తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Ganga Pushkaralu 2023: గంగానది పుష్కర స్నాన ఫలితం తెలుసా?

Ganga Pushkaralu 2023: గంగానది పుష్కర స్నాన ఫలితం తెలుసా?

HT Telugu Desk HT Telugu

07 April 2023, 9:31 IST

google News
    • Ganga Pushkaralu 2023: పుష్కర స్నానం ఒకసారి చేస్తే పన్నెండు సంవత్సరాల కాలం పన్నెండు పుణ్య నదులలో స్నానం చేసిన పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
హరిద్వార్ వద్ద గంగా నది
హరిద్వార్ వద్ద గంగా నది (Rameshwar Gaur)

హరిద్వార్ వద్ద గంగా నది

Ganga Pushkaralu 2023: నీటిలో రెండు శక్తులు ఉన్నాయని వేదం చెబుతోంది. దాహార్తిని తీర్చడం, శుభ్రపరచడం అనే రెండు బాహ్య శక్తులైతే అంతరంగికంగా మేధ్యం, మార్జనం అనే శక్తులు ఉన్నాయని వేదం వివరిస్తుంది. మేధ్యం అంటే నదిలో స్నానం చేసి మూడుసార్లు మునక వేస్తే తెలిసీ తెలియక చేసే పాపాలు పోతాయి. అలాగే మార్జన అంటే నీటిని చల్లుకోవడం.. అంటే సంప్రోక్షణ చేయడమని, దీని వలన ద్రవ్య శుద్ధి జరుగుతుందని పురాణాలు చెబుతున్నాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

నీరు నారాయణ స్వరూపం కనుక ఆయన స్పర్శచే పాపాలు స్నానం ద్వారా పటాపంచలు అవుతాయని విశ్వసిస్తారు. తీర్థ స్నానం ఉ త్తమం. దానికంటే నదీ స్నానం ఉత్తమం. దానికంటే పుష్కర సమయ నదీ స్నానం ఉత్తమోత్తమం. ఆ సమయంలో దేవతలంతా పుష్కరునితో నదిలో ప్రవేశిస్తారని హిందువుల విశ్వాసం.

త్రికరణాలతో చేసే పాపాలు పోతాయని, పుష్కర స్నానం ఒకసారి చేస్తే పన్నెండు సంవత్సరాల కాలం పన్నెండు పుణ్య నదులలో స్నానం చేసిన పుణ్యం లభిస్తుందని, అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం లభిస్తుందని ఋషి వాక్కు. మోక్షప్రాప్తి కలుగుతుందని బ్రహ్మాండ పురాణం వర్ణిస్తుంది.

నదీ జలాలను సేవిస్తే పాప ప్రక్షాళన జరుగుతుందని, నదీ జలాలలో స్నానమాచరిస్తే మాంద్యం, అలసత్వం మొదలైన శారీరక రుగ్మతలు నశిస్తాయని తైత్తరీయ ఉపనిషత్తు వివరిస్తుంది.

గంగా నది పుష్కర సమయంలో చేసేటటువంటి దానం, జపము, తపము. హెూమాలు, తర్పణాలు వంటి వాటికి విశేషమైనటువంటి ఫలితము లభిస్తుంది. గతించినటువంటి పితృ దేవతలకు గంగానది పుష్కరాలలో విడిచేటటువంటి తిలతర్పణాలకు విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది.

ఇసుకతో కాని, మట్టితో కాని పార్థివ లింగాన్ని చేసి పూజించాలంటారు. నదీ తీరంలోని ఇసుకను నదిలోకి వేయాలంటారు. పురోహితులు భక్తుల తలపై మూడు దోసిళ్ళ నీళ్ళతో ఆశీస్సులు అందజేస్తారు. గోదావరికి దీపదానం కూడా చేస్తారు.

- బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
తదుపరి వ్యాసం