తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Coconut Importance: కొబ్బరికాయ ప్రాధాన్యత ఏమిటి? కుళ్లిన కొబ్బరికాయ అపశకునమా?

Coconut importance: కొబ్బరికాయ ప్రాధాన్యత ఏమిటి? కుళ్లిన కొబ్బరికాయ అపశకునమా?

HT Telugu Desk HT Telugu

26 September 2023, 10:38 IST

google News
  • Coconut importance: హిందూ సంప్రాదాయంలో పూజల్లో తప్పకుండా వాడేది కొబ్బరికాయ. దాన్ని శుభసూచకంలా భావిస్తారు. మరి దానికున్న విశిష్టత, ప్రాముఖ్యత గురించి వివరంగా తెలుసుకోండి. 

కొబ్బరికాయ విశిష్టత
కొబ్బరికాయ విశిష్టత (freepik)

కొబ్బరికాయ విశిష్టత

భారతదేశం అనేక సంప్రదాయాలతో కూడి ఉన్నటువంటి దేశం. భారతీయ సంప్రదాయాల్లో, ఆచార వ్యవహారాలలో ప్రతీ పనిలో శాస్త్రము, నిగూఢ రహస్యం దాగి ఉంటాయి. కొబ్బరికాయలను శ్రీ ఫలాలని అనేవారు. శ్రీఫలం అంటే లక్ష్మీ ఫలం అని అర్థం. అంటే సర్వసిద్దిదాయకమన్నమాట. ధర్మ అర్ధ కామ మోక్ష ఈ నాలుగు పురుషార్థాల్లో నారీకేళం ప్రశస్త స్థానాన్ని సంపాదించింది. పురాణాల ప్రకారం కొబ్బరికాయ మానవుని శరీరంలో తల భాగంగా, కొబ్బరి పీచు మనిషి యొక్కజుట్టుగా చెప్పడింది. కొబ్బరికాయలో ఉండే నీరు మానవశరీరంలో ఉండే రక్తంగా, అలాగే ఆ కాయను కొట్టిన తరువాత కనబడేటటువంటి తెల్లని కొబ్బరి మనసుకు ప్రతీకగా చెప్పబడింది. ఏ ఫలమైనా ఎంగిలి చేయడానికి ఆస్కారం ఉంటుంది. కొబ్బరికాయకు అటువంటి ఆస్కారం లేదు. అందుచేతనే కొబ్బరికాయను దేవుడికి కొట్టేటప్పుడు మానవునిలో కల్మషం, అహంకారం, ఈర్ష్య, ద్వేషాలన్నీ తొలగి కొబ్బరిలో ఉన్నటువంటి తెల్లటి స్వచ్చమైన మనస్సుతో భక్తి శ్రద్ధలతో భగవంతునికి తన హృదయాన్ని అర్చిస్తున్నాను అని చెప్పే సంకేతంగా హిందువులు భగవంతుని దగ్గర కొబ్బరికాయ కొడతారు.

కుళ్లిన కొబ్బరి అపశకునమా?

ఇక్కడ మరొక విషయం ఏంటంటే.. కొబ్బరికాయ కుళ్లింది అని ఏదో కీడు జరుగుతుంది అనుకోవడం పొరపాటు. అలా కొబ్బరికాయ కుళ్లితే మరొక కాయని కొట్టడం మంచిది. అలాగే కొబ్బరికాయలో పువ్వు వచ్చిందని ఏదో శుభం జరుగుతుందని అనుకోవడం కూడా పొరపాటేనట. బెల్లం, పెరుగు, కొబ్బరికాయ, ఉప్పు, బియ్యం మంచి శకునాల కిందికి వస్తాయి. వీటిలో కొబ్బరికాయ ప్రాముఖ్యత ఎక్కువ.

కొబ్బరి వినియోగం:

దీని మొదటి ఉపయోగం లోపలి భాగాన్ని తినవచ్చు. పలురకాల వంటల్లో దీన్ని ఉపయోగిస్తారు. ఏ యాత్రకైనా వెళ్ళేటప్పుడు, వివాహ సమయాల్లో యజ్ఞం అనుష్టానం, పూజలు మొదలగు కార్యక్రమాల్లో కొబ్బరికాయ విలువ అందరికీ తెలిసిందే. భారతీయ సాహితీ గ్రంథాల్లో దీని ప్రాముఖ్యతను గుర్తించి రాశారు. కొన్ని ప్రాంతాల్లో రక్షాబంధన్‌ కార్యక్రమం జరిగే ముందు కొబ్బరికాయ పగులకొట్టి, దాని ముక్కలను ఇతరులకు పంచిన తరువాత ఆ కార్యక్రమం మొదలవుతుంది. ఇంటిముందు కూడా కొబ్బరి మొక్కలను పెంచటం ఆచారంగా వస్తోంది. క్షత్రియ జాతుల్లో పుత్రుడి తల దగ్గర కొబ్బరికాయను వుంచే ఆచారం ఉందట. బాలుడు జన్మించగానే కొబ్బరికాయ పగలకొడతారు. మనిషి చనిపోయినపుడు కూడా కొన్ని జాతుల్లో కొబ్బరికాయను పాడితో కడతారు.

ఇలా మానవ జీవిత దైనిందిత కార్యక్రమాల్లో కొబ్బరికాయ మహత్యం అంతా ఇంతా కాదని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

టాపిక్

తదుపరి వ్యాసం