Ugadi Mesha Rasi Phalalu 2023: శ్రీ శోభకృత్ నామ సంవత్సరం మేషరాశి ఫలితాలు
22 March 2023, 9:01 IST
- Ugadi Mesha Rasi Phalalu 2023: శ్రీ శోభకృత్ నామ సంవత్సర మేషరాశి ఫలితాలు ఇక్కడ చూడొచ్చు. వీటిని పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు.
శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది 2023 మేషరాశి ఫలితాలు
మేషరాశి వారికి ఆదాయం - 5, వ్యయం - 5, రాజపూజ్యం - 3 అవమానం 1
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం మేషరాశి వారికి ఫలితాలను ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు.
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం నందు మేషరాశి వారికి చిలకమర్తి పంచాంగ గణనం ఆధారంగా బృహస్పతి జన్మ స్థానమునందు సంచరించుట చేత, శని లాభ స్థానమునందు సంచరించుట చేత, రాహువు జన్మ రాశి యందు 1వ స్థానము యందు సంచరించుటచేత మరియు కేతువు సప్తమ స్థానమునందు సంచరించుటచేత మేషరాశి వారికి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితములు ఉన్నవి.
మేషరాశి వారికి శని లాభ స్థానం నందు సంచరించుట వలన ఈ సంవత్సరం మీరు అనుకున్న ముఖ్యమైన పనులను పూర్తి చేసెదరు. కొంతమేర శ్రమ కలిగినప్పటికి విజయం పొందెదరు.
మేషరాశివారికి రాహువు యొక్క ప్రభావం చేత ఈ సంవత్సరం కుటుంబమునందు కలహములు, కష్టములు అధికముగా ఉండును. అనుకూల శని ప్రభావం చేత వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సత్ఫలితాలు పొందెదరు.
బృహస్పతి రాహువుతో కలసి సంచరించుట చేత కుటుంబ విషయాలలో స్నేహితులతో వ్యవహరించే విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వేదనలు, ఆందోళనలు పెరిగేటటువంటి సూచనలు అధికముగా ఉన్నవి. మీ చుట్టూ అనేక రాజకీయాలు జరిగే సూచన. గొడవలకు, రాజకీయాలకు దూరంగా ఉండటం మంచిది అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
మేష రాశి ఉద్యోగులకు ఫలితాలు
మేషరాశి వారికి శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో ఉద్యోగస్తులకు ఉద్యోగములో రాజకీయ ఒత్తిళ్ళు ఏర్పడును. అయినప్పటికి ధనపరంగా, ప్రమోషన్లపరంగా అనుకూల ఫలితములు లభించును.
మేషరాశి వ్యాపారస్తులకు శ్రీ శోభకృత్ నామ సంవత్సరం లాభదాయకంగా ఉన్నది. వ్యాపారస్తులకు నరఘోష మరియు ఒత్తిళ్ళు ఏర్పడును. మేషరాశి స్త్రీలకు వృత్తిపరంగా అనుకూలంగా ఉండును. కుటుంబములో సమస్యలు అధికమగును. మేషరాశి విద్యార్థులకు శ్రీ శోభకృత్ నామ సంవత్సరం అన్ని విధాల అనుకూలమైనటువంటి సంవత్సరం.
మేషరాశి రైతాంగానికి ఈ సంవత్సరం మధ్యస్త ఫలితాలు ఉండబోతున్నాయి. మేషరాశి సినీరంగం వారికి అనుకూలమైన ఫలితాలు ఏర్పడతాయి. మొత్తం మీద శ్రీ శోభకృత్ నామ సంవత్సరం మేషరాశివారికి శని ప్రభావం చేత శుభఫలితాలు, గురు, కుజు, రాహు ప్రభావాల చేత మధ్యస్త ఫలితాలు కలుగుతాయి.
మేషరాశి వారు శుభ ఫలితాలు పొందేందుకు ఇలా చేయాలి
మేషరాశివారు ఈ సంవత్సరం మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే మంగళవారం రోజు విఘ్నేశ్వరుడిని, సుబ్రహ్మణ్యే శ్వర స్వామిని పూజించడం, శనివారం రోజు రాహువు కాల సమయంలో దుర్గాదేవిని పూజించటం మరియు గురువారం రోజు దత్తాత్రేయుని పూజించడం వలన మరింత శుభఫలితాలు కలుగుతాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
మేష రాశి మాసవారి ఫలాలు
ఏప్రిల్:- మేషరాశి వారికి అనుకూలముగా ఉన్నది. గృహమున మంగళకరమగు వాతావరణము, ఉన్నత ఉద్యోగం వృద్ధి కుటుంబ విషయములు ప్రోత్సాహకరమగుట. సంతానం వృద్ధి ఆదాయం గౌరవం సుబ్రహ్మణ్య ఆరాధన మేలు చేస్తుంది.
మే:- ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. అనేక సవాళ్ళను అధిగమించి, అవిశ్రాంతంగా పనిచేస్తూ మానసికంగా వత్తిడిని అధిగమించడం ముఖ్యంగా జన్మరాశిలో బృహస్పతి ఈ సమయం ఆశావాహ దృక్పథాన్ని మేలుకొలిపి మిమ్ములను విజయపథంవైపు నడిపిస్తుంది.
జూన్ :- ఈ మాసం మీకు మధ్యస్తంగా ఉన్నది. పెట్టుబడులకు, నూతన వ్యాపారములకు సమయం కాదు. వృత్తి వ్యాపారాలు సామాన్యము. బంధుమిత్రుల సమాగమం, శుభకార్య నిర్వహణ, కుమారుల వలన సౌఖ్యం. మాస ద్వితీయార్థం ఇష్ట కామ్యార్థ సిద్ధి.
జూలై : - వృత్తి ఉద్యోగాలు అనుకూలం. భూమి కొనుగోలు లేదా ఏమైనా ఉద్యోగంలో స్థిరపడుట జీతం పెరుగుట, సరైన నిర్ణయాలతో కృషితో సాధించగల్గుతారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం బాగుంటుంది. దూరప్రయాణాలు కలసివస్తాయి
ఆగస్టు :- ఈ మాసం అనుకూలంగా లేదు. పనిభారం ఎక్కువై మానసిక వత్తిడికి లోనయ్యే అవకాశం. వృత్తి ఉద్యోగాలలో పై స్థాయి వారివలన సమస్యలు, మీ సహ ఉద్యోగులతో, స్నేహితులతో, మీ తోటివారితో, తల్లిదండ్రులతోనూ అవగాహనాలోపం వలన సమస్యలు.
సెప్టెంబర్ : - గృహవాతావరణం అనుకూలం. జీవితం భాగస్వామి మరియు సంతానంతో గడపటానికి సమయం కేటాయిస్తారు. తగిన ఆదాయవనరులు కలుగుతాయి. విద్యార్థులు సోమరితనాన్ని వీడి చదువుల్లో ఆసక్తి చూపుతారు.
అక్టోబర్ :- ఈ మాసం మీకు అనుకూలంగా ఉంది. సమాజంలో విలువ, ఆదరణ పెరుగుతుంది. స్నేహితులు బంధువులు మిమ్ములను గౌరవిస్తారు. ప్రయత్నించిన పనులు నెరవేరుతాయి. ఇష్టకార్య సిద్ధి. సంతానం పోటీ పరీక్షలలో రాణిస్తారు. వాహన సౌఖ్యం.
నవంబర్ :- ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. వ్యాపారాలలో పెట్టుబడులు తగ్గించుట మంచిది. ఆధ్యాత్మిక విషయాలలో ప్రాధాన్యత. అనవసర ఖర్చులను, విదేశీ ప్రయాణాలను సూచిస్తుంది. పిల్ల చదువులపై శ్రద్ధ చూపుతారు. వారి విజయాలు సంతృప్తినిస్తాయి.
డిసెంబర్ :- ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. మీ విజయాలకు మీ సోదరులు మీకు అత్యంత సహాయకారులుగా ఉంటారు. ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది. మీ ఆదాయవనరులు అనూహ్యంగా పెరుగుతాయి. మీ సంకల్ప శక్తి పెరిగి మిమ్ములను విజయానికి దగ్గరచేస్తుంది.
జనవరి : – ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. ప్రభుత్వ సంబంధ ఆదాయములు పెరుగుట, పుణ్యక్షేత్ర సందర్శనములు గృహమున మంగళతోరణములు శుభప్రదమైన ఆనందదాయకమైన కలయికలు వాతావరణం. అనవసర ఖర్చులు తగ్గించుకొనుట మంచిది.
ఫిబ్రవరి :- ఈ వారం మీకు మధ్యస్తముగా ఉన్నది. ఇతరులతో వాదనలు కలసిరాకపోగా మానసిక ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉ ంటుంది. సద్గుణాలను పెంచుకుని ఆధ్యాత్మికంగా సాగటం వలన ప్రయోజనం ఉంటుంది. ప్రయాణాలు కలసి వస్తాయి. ఆకస్మిక ధనలాభంతో ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది.
మార్చి: - ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. నేత్ర, ఉదర సంబంధ అనారోగ్య సమస్యలు ఉంటాయి. మీమీద పైవారి ఒత్తిడి ఉండటం వలన నిద్రలేమిని అనుభవించవలసి ఉంటుంది. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. చెడు సావాసాలు చేయడం వలన అధికంగా ధనం ఖర్చు.