Ilaiyaraaja: రాజ్యసభకు నామినేట్ అయిన ఇళయరాజా, పీటీ ఉష, విజయేంద్ర ప్రసాద్
06 July 2022, 22:29 IST
Ilaiyaraaja: దక్షిణాది రాష్ట్రాల నుంచి నలుగురు ప్రముఖ వ్యక్తులను రాజ్యసభకు నామినేట్ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇందులో మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజాతోపాటు స్క్రీన్‌రైటర్, ప్రముఖ దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్, పరుగుల రాణి పీటీ ఉష కూడా ఉన్నారు.
రాజ్యసభకు నామినేట్ అయిన పీటీ ఉష, ఇళయరాజా, వీరేంద్ర హెగ్డే, కేవీ విజయేంద్ర ప్రసాద్
న్యూఢిల్లీ: మోదీ ప్రభుత్వం బుధవారం రాజ్యసభకు నామినేట్ చేసిన దక్షిణాది ప్రముఖుల్లో ఇద్దరు సినీ రంగానికి చెందిన వాళ్లు కాగా.. ఒకరు క్రీడారంగం, మరొకరు ఆధ్యాత్మిక రంగానికి చెందిన వాళ్లు ఉన్నారు. వీళ్లలో తమిళనాడు నుంచి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా ఒకరు కాగా.. ఏపీ నుంచి బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాలకు కథలు అందించిన కేవీ విజయేంద్ర ప్రసాద్ కూడా ఉన్నాడు.
ఇక ప్రముఖ అథ్లెట్, కేరళకు చెందిన పీటీ ఉష.. కర్ణాటక నుంచి ధర్మస్థల ఆలయ హెడ్‌గా ఉన్న వీరేంద్ర హెగ్డేలను కూడా రాజ్యసభకు నామినేట్ చేశారు. ఈ మధ్యే హైదరాబాద్‌లో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో దక్షిణాది రాష్ట్రాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని నిర్ణయించిన ఆ పార్టీ.. ఆ వెంటనే నాలుగు రాష్ట్రాలకు చెందిన నలుగురు ప్రముఖులను రాజ్యసభకు పంపడం గమనార్హం.
ఈ సందర్భంగా ఈ నలుగురికీ ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు చెప్పారు. పీటీ ఉష ప్రతి భారతీయుడికీ ఓ ప్రేరణ అని.. ఎన్నో తరాల పాటు ప్రేక్షకులను అలరించిన క్రియేటివ్ జీనియస్ ఇళయరాజా అని మోదీ ట్వీట్ చేశారు. ఇక కేవీ విజయేంద్ర ప్రసాద్ గురించి చెబుతూ.. ఆయన అందించిన కథలు ఘనమైన భారతీయ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పాయని కొనియాడారు.
పైగా ఈ నాలుగు రాష్ట్రాల ప్రముఖుల గురించి చెబుతూ.. మోదీ ఆయా రాష్ట్రాల భాషల్లో ట్వీట్లు చేయడం విశేషం. విజయేంద్ర ప్రసాద్ గురించి ఆయన తెలుగులో ట్వీట్ చేశారు.