ఏదైనా బ్యాంకుపై ఫిర్యాదు చేయాలనుకుంటున్నారా? ఆర్బీఐ అంబుడ్స్‌మన్ పోర్టల్ మీకోసం!
24 January 2022, 20:42 IST
- బ్యాంక్ లావాదేవీలు, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, డిజిటల్ చెల్లింపులతో సహా మొదలగు అన్ని ఆర్థిక సేవలకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదు చేయాలన్నా ఇప్పుడు ఎంతో సులభం.
- నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు , ఫోన్ పే, గూగుల్ పే లాంటి డిజిటల్ పేమెంట్స్ కంపెనీలపైనా ఫిర్యాదు చేయవచ్చు.
The Reserve Bank of India
మీ బ్యాంక్ ఖాతా లేదా నగదు ఉపసంహరణలకు సంబంధించి ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? ఈ విషయాన్ని మీరు బ్యాంకు దృష్టికి తీసుకెళ్లినా వారి నుంచి సంతృప్తికరమైన స్పందన లభించలేదా? అయితే మీరు నేరుగా ఆ బ్యాంకుపై 'భారతీయ రిజర్వ్ బ్యాంక్' కు ఫిర్యాదు చేయవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవల ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మన్ పథకాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా కస్టమర్ల కు సంబంధించిన వివిధ ఫిర్యాదుల పరిష్కారం (redressal) కోసం ఈ అంబుడ్స్‌మన్ వ్యవస్థ పనిచేయనుంది. దేశంలోని అన్ని బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (NBFCలు), నగదు చెల్లింపు సేవా ఆపరేటర్లు లాంటివి ఏవైనా RBI నియంత్రణలోనే పనిచేయాల్సి ఉంటుంది.
రిజర్వ్ బ్యాంక్ ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మన్ స్కీమ్ (ISO) ఇప్పుడు అమలులో ఉన్నందున బ్యాంక్ లావాదేవీలు, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, డిజిటల్ చెల్లింపులతో సహా అన్ని ఆర్థిక సేవలకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదు చేయాలన్నా ఎంతో సులభం.
కేవలం బ్యాంకులపైనే కాదు, ఈ ISO స్కీమ్ కింద నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (NBFC), ఫోన్ పే, గూగుల్ పే లాంటి డిజిటల్ పేమెంట్స్ కంపెనీలపైనా ఫిర్యాదు చేయవచ్చు. మీ ఫిర్యాదు ఎంతవరకు వచ్చిందో మీ కంప్లయింట్ స్టేటస్ కూడా ట్రాక్ చేయవచ్చు.
ఎలా ఫిర్యాదు చేయాలి?
- రిజర్వ్ బ్యాంక్ అధికారిక వెబ్ పోర్టల్ cms.rbi.orgin లోకి లాగిన్అవ్వండి.
- ‘ఫైల్ కంప్లయింట్’పై క్లిక్ చేయండి
- కిందకనిపించే 'క్యాప్చా'ను ధ్రువీకరించండి.
- అనంతరం పేరు, మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి
- ఎవరిపై ఫిర్యాదు చేయాలో ఎంచుకొని, వివరాలు నమోదు చేయండి
- ఇదివరకే బ్యాంక్ లేదా నగదు ఆపరేటర్‌కు ఫిర్యాదు చేస్తే సదరు ప్రూఫ్ కాపీ, అలాగే వారి నుంచి ఏదైనాజవాబు వస్తే సంబంధిత కాపీని జత చేయండి.
- మీ ఖాతా వివరాలు నమోదు చేయండి
- మీ సమస్య ఏంటో క్లుప్తంగా వివరించండి.
- ఇప్పుడు మీ ఫిర్యాదును రివ్యూ చేసుకొని, సబ్మిట్ కొట్టండి.
ఇంకా ఏవైనా సందేహాలుంటే 'రిజర్వ్ బ్యాంక్' అందించిన ఈ వీడియో ట్యుటోరియల్‌ని కూడా చూడవచ్చు.
ఆన్ లైన్ లో కష్టంగా అనిపిస్తే ఆర్బీఐ అంబుడ్స్‌మన్ టోల్-ఫ్రీ నంబర్ - 14448 కు ఉదయం 9:30 నుండి సాయంత్రం 5:15 వరకు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ సహా ఎనిమిది ప్రాంతీయ భాషలలో ఈ సర్వీస్ అందుబాటులో ఉంది.
ఒకసారి మీరు ఫిర్యాదు నమోదు చేసిన తర్వాత మీ కంప్లయింట్ నమోదైనట్లుగా ధ్రువీకరిస్తూ అందుకు సంబంధించిన నెంబర్ మీ ఫోన్‌కు మెసేజ్ వస్తుంది. ఈమెయిల్ ద్వారా కూడా తెలియజేస్తారు. మీ ఫిర్యాధు ఎంతవరకు వచ్చిందో Track Your Complaint ఆప్షన్ ద్వారా తెలుసుకోవచ్చు.