Rahul Gandhi on Veer Savarkar: బ్రిటిషర్లకు సాయం చేశాడు.. వీర్ సావర్కర్‌పై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు
17 November 2022, 17:30 IST
Rahul Gandhi on Veer Savarkar: బ్రిటిషర్లకు సాయం చేశాడు.. గాంధీ, నెహ్రూలకు నమ్మక ద్రోహం చేశాడు అంటూ వీర్ సావర్కర్‌పై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పుడీ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
రాహుల్ గాంధీ
Rahul Gandhi on Veer Savarkar: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి వీర్ సావర్కర్‌ను తెరపైకి తీసుకొచ్చారు. ఈసారి మరింత దుమారం రేపే వ్యాఖ్యలు చేశారు. ఆయన బ్రిటీషర్లకు సాయం చేశారని.. గాంధీ, నెహ్రూ, సర్దార్ పటేల్‌లాంటి నేతలకు నమ్మక ద్రోహం చేశారని రాహుల్ ఆరోపించడం గమనార్హం. భారత్ జోడో యాత్రలో భాగంగా మహారాష్ట్రలోని అకోలాలో మీడియాతో మాట్లాడిన రాహుల్ ఈ సంచలన ఆరోపణలు చేశారు.
"బ్రిటీష్ వారికి వీర్ సావర్కర్ రాసిన లేఖలో.. 'మీ వీర విధేయ సేవకుడిగా ఉంటానని ప్రమాణం చేస్తున్నాను' అని చెబుతూ దానిపై సంతకం చేశారు. బ్రిటీష్ వారికి సావర్కర్ సాయం చేశారు. భయంతో ఆ లేఖపై సంతకం చేసి మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్‌లాంటి నేతలను సావర్కర్ మోసం చేశారు" అని రాహుల్ గాంధీ విమర్శించారు.
అంతేకాదు వీర్ సావర్కర్ బ్రిటీషర్ల నుంచి పెన్షన్ తీసుకుంటూ, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పనిచేశారనీ ఆరోపించారు. "అండమాన్ జైల్లో ఉన్నప్పుడు సావర్కర్ బ్రిటీషర్లకు లేఖ రాశారు. తనను క్షమించి, రిలీజ్ చేయాల్సిందిగా వేడుకున్నారు. వీర్ సావర్కర్ బ్రిటీషర్ల నుంచి పెన్షన్ తీసుకొని కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పని చేశారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత బ్రిటీష్ ప్రతిపాదనను అంగీకరించి, వాళ్లతో చేతులు కలిపారు. బిర్సా ముండా 24 ఏళ్ల వయసులోనే బ్రిటీష్ వాళ్లతో పోరాడారు. సావర్కర్‌కు, బిర్సా ముండాకు అదే తేడా" అని రాహుల్ అన్నారు.
రాహుల్ కామెంట్స్‌పై దుమారం
రాహుల్ గాంధీ కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై సావర్కర్ మనవడు రంజిత్ సావర్కర్ సీరియస్ అయ్యారు. రాహుల్ గాంధీపై తాను ముంబైలోని శివాజీ పార్క్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేశారు. సావర్కర్‌ను రాహుల్ అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సావర్కర్‌ను ఇలా రాహుల్, కాంగ్రెస్ అవమానించడం ఇదే తొలిసారి కాదని అన్నారు.
"మన స్వాతంత్ర్య సమరయోధున్ని అవమానించినందుకు నేను పోలీసులకు కేసు ఫైల్ చేస్తాను. ఈ విషయంలో రాహుల్ గాంధీ పదేపదే తప్పు చేస్తున్నారు. 2017లోనే ఆయన ఇలాగే చేశారు" అని రంజిత్ చెప్పారు. వీర్ సావర్కర్‌ను పదే పదే అవమానిస్తూ కాంగ్రెస్ ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు.