారు. ఇందుకోసం మీరు ఏం చేయవచ్చో ఇక్కడ తెలుసుకోండి.
పక్షులకు ఆహారం
ఆత్మవిశ్వాసం సన్నగిల్లినపుడు పక్షులకు ఆహారం, నీరు అందించండి. ఆవులకు పచ్చి మేత తినిపించండి. అలాగే, కుక్కలకు ఆహారం ఇవ్వండి, వాటిని ప్రేమించండి. ఇంట్లో చేపలను పెంచండి. ఇలాంటి మంచి పనుల వల్ల అంతా మంచి జరుగుతుంది. ఆ వ్యక్తిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని నమ్ముతారు.
గోడకు ఉదయించే సూర్యుని చిత్రపటం
మీరు ఉండే గదిలో గోడకు ఉదయించే సూర్యుని చిత్రంతో లేదా పరుగెత్తే గుర్రం చిత్రపటంతో అలంకరించండి. గుర్రం ముఖం లోపలి వైపు ఉండాలి, బయట ద్వారం వైపు ఉండకూడదు. ఇది ఆత్మవిశ్వాసాన్ని పెంచడంలో సహాయపడుతుంది, ఇంటిలోని ప్రతికూలతను కూడా తొలగిస్తుంది. అలాగే ఖాళీ గోడకు ఎదురుగా ఎప్పుడూ కూర్చోకండి, ఎందుకంటే అది మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది.
ఇంట్లో శని యంత్రం
మీ ఇంట్లో శని యంత్రం ఒకటి ఉంచుకోండి. అలాగే మీ ఇంటి ప్రవేశ ద్వారం వద్ద నిమ్మకాయ, పచ్చి మిరపకాయలను వేలాడదీయండి. నిమ్మకాయ ఎండిపోతే, దానిని తీసేసి శనివారం రోజున మాత్రమే తాజా నిమ్మకాయ తగిలించండి. అలాగే చేతికి పగడపు రత్నం ధరించాలి. ఇది మీ చుట్టూ సానుకూల శక్తిని ప్రసరింపజేస్తుంది. మీలో ఆత్మవిశ్వాసం పెరిగేలా సహాయపడుతుంది.
సూర్య నమస్కారాలు
ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి, ఉదయాన్నే నిద్రలేచి ఉదయించే సూర్యుడిని ఆరాధించండి. రోజూ ఆదిత్య హృదయ స్రోతం పఠించండి. సూర్య నమస్కారాలు చేయండి. ప్రతిరోజూ ఉదయాన్నే సూర్యునికి నీటిని సమర్పించడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆహారం తినేటప్పుడు తూర్పు దిశకు ముఖం పెట్టండి.
కిటికీలు తెరిచి ఉంచండి
మీ ఇంటి కిటికీలు తెరిచి ఉంచండి. ఇలా చేయడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. కిటికీ ముందు నేరుగా మీ వీపు ఉంచి కూర్చోవద్దు, ఎందుకంటే ఇది శక్తిని హరిస్తుంది, విశ్వాసాన్ని తగ్గిస్తుంది.
గాయత్రీ మంత్రం జపించండి
ఉదయాన్నే గాయత్రీ మంత్రాన్ని జపించండి. మీరు కూర్చునే చోట మీ సీటు వెనుకాల ఒక ఎత్తైన పర్వతం చిత్రాన్ని ఉంచండి. సానుకూల శక్తితో నిండిన వ్యక్తులతో మీ సమయాన్ని వెచ్చించండి. ఎప్పుడూ ఇతరుల తప్పులను వెతికే వ్యక్తుల నుండి దూరంగా ఉండండి.
గమనిక: ఈ కథనంలో ఇచ్చిన సమాచారం మతపరమైన విశ్వాసాలపై ఆధారంగా కేవలం ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మాత్రమే అందించినది. వీటిని పాటించడం, పాటించకపోవటంపై నిర్ణయం మీదే.
టాపిక్