ఇద్దరిపై ఎన్‌ఐఏ ఛార్జిషీట్
24 April 2022, 10:16 IST
- గూఢాచర్యం అభియోగాలపై ఇద్దరు వ్యక్తులపై జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏ ఛార్జిషీటు దాఖలు చేసింది. దేశానికి వ్యతిరేకంగా కుట్రపన్నడం, దేశంపై యుద్దం ప్రకటించడం వంటి అభియోగాలపై ఛార్జిషీటు దాఖలు చేసింది. ఈ కేసులో ఇప్పటికే విశాఖ రక్షణ శాఖ ఉద్యోగుల పాత్రను కూడా గుర్తించారు
జాతీయ దర్యాప్తు సంస్థ
దేశంలో అస్థిరత సృష్టించేందుకు కుట్ర పన్నారనే అభియోగాలపై ఇద్దరు పాకిస్తాన్ జాతీయులపై ఎన్‌ఐఏ ఛార్జిషీటు దాఖలు చేసింది. గుజరాత్‌కు చెందిన అల్తాఫ్ హుస్సేన్ ఘాంచీ భాయ్‌తో పాటు పాకిస్తాన్ జాతీయుడైన వసీమ్‌లపై ఎన్‌ఐ అభియోగాలు మోపింది. ఆంధ్రప్రదేశ్ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు దేశానికి వ్యతిరేకంగా కుట్ర పన్నుతారనే అభియోగాలపై మొదట కేసు నమోదు చేసింది. ఆ తర్వాత గత ఏడాది డిసెంబర్ 23న కేసు దర్యాప్తు ఎన్‌ఐకు బదిలీ చేశారు.
దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడటం, దేశంలో అలజడి సృష్టించేందకు ప్రయత్నించడంతో పాటు కీలకమైన రక్షణ సమాచారాన్ని పాకిస్తాన్ చేరవేసేందుకు ప్రయత్నించడాన్ని గుర్తించారు. భారత రక్షణ దళాలతో పాటు, నేవీకు సంబంధించిన సమాచారాన్ని సేకరించేందుకు వలపు వల విసిరినట్లు గుర్తించారు. రక్షణ సమాచారాన్ని సేకరించేందుకు భారత పౌరుల సహకారాన్ని తీసుకోవడంలో వీరిద్దరి పాత్ర ఉన్నట్లు గుర్తించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలో రక్షణ శాక సిబ్బందితో పరిచయం చేసుకోవడం, ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌ల ద్వారా రక్షణ సిబ్బందిని ట్రాప్‌లో వేసినట్లు గుర్తించారు.
ఈ కేసులో కీలక నిందితుడు అల్తాఫ్ హుస్సేన్ ఘాంచీ భాయ్‌కు పాకిస్తాన్ నుంచి ఆదేశాలు అందేవి. అక్కడి హ్యాండ్లర్ల ఆదేశాల మేరకు భారత్‌లో పనిచేసేవాడు. భారత సిమ్‌కార్డులకు వచ్చే వాట్సాప్ ఓటీపీలను పాక్‌కు చేరవేసేవాడు. వాటి ద్వారా పాకిస్తాన్‌లో ఉన్న హ్యాండ్లర్లు భారత్ ఫోన్ నంబర్లతో రక్షణ సిబ్బందిని వల్లో వేసుకునే వారు. వారిని రకరకాలుగా ప్రలోభ పెట్టి కీలకమైన సమాచారాన్ని సేకరించేవారు. రక్షణ రంగ సంస్థలకు సంబంధించిన కీలక సమాచారం ఇలా పాకిస్తాన్ చేరింది.
ఈ సిమ్ కార్డులన్ని గుజరాత్‌లో ఉన్న భారతీయ మత్స్యకారుల పేరుతో రిజిస్టర్ అయినట్లు ఎన్‌ఐఏ దర్యాప్తులో తేలింది. 2020లో సముద్ర జలాల్లో ఉన్న భారత మత్స్యకారుల్ని అరెస్ట్ చేసిన సమయంలో పాకిస్తాన్ గస్తీ దళాలు ఆ నంబర్లను సేకరించినట్లు గుర్తించారు. వీటిని అక్రమ పద్దతుల్లో భారత్‌కు పంపి వాటిని యాక్టివేట్ చేసినట్లు దర్యాప్తులో తేలింది. గుజరాత్‌లో ఉన్న అల్తాఫ్ హుస్సేన్ అలాంటి ఏడు సిమ్ కార్డులను పాకిస్తాన్ హ్యాండ్లర్ల ఆదేశాల మేరకు యాక్టివేట్ చేశాడు. ఈ కేసులో అల్తాఫ్‌ను 2021 అక్టోబర్ 25న అరెస్ట్ చేశారు.
ఇదే కేసులో అరెస్టైన వసీం ఆన్‌లైన్ క్రిప్టో కరెన్సీ ద్వారా భారత ఏజెంట్లకు నగదు పంపుతున్న అభియోగాలపై అరెస్ట్ చేశారు. రక్షణ సమాచారాన్ని అందించిన వారికి నగదు బదిలీ చేయడంలో వసీం కీలకంగా వ్యవహరించాడు. భారత రక్షణ సంస్థల వివరాలు అందించిన వారికి వసీం వివిధ రకాల ప్లాట్‌ఫాంల ద్వారా నగదు బదిలీ చేసినట్లు అభియోగాల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం వసీం పరారీలో ఉన్నాడని, అతని అచూకీ కోసం గాలిస్తున్నట్లు ఎన్‌ఐఏ పేర్కొంది.
టాపిక్