తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Kanuma Significance । కనుమ నాడు ప్రయాణాలు నిషిద్ధం.. ఈరోజు ఇలా చేస్తే దైవానుగ్రహం తథ్యం!

Kanuma Significance । కనుమ నాడు ప్రయాణాలు నిషిద్ధం.. ఈరోజు ఇలా చేస్తే దైవానుగ్రహం తథ్యం!

HT Telugu Desk HT Telugu

05 May 2023, 15:25 IST

google News
    • Kanuma Significance: కనుమ పండగ విశిష్టతను ఆధ్యాత్మికవేత్త, చిలకమర్తి పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలియజేశారు. అది ఇక్కడ చూడండి.
Makara Sankranti 2023- Kanuma Significance
Makara Sankranti 2023- Kanuma Significance (Unsplash)

Makara Sankranti 2023- Kanuma Significance

Makara Sankranti 2023- Kanuma Significance మూడు రోజుల సంక్రాంతి పండగలో చివరగా జరుపుకునే పండగ కనుమ. దీనిని పశువులు పండగ అని కూడా అంటారు. ఏడాదంతా కష్టడుతూ పంట పండించే రైతులకు వ్యవసాయంలో తమవంతు సాయం అందించే పశుపక్షాదులకు ఈరోజును అంకితం ఇస్తారు. మరి కనుమ రోజు చేయాల్సిన పూజలు ఏమిటి, కనుమను ఎలా జరుపుకోవాలి? ఇందుకు జ్యోతిష్య శాస్త్ర పండితులు ఈ విధంగా తెలియజేశారు.

మన సనాతన ధర్మంలో కాలానికి చాలా ప్రాధాన్యత ఉన్నది. జ్యోతిష్యశాస్త్ర ప్రకారం కాలాన్ని సూర్య చంద్ర మరియు నక్షత్రాల ఆధారంగా లెక్కిస్తారు. సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశించేటటువంటి కాలమును రవి సంక్రమణం అని జ్యోతిష్యశాస్త్రం తెబుతుంది. ఈ రవి సంక్రమణాలు జరిపేటటువంటి కాలమును పుణ్యకాలముగా శాస్త్రములు తెలిపినట్లుగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, చిలకమర్తి పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. ఇలా సూర్య భగవానుడు ధనుస్సు రాశి నుండి మకర రాశి లోకి ప్రవేశించిన పుణ్యసమయమే మకర సంక్రాంతిగా చెప్పడమైనది.

ఉత్తరాయణము ప్రాశస్త్యం గొప్పది

జ్యోతిష్యశాస్త్ర ప్రకారం సంవత్సరంలో 12 మాసములు. సూర్యుడు ఒక్కొక్క రాశిలో సంచరించును. ఇలా సూర్యుడు 12 రాశులలో సంచరించిన కాలమును ఒక సంవత్సరముగా చెబుతారు. ఈ సంవత్సర కాలమును 2 ఆయనములుగా విభజించడమైనది. ఒకటి ఉత్తరాయణము కాగా, రెండవది దక్షిణాయణము. సూర్యభగవానుడు కర్కాటక రాశి నుండి ధనూ రాశికి సంచరించే కాలమును దక్షిణాయనముగా, అలాగే మకరరాశి నుండి మిథున రాశి మధ్య సంచరించే కాలమును ఉత్తరాయణముగా జ్యోతిష్యశాస్త్రము చెబుతోంది.

వేదాల ప్రకారం దేవతలకు ఉత్తరాయణము ఒక పగలు అయితే, దక్షిణాయనము ఒక రాత్రి అని పేర్కొనడమైనది. ఉత్తరాయణ సమయములో దేవతలు మేల్కొని ఉండే కాలము,ఉత్తరాయణము శారీరక శ్రమకు, పూజలకు సాధనకు అనుకూలమైన కాలమని అలాగే దక్షిణాయనము ధ్యానానికి, దీక్షలకు, పితృదేవతార్చనకు, అనుకూలమైన కాలమని శాస్త్రములు తెలిపాయి. ఇంతటి ప్రాధాన్యత ఉన్నది కాబట్టే మహాభారతమునందు భీష్మాచార్యులవారు ఉత్తరాయణము వరకు అంపశయముపై ఎదురుచూసి ఉత్తరాయణము నందే తనువును చాలించెను.

కనుమ రోజు పూజా నియమాలు

ఉత్తరాయణములో మొదటి రోజు మకర సంక్రాంతిగా, రెండవ రోజును కనుమగా, మూడవ రోజు ముక్కనుమగా జరుపుకోవడం ఆచారము. కనుమ అనేది పశు వుల పండుగ. సంక్రాంతి సమయానికి పంట చేతికి రావడం వలన రైతులు ఈ పంట పండడానికి సహాయపడిన పశు పక్ష్యాదులకు చేసే పండుగగా కనుమను తెలుపుతారు. శాస్త్ర ప్రకారం కనుమ రోజు గోవులను పూజించడం, పశువులకు ఆహారాన్ని అందించడం, పక్షులకు ధాన్యాన్ని వేయడం వలన పితృ దేవతల అనుగ్రహం కలుగుతుంది. కనుమ రోజు అమ్మవారిని పూజించడం, అమ్మవారికి గారెలను నైవేద్యంగా పెట్టడం విశేషము. కనుమ రోజు ప్రయాణాలను నిషేధించారు. ఉత్తరాయణంలో భోగి, సంక్రాంతి, కనుమ రోజులలో తలస్నానం ఆచరించి సూర్యారాధన చేసినటువంటి వారికి, నూతన వస్త్రములు ధరించినటువంటి వారికి, కుటుంబముతో ఆహ్లాదముగా గడిపినటువంటి వారికి, ఆరోగ్య సిద్ధి కలిగి సంపదలు లభిస్తాయని పెద్దల వాక్కు.

- బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ,

మొబైల్ 9494981000.

 బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
తదుపరి వ్యాసం