JEE Main 2023 Exam Dates : మొదలైన జేఈఈ మెయిన్ రిజిస్ట్రేషన్ - జనవరిలో తొలి విడత
15 December 2022, 23:23 IST
- JEE Main 2023 : లక్షలాది మంది విద్యార్థుల నిరీక్షణకు తెరదించుతూ.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ.. జేఈఈ మెయిన్ 2023 నోటిఫికేషన్ విడుదల చేసింది. రెండు విడతల్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది.
జేఈఈ మెయిన్ 2023 నోటిఫికేషన్ విడుదల చేసిన ఎన్టీఏ
JEE Main 2023 : దేశవ్యాప్తంగా లక్షల మంది విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జేఈఈ మెయిన్ (jee main) నోటిఫికేషన్ విడుదలైంది. దేశంలో ప్రసిద్ధిచెందిన ఇంజినీరింగ్ (Engineering) విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈ పరీక్ష షెడ్యూల్ ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (National Testing Agency – NTA) ప్రకటించింది. పరీక్షను రెండు విడతల్లో నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. నోటిఫికేషన్ ప్రకారం.. జనవరిలో తొలి విడత.. ఏప్రిల్ లో రెండో విడత పరీక్షలు జరుగుతాయి. ఇంగ్లీష్, హిందీ, తెలుగు సహా 13 భాషల్లో పరీక్ష నిర్వహిస్తారు.
తొలి విడత జేఈఈ మెయిన్ పరీక్ష వచ్చే ఏడాది జనవరి 24, 25, 27, 28, 29, 30, 31 తేదీల్లో జరుగుతుంది. రెండో విడత పరీక్ష వచ్చే ఏడాది ఏప్రిల్ 6 నుంచి 12 తేదీల్లో నిర్వహిస్తారు. తొలి విడత కోసం గురువారం (డిసెంబర్ 15) నుంచి జనవరి 12వ తేదీ రాత్రి తొమ్మది గంటల వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అదే రోజు రాత్రి 11.50 నిమిషాల లోపు పరీక్ష ఫీజు చెల్లించాలి. ఏ ఏ నగరాల్లో పరీక్షలు నిర్వహిస్తారనేది జనవరి రెండో వారంలో ప్రకటిస్తారు. జనవరి మూడో వారం నుంచి అధికారిక వెబ్ సైట్ లో అడ్మిట్ కార్డులు (Admit Cards) అందుబాటులో ఉంటాయి.
దేశవ్యాప్తంగా ఉన్న ట్రిపుల్ ఐటీలు (IIIT), ఎన్ఐటీలు (NIT), ఇతర విద్యా సంస్థల్లో బీఈ (BE), బీటెక్ (Btech) , బీఆర్క్ (Barch.) కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏటా జేఈఈ మెయన్ నిర్వహిస్తారు. జాతీయస్థాయిలో దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తారు. ఇందులో ఎక్కువ స్కోర్ సాధించిన 2.5 లక్షల మంది జేఈఈ అడ్వాన్స్ డ్ పరీక్షకు ఎంపిక అవుతారు. వీరు ప్రఖ్యాత ఐఐటీల్లో ప్రవేశాలు పొందేందుకు పోటీ పడతారు.