Ugadi Rasi Phalalu 2024: కన్య రాశి ఉగాది రాశి ఫలాలు.. క్రోధి నామ సంవత్సరం అన్నింటా అనుకూలమే
28 March 2024, 12:08 IST
- Ugadi Rasi Phalalu 2024: కన్య రాశి ఉగాది రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోవచ్చు. శ్రీ క్రోధి నామ సంవత్సర జాతక ఫలాలను పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. ఆరోగ్యం, కెరీర్, ఆర్థికం, ప్రేమ విషయాలలో ఈ నూతన సంవత్సరం ఎలా ఉండబోతోంది? నెల వారీ ఫలితాలు ఎలా ఉన్నాయి? ఇక్కడ చూడండి.
Ugadi Rasi Phalalu 2024: కన్యా రాశి ఉగాది రాశి ఫలాలు
శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది రాశి ఫలాలు కన్య రాశి వారికి అనుకూలంగా ఉన్నాయని పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు.
ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్త నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించిన జాతకులు కన్య రాశి పరిధిలోకి వస్తారు.
శ్రీ క్రోధినామ సంవత్సరంలో కన్య రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 4, అవమానం 5 పాళ్లుగా ఉంది.
బృహస్పతి భాగ్య స్థానమునందు సంచరించుట చేత, శని 6వ స్థానమునందు సంచరించుట చేత, రాహువు ఏడవ స్థానము నందు సంచరించుట చేత మరియు కేతువు 1వ స్థానము నందు సంచరించుట చేత కన్యరాశి వారికి ఈ సంవత్సరంలో అనుకూల ఫలితాలున్నాయి.
కన్య రాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో ఆరో స్థానములో శని అనుకూలత వలన, భాగ్యస్థానములో గురుని శుభదృష్టి చేత మీరు చేసేటటువంటి ప్రతీ పనియందు విజయాన్ని పొందెదరు.
కోపాన్ని జయించాలి
కన్యారాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరం ధనలాభం, కీర్తిలాభం కలుగును. జన్మరాశియందు కేతువు ప్రభావంచేత మరియు కళత్ర స్థానమునందు రాహువు ప్రభావం చేత ఈ రాశి వారికి పనుల యందు ఒత్తిళ్ళు, కుటుంబము నందు సమస్యలు ఏర్చడు సూచన.
కోపాన్ని నియంత్రించుకున్నట్లయితే ఈ రాశివారికి శుభ ఫలితములు అధికముగా కలుగును ఉద్యోగస్తులకు ఉద్యోగంలో పని ఒత్తిళ్ళు అధికముగా ఉండును. అయిప్పటికి శని, గురుల అనుకూలత వలన ఉద్యోగంలో ఉన్నతస్థానాన్ని పొందెదరు.
వ్యాపారస్తులకు ఈ సంవత్సరం అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నది. వ్యాపారస్తులకు ధనలాభం, కీర్తలాభం మరియు జయము కలుగును. విద్యార్థులకు ఈ సంవత్సరం ఒత్తిళ్ళు అధికముగా ఉన్నప్పటికి అనుకున్న విధముగా సఫలీకృతమయ్యెదరు.
స్త్రీలకు కుటుంబ సమస్యలు వేధించును. ఇష్టమైన వస్తువు కోసం ధనాన్ని ఖర్చు చేసెదరు. రైతాంగం, సినీరంగాల వారికి అనుకూల ఫలితాలు కలుగును.
కన్య రాశి వారి ప్రేమ జాతకం 2024-25
కన్యా రాశి వారికి ఈ సంవత్సరం ప్రేమపరమైనటువంటి విషయాలు అనుకూలించును. జీవిత భాగస్వామితో అనందముగా గడిపెదరు. భోగమును, ఆనందమును పొందెదరు. జీవిత భాగస్వామితో దైవదర్శనాలు వంటివి అనుకూలించును.
కన్య రాశి వారి ఆర్థిక జాతకం 2024-25
కన్యారాశి వారికి ఈ సంవత్సరం ఆర్థికపరంగా అభివృద్ధి కలిగించును. ధనలాభము, ఆర్థికలాభము, జయము కలుగును. అప్పుల బాధనుండి బయటపడెదరు.
కన్యా రాశి వారి కెరీర్ 2024-25
కన్యారాశి వారికి ఈ సంవత్సరం కెరీర్ పరంగా చాలా అనుకూలమైనటువంటి సంవత్సరం. నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ప్రమోషన్లు వంటివి అనుకూలించును. వ్యాపారస్తులకు వ్యాపారాభివృద్ధి కలుగును.
కన్యా రాశి వారి ఆరోగ్యం 2024-25
కన్యారాశివారికి ఈ సంవత్సరం గత కొంతకాలంగా ఏవైతే ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయో ఆ సమస్యల నుండి బయటపడెదరు. ఆరోగ్యాభివృద్ధి కలుగును. కుటుంబ సౌఖ్యం, అనందము, ఆరోగ్యము కలుగు సంవత్సరం. ఈ సంవత్సరం ఆరోగ్యపరంగా అనుకూలించును.
కన్యా రాశి వారు చేయదగిన పరిహారాలు
కన్యా రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందాలంటే విఘ్నేశ్వరుడి పూజించాలి. సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయడం వలన శుభఫలితాలు కలుగుతాయి.
గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, దుర్గా దేవిని పూజించడం, సుబ్రహ్మణ్యుని ఆరాధించడం వలన మరింత శుభఫలితాలు కలుగుతాయని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
ధరించాల్సిన రత్నం: కన్య రాశి వారు ధరించవలసిన నవరత్నం పచ్చ.
ప్రార్థించాల్సిన దైవం: కన్య రాశివారు పూజించవలసిన దైవం విష్ణువు.
కన్య రాశి వారికి ఉగాది నెలవారీ రాశి ఫలాలు 2024-25
ఏప్రిల్: ఈ మాసం అన్ని రంగాల వారికి కలసివస్తుంది. అదనపు ఆదాయం. కుటుంబలో అనందము. వివాహ, గృహ, వ్యాపారాలలో అభివృద్ధి. విద్యార్థులకు విజయం. వివాహ సంబంధిత కార్యక్రమాలు ముందుకు సాగుతాయి.
మే: ఈ మాసం మీకు శుభాశుభ ఫలితములతో మధ్యస్థముగా ఉన్నది. శ్రమకు తగిన అదాయం. ద్రవ్యహాని. మానసిక అందోళన. వివాహాది శుభకార్యములు ముందుకు సాగును.
జూన్: ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుండును. వ్యాపారాలలో ఆదాయం తగ్గుతుంది. అనారోగ్య సమస్యలు వేధించును. కొన్ని పనులలో అనుకోని ఇబ్బందులు కలుగును.
జూలై: ఈ మాసం కన్య రాశి జాతకులకు అనుకూలంగా లేదు. ధనవ్యయము అధికమగును. కొన్ని ఇబ్బందులు వలన ప్రశాంతత చేకూరదు. అనవసర ప్రయాణములు వలన చికాకులు.
ఆగస్టు: ఈ మాసం మీకు మధ్యస్థముగా ఉన్నది. శారీరక శ్రమ. కార్యసిద్ధి. ఆస్తి విషయమై అనుకోని సమస్యలు రాగలవు. ఆయుధపీడ. వివాహాది శుభకార్యములు.
సెఫ్టెంబర్: ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. అధిక శ్రమ. అనుకోని చికాకులేర్పడును. వ్యాపారంపై పెట్టుబడులకై చేయు ప్రయత్నములు అతికష్టం మీద ముందుకు సాగును.
అక్టోబర్: ఈ మాసం మీకు మధ్యస్థం. వివాహాది శుభకార్యములు అలస్యమగును. చికాకులు కలుగును. కొన్ని విషయములు అనందాన్నిస్తాయి. మిత్రులతో చర్చలు. రాజకీయ నాయకులకు సంఘంలో గుర్తింపు లభిస్తుంది.
నవంబర్: ఈ మాసం కన్యా రాశి జాతకులకు మధ్యస్తం. ఆరోగ్యము అనుకూలించును. స్నేహితులతో విహారయాత్రలు చేయుదురు. కొన్ని అనుకోని బాధ్యతలు మీరు తీసుకోవలసి వస్తుంది. నిరుద్యోగులకు అనుకూల సమయం. ధనవ్యయం వలన ఇబ్బందులు.
డిసెంబర్: ఈ మాసం మీకు మధ్యస్థం. నూతన స్నేహితులతో శుభ వేడుకల్లో పాల్గొంటారు. శ్రమకు తగిన ఫలితం. శత్రువులు మిత్రులవుతారు. ఒడిదుడుకులు తగ్గుతాయి. ఉద్యోగస్తులకు కొంత ఇబ్బందికర కాలము.
జనవరి: ఈ మాసం మీకు ప్రతికూల ఫలితాలున్నాయి. అనుకోని సమస్యలు ఇబ్బంది పెట్టును. అందోళన. కలహములు. ధనవ్యయము. దూరప్రయాణములు. అనారోగ్యం వలన ఇబ్బందులు కలుగును. దైవక్షేత్ర దర్శనము. ఇంటి శుభకార్యక్రమ ప్రయత్నాలు వాయిదాపడతాయి.
ఫిబ్రవరి: ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. శుభమూలక ధనవ్యయము. ప్రయాణములలో చోరభయము. ధనవ్యయము. అసహనం పెరుగుట. అనారోగ్య సూచనలు. మాటపడుట. అనుబంధాలు బలపడుటపై అధికారులకు సహాయపడుట.
మార్చి: ఈ మాసం కన్య రాశి జాతకులకు అనుకూలంగా లేదు. వ్యాపారస్తులకు అభివృద్ధి. కొన్ని వ్యాపారములు లాభించును. ప్రభుత్వ అధికారుల వలన ఇబ్బందులు. రాజకీయ నాయకులు గుర్తింపు కోసం నూతన వ్యవహారములను సాగించును.