KCC | కిసాన్ క్రెడిట్ కార్డు ఎలా అప్లై చేయాలి? ప్రయోజనాలు ఏంటి?
24 January 2022, 20:59 IST
- KCC.. కిసాన్ క్రెడిట్ కార్డు రైతులకు అవసరమైనప్పుడు రుణాలు పొందడానికి సులువైన మార్గం. వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాలకు సంబంధించిన ఆకస్మిక ఖర్చులు తీర్చడంతో పాటు వారి సాగు ఖర్చులు తీర్చడానికి సకాలంలో, తగినంత క్రెడిట్ అందించడం ఈ పథకం లక్ష్యం.
ఫైల్ ఫొటో: పంజాబ్‌లోని పటియాల ప్రాంతంలో పొలానికి పురుగుల మందు స్ప్రే చేస్తున్న రైతు (Photo by Bharat Bhushan/ Hindustan Times)
కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రుణం సులువుగా పొందడమే కాకుండా, తక్కువ వడ్డీ రేట్లకు రుణాలు పొందవచ్చు. పైగా సకాలంలో చెల్లిస్తే 3 శాతం మేర వడ్డీ రాయితీ ఉంటుంది.
కిసాన్ క్రెడిట్ కార్డు ప్రయోజనాలు
రైతులు ఎలాంటి సెక్యూరిటీ డిపాజిట్ లేకుండానే రుణం పొందవచ్చు. పదే పదే బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పని తప్పుతుంది. రుణం వస్తుందో రాదోనన్న ఆందోళన తప్పుతుంది.
కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా గరిష్టంగా రూ. 3 లక్షల వరకు రుణాలు పొందవచ్చు. సకాలంలో చెల్లిస్తే 3 శాతం మేర వడ్డీ రాయితీ వర్తిస్తుంది.
70 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న కిసాన్ క్రెడిట్ కార్డు రుణగ్రహీతలు వ్యక్తిగత ప్రమాద బీమా పథకం (పి.ఎఐ.ఎస్.) కింద కవర్ అవుతారు.
అర్హత కలిగిన పంటలు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పి.ఎమ్.ఎఫ్.బి.వై.) కింద కవర్ అవుతాయి. వడ్డీ రేటు రూ. 3 లక్షల వరకు 7% ఉంటుంది.
కిసాన్ క్రెడిట్ కార్డుకు ఎవరు అర్హులు
సాగుదారులుగా ఉన్న రైతులు, ఉమ్మడి రుణగ్రహీతలు, కౌలు రైతులు అందరూ కిసాన్ క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. స్థానిక బ్యాంకు బ్రాంచిని సందర్శించి దరఖాస్తు ఫారం నింపాలి. అవసరమైన ధ్రువీకరణ పత్రాలు జత పరచాలి. ఆధార్ కార్డు లేదా ఓటర్ ఐడీ కార్డు, వ్యవసాయ భూమికి సంబంధించిన పాస్ బుక్ ప్రతి, పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు సమర్పించాల్సి ఉంటుంది.