April month planets transit: ఏప్రిల్ నెలలో గ్రహాల సంచారం.. ఈ రాశులకు అద్భుతమైన నెలగా మారబోతుంది
27 March 2024, 10:26 IST
- April month planets transit: ఏప్రిల్ నెలలో బుధుడు, సూర్యుడు, శుక్రుడు, కుజ గ్రహాలు తమ రాశి చక్రాలను మార్చుకోబోతున్నాయి. ఫలితంగా కొన్ని రాశుల వారికి ఏప్రిల్ నెల అద్భుతంగా గడవబోతుంది. ఏయే రాశుల వాళ్ళకి ఈ అదృష్టం దక్కుతుందో చూద్దాం.
ఏప్రిల్ నెలలో గ్రహాల సంచారం
April month planets transit: శాస్త్రం ప్రకారం అన్ని గ్రహాలు నిర్దిష్ట విరామం తర్వాత రాశి చక్రాలను మారుస్తాయి. ఒక రాశి నుంచి మరొక రాశికి సంచారం చేసినప్పుడు మొత్తం 12 రాశుల మీద సానుకూల, ప్రతికూల ప్రభావం చూపిస్తుంది.
ఏప్రిల్ నెలలో అతిపెద్ద గ్రహాలు తమ రాశి చక్రాలను మార్చుకోబోతున్నాయి. బుధుడు వచ్చే నెలలో తిరోగమన దశ, అస్తంగత్వ దశలో సంచరిస్తాడు. మళ్ళీ ఉదయించడం కూడా ఇదే నెలలో జరుగుతుంది. గ్రహాల రాజు సూర్యుడు, కుజుడు, శుక్రుడు కూడా రాశి చక్రాలను మార్చుకుంటారు. ఈ గ్రహ సంచరాలు కొన్ని రాశులకు శుభప్రదంగా ఉండబోతున్నాయి. ఏప్రిల్ నెలలో జరిగే గ్రహ సంచారాల గురించి తెలుసుకుందాం.
మేష రాశిలో బుధుడి తిరోగమనం
ఏప్రిల్ 2 నుంచి బుధుడు మేషరాశిలో తిరోగమనం చేస్తాడు. ఈ తిరోగమనం మానవ జీవితాలపై సానుకూల, ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది. కొన్ని రాశుల వారు లాభాలను పొందితే, మరి కొందరు అప్రమత్తంగా ఉండాలి. తిరోగమనం కారణంగా మేషం, వృషభం, మిథునం, సింహం, ధనుస్సు, మకరం, కుంభం, మీన రాశులు చాలా ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితిలో గణనీయమైన వృద్ధి కనిపిస్తుంది. వ్యాపారం నడుపుతున్నట్లయితే లాభాలు కలుగుతాయి.
మేష రాశిలో బుధుడి అస్తంగత్వం
తిరోగమన స్థితిలో ఉన్న బుధుడు ఏప్రిల్ 4న అస్తంగత్వ దశలోకి వెళ్తాడు. తెలివితేటలు, విద్య, కమ్యూనికేషన్ నైపుణ్యాలు మొదలైన వాటికి బుధుడు కారకుడిగా భావిస్తారు. అస్తంగత్వం కారణంగా బలహీనమైన జ్ఞాపకశక్తి, ఏకాగ్రత లేకపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటారు. అభద్రతా భావం చుట్టుముడుతుంది. కర్కాటకం, సింహం, కన్య, తులారాశి వారికి సవాళ్లు ఎదురవుతాయి. ఏ పని చేసిన విజయం అందుకోవడంవ జాప్యం జరుగుతుంది. ఒత్తిడి లేకుండా ఉండేందుకు ప్రయత్నించాలి.
మేష రాశిలో సూర్య సంచారం
సూర్యుడు ఏప్రిల్ 13న మేష రాశిలోకి ప్రవేశిస్తాడు. అక్కడ మే 14 వరకు ఉండి తర్వాత వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. మేష రాశిలో సూర్యుని సంచారం కారణంగా బృహస్పతితో కలయిక జరుగుతుంది. ఈ రెండు గ్రహాల సంయోగం 12 సంవత్సరాల తర్వాత జరుగుతుంది. ఇది మేష రాశితో పాటు అనేక రాశుల వారికి ఫలవంతమైనదిగా ఉంటుంది. కుటుంబంతో గడిపేందుకు నాణ్యమైన సమయాన్ని పొందుతారు. ఆర్థిక వృద్ధి, భౌతిక సౌకర్యాలు, విలాసాలతో కూడిన జీవితం గడుపుతారు.
మీనరాశిలో ఉదయించబోతున్న బుధుడు
గ్రహాల రాకుమారుడు బుధుడు ఏప్రిల్ 19న మీన రాశిలో ఉదయిస్తాడు. ఈ కారణంగా వ్యాపారం, షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారికి వృద్ధి లభిస్తుంది. అదృష్టం వెన్నంటే ఉంటుంది. మీన రాశిలో బుధుడు ఉదయించడం వల్ల మేషం, మిథునం, సింహం, కన్య, వృశ్చికం, మీనరాశుల వారికి వ్యాపారం, ఉద్యోగంలో చాలా ప్రయోజనాలు లభిస్తాయి. వ్యాపారులు పెద్ద ఒప్పందాలపై సంతకాలు చేస్తారు. నిరుద్యోగులకు మెరుగైన ఉద్యోగం లభిస్తుంది.
మీన రాశిలో కుజుడి సంచారం
అసురుల అధిపతి అంగారకుడు ఏప్రిల్ 23న మీన రాశిలోకి వెళతాడు. ఇప్పటికే అక్కడ రాహువు, బుధుడు సంచరిస్తూ ఉంటారు. ఫలితంగా ఈ రెండు గ్రహాలతో సంయోగం ఏర్పడుతుంది. ఈ కలయిక కొన్ని రాశుల వారికి శుభంగా ఉన్నప్పటికీ మరికొన్ని రాశుల వారు మాత్రం అనేక అడ్డంకులను అధిగమించాల్సి వస్తుంది.
మేష రాశిలో శుక్రుడి సంచారం
అందం, సామరస్యం, ప్రేమ, సంపదకు కారకుడుగా ఉండే శుక్రుడు ఏప్రిల్ 25న మేష రాశిలోకి వెళ్లి మే 19 వరకు అక్కడే ఉంటాడు. మేష రాశిలో శుక్రుడు 12 సంవత్సరాల తర్వాత బృహస్పతితో శుభసంయోగం ఏర్పడుతుంది. మేషం, వృషభం సహా అనేక రాశుల వారికి ఇది అద్భుతమైన సమయం.
ఏప్రిల్ నెలలో అనేక గ్రహాల సంచారం వల్ల మేషం, వృషభం, మిథునం, కన్య, వృశ్చికం, మీన రాశుల వాళ్లు ఎక్కువ ప్రయోజనాలు పొందుతారు. ఈనెల వీరికి అద్భుతమైన సమయంగా ఉంటుంది. కుటుంబంతో బంధాలు బలపడతాయి. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగులకు ప్రశంసలందుతాయి. లక్ష్యాలను సాధించడంలో ఉన్నతాధికారులు ఉద్యోగులకు మద్దతుగా నిలుస్తారు. వ్యాపారాన్ని నడుపుతున్న వాళ్ళు డబ్బులు పెట్టుబడి పెట్టడం మంచిది.