భారత్‌లో 47లక్షల కోవిడ్ మరణాలు...?
06 May 2022, 8:32 IST
- భారత్‌లో కరోనా మరణాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా గణంకాలు దుమారాన్ని రేపుతున్నాయి. దేశంలో దాదాపు 47లక్షల మంది కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయి ఉంటారని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేయడంపై భారత్ తీవ్ర అభ్యంతరం తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రామాణికత లేని గణంకాలు పరిగణలోకి తీసుకుని అంచనాలు రూపొందించిందని ఆరోపించింది.
కోవిడ్ మృతుల అంత్యక్రియలకు ఏర్పాట్లు (ఫైల్ ఫోటో)
కోవిడ్ మరణాలపై ఇన్నాళ్లు భారత్ చెబుతున్న లెక్కలకు విరుద్ధంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా గణంకాలు ఉండటం దుమారాన్ని రేపుతోంది. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ కారణంగా 14.9 మిలియన్ల మంది అంటే దాదాపు కోటిన్నర మంది చనిపోయి ఉండొచ్చని అంచనా వేసింది. ఈ మరణాలు కోవిడ్ కారణంగా నేరుగా చనిపోయిన వారితో పాటు కరోనా మహమ్మరి ప్రభావం వల్ల తలెత్తిన ఇతర సమస్యలు, సామాజిక మార్పుల వల్ల కూడా జరిగి ఉంటాయని అభిప్రాయపడింది. భారత్‌లో దాదాపు 47లక్షల మంది ఇలా చనిపోయి ఉంటారని., ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు పదుల రెట్లు మరణాలు సంభవించాయని డబ్ల్యుహెచ్‌ఓ ప్రకటించింది. బ్రెజిల్, ఈజిప్టుల తర్వాత భారతదేశంలోనే ప్రపంచంలో అత్యధికంగా కోవిడ్ మరణాలు సంభవించాయని ఆ నివేదిక పేర్కొంది.
డబ్ల్యుహెచ్‌ఓ నివేదికపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మరణాలను లెక్కించే విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ సరైన విధివిధానాలను పాటించలేదని, సమాచార సేకరణకు వినియోగించిన మార్గాలు, అంచనాలు, గణంకాల విషయంలో ఎలాంటి జవాబుదారీతనాన్ని పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. యూఎన్ హెల్త్ ఏజెన్సీ ఎలాంటి ప్రమాణికత పాటించకుండా నివేదికలు రూపొందించిందని అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత దేశంలో కోవిడ్ మరణాలపై ఇప్పటి వరకు ఉన్న లెక్కలకు పదిరెట్లు ఎక్కువగా తాజా గణాంకాలు ఉన్నాయి. 2020, 201 సంవత్సరాలలో కోవిడ్ కారణంగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో 4.84లక్షల మంది చనిపోయినట్లు అధికారిక అంచనాలున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం అధికారికంగా ఉన్న మరణాలకంటే మూడురెట్లు ఎక్కువ మంచి చనిపోయారని డబ్ల్యుహెచ్‌ఓ అంచనా వేస్తోంది. అత్యధిక మరణాలు ఆగ్నేయ ఆసియాలోనే సంభవించాయని ఆ తర్వాత యూరోప్, అమెరికాలో జరిగాయని, మొత్తం మరణాల్లో 84శాతం చావులు ఈ మూడు ప్రాంతాల్లోనే ఉన్నాయని అంచనా వేశారు. 2021 చివరి నాటికి ప్రపంచ వ్యాప్తంగా కోటి 49లక్షల మంది కరోనా కారణంగా మరణించారని లెక్కించారు.
భారత్ అభ్యంతరం….
ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా మునుపటి సంవత్సరాలతో పోల్చి ఈ చావుల్ని లెక్కించింది. కోవిడ్ విరుచుకు పడటానికి ముందు నమోదైన మరణాలతో 2020, 2021లలో నమోదైన మరణాలను ప్రమాణికంగా తీసుకుంది. కోవిడ్ కారణంగా ప్రత్యక్షంగా చనిపోయిన వారితో పాటు, కోవిడ్ కారణంగా సంక్రమించిన ఆరోగ్య సమస్యలు, ఇతర సామాజిక సమస్యల కారణంగా ఈ మరణాలు నమోదైనట్లు అంచనా వేసింది. కోవిడ్ కాలానికి, అంతకు ముందు కాలానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రమాణికంగా తీసుకుని చావుల్ని లెక్కించింది. ఈ గణంకాలను లెక్కించిన విధానాన్ని భారత్ తీవ్రంగా తప్పు పట్టింది. తమ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోకుండానే లెక్కించడంపై అభ్యంతరం తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల్లో 17రాష్ట్రాల్లో నమోదైన మరణాలు, మీడియా కథనాలు, వేర్వేరు వెబ్‌సైట్లలో నమోదైన చావులను లెక్కలోకి తీసుకుని గణాంకాలు రూపొందించడాన్ని తప్పు పట్టింది. డేటా రూపకల్పనలో శాస్త్రీయ విధానాలను పాటించలేదని, గణాంకాల విషయంలో అధీకృత సమాచారాన్ని పరిగణలోకి తీసుకోలేదని ఆరోపించింది.
భారత సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టం నుంచి అధీకృత సమాచారం అందుబాటులో ఉన్నందున ఇతర గణంకాలను పరిగణలోకి తీసుకోవడంపై అభ్యంతరం తెలిపింది. వరల్డ్ హెల్త్ అసెంబ్లీలో ఈ విషయాన్ని లేవనెత్తాలని భారత్ భావిస్తోంది.
టాపిక్