Cheap Bikes 2021: లక్షలోపు ధరలో 2021లో బెస్ట్ బైక్స్ ఇవే.. ఓ లుక్కేయండి
24 January 2022, 21:36 IST
- మోటార్ సైకిళ్లు, స్కూటర్లకు డిమాండ్ పెరిగింది. ప్రధానంగా కమ్యూటర్ సెగ్మెంట్ టూ-వీలర్లను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఎప్పటిలానే ఈ సంవత్సరం కూడా ఈ విభాగానిదే ఆధిపత్యం. ధర తక్కువగా ఉండి, మైలేజ్ ఎక్కువగా ఇచ్చే మోటార్ సైకిళ్లపై వినియోగదారులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.
తక్కువ ధరలో బైక్స్
Cheap Bikes 2021.. 2020తో పోలిస్తే 2021లో ఆటో పరిశ్రమ మిశ్రమ ఫలితాలు అందుకుంది. కరోనా మహమ్మారి కారణంగా కొంత ఒడుదొడుకులకు గురైనప్పటికీ తిరిగి పుంజుకుంది. ముఖ్యంగా ప్రజా రవాణాకు బదులు ప్రైవేటు రవాణాను అధికంగా ఉపయోగిస్తున్నారు. ఈ కారణంగా మోటార్ సైకిళ్లు, స్కూటర్లకు డిమాండ్ పెరిగింది. ప్రధానంగా కమ్యూటర్ సెగ్మెంట్ టూ-వీలర్లను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఎప్పటిలానే ఈ సంవత్సరం కూడా ఈ విభాగానిదే ఆధిపత్యం. ధర తక్కువగా ఉండి, మైలేజ్ ఎక్కువగా ఇచ్చే మోటార్ సైకిళ్లపై వినియోగదారులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో లక్ష లోపు కాస్ట్లో 2021లో టాప్ మోటార్ సైకిళ్లేంటో ఇప్పుడు చూద్దాం.
బజాజ్ పల్సర్ 125..
లక్షలోపు ధరలో పవర్ఫుల్ బైక్ కావాలంటే పల్సర్ 125 అత్యుత్తమమైంది. పల్సర్ 150 డిజైన్‌నే కలిగి ఉండటమే కాకుండా మైలేజ్ విషయంలో ఆ బైక్ కంటే మెరుగ్గా ఉంటుంది. బాడీ ప్యానెళ్లు, టైర్లు, డిస్క్ బ్రేకులు, ఛేసిస్, సస్పెన్షన్ ప్రతి అంశంలోనూ 150సీసీ సెగ్మెంట్ మాదిరిగానే పనితీరు ఉంటుంది. ఆ బైక్ కు 125సీసీ మోడల్‌కు ఉన్న పెద్ద వ్యత్యాసం ఫ్యూయల్ ట్యాంక్ మాత్రమే. పల్సర్ 125 ఫ్యూయల్ ట్యాంక్ పరిమాణం కొంచెం చిన్నగా ఉంటుంది. ఫలితంగా 4 కేజీల బరువు తగ్గుతుంది. ఇవి కాకుండా స్టైలింగ్, డిజైన్ లాంటి అన్ని విషయాల్లో సేమ్ టు సేమ్ ఉంటుంది. ఎక్స్ షోరూంలో ఈ బైక్ ధర రూ.72,122 నుంచి రూ.80,218లుగా కంపెనీ నిర్దేశించింది.
టీవీఎస్ రైడర్..
చాలా కాలం తర్వాత టీవీఎస్ సంస్థ 125 సీసీ సెగ్మెంట్లో ఓ బైక్‌ను లాంచ్ చేసింది. అదే టీవీఎస్ రైడర్ మోడల్. బజాజ్ ఎన్ఎస్ 125 బైక్‌ను పోలి ఉండే ఈ మోటార్ సైకిల్లో ఎన్నో అధునాతన ఫీచర్లు ఉన్నాయి. ఇది 124.8 సీసీ బీఎస్6 ఇంజిన్‌ను కలిగి ఉండి 11.2 బీహెచ్పీ బ్రేక్ హార్స్ పవర్, 11.2 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కమ్యూనిటీ మోటార్ సైకిల్ సెగ్మెంట్లో అత్యుత్తమ బైక్‌గా సంస్థ పేర్కొంది. ఎక్స్ షోరూంలో ఈ మోటార్ సైకిల్ ధర రూ.77,500 నుంచి 90,989 మధ్యలో ఉంటుంది.
హోండా ఎస్పీ125..
మార్కెట్లో బాగా విజయవంతమైన మోడల్ సీబీ షైన్ ఎస్పీ. దీనికి సంబంధించిన బీఎస్6 మోడల్ ను హోండా ఈ ఏడాది విడుదల చేసింది. పాత మోడల్ మాదిరిగానే అన్ని ఫీచర్లు ఇందులోనూ ఉంటాయి. అంతేకాకుండా ఆ బండితో పోలిస్తే ప్రీమియం లుక్ తో మరింత స్టైలిష్ గా కనిపిస్తుంది. ఈ ఎస్పీ125 మోడల్ రెండు వేరియంట్లలో లభ్యమవుతుంది. డ్రమ్, డిస్క్ బ్రేక్స్ ను కలిగి ఉంటుంది. ఇది 124 సీసీ ఇంజిన్ ను కలిగి ఉండి 10.72 బీహెచ్పీ బ్రేక్ హార్స్ పవర్, 10.9 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఎక్స్ షోరూంలో ఈ బైక్ ధర రూ.78,844 నుంచి రూ. 83,134 రేంజ్లో ఉంటుంది.
బజాజ్ ఎన్ఎస్ 125..
నేకెడ్ టైప్ కావాలంటే కమ్యూటర్ మోటార్ సైకిళ్లలో బెస్ట్ ఆప్షన్ ఎన్ఎస్ 125 మోడలే. పల్సర్ సెగ్మెంట్లో వచ్చే ఈ మోటార్ సైకిల్‌కు యువతలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఎక్స్ షోరూంలో ఈ పల్సర్ ఎన్ఎస్125 ప్రారంభ ధర వచ్చేసి రూ.99,192లు ఉంటుంది. సింగిల్ వేరియంట్లో మాత్రమే లభ్యమయ్యే ఈ మోటార్ సైకిల్ నాలుగు రంగుల్లో వస్తుంది. 124.45సీసీ బీఎస్6 ఇంజిన్ ను కలిగి ఉండి 11.6 బీహెచ్పీ బ్రేక్ హార్స్ పవర్, 11ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా ఫ్రంట్ డిస్క్ బ్రేక్, వెనుక డ్రమ్ బ్రేక్స్ ను కలిగి ఉంటుంది. దీని బరువు 144 కేజీలు ఉండగా.. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 12 లీటర్లు ఉంటుంది.