తెలుగు న్యూస్  /  national  /  చెన్నైలో ఆడిటర్ హత్య...ఒంగోలులో నిందితుల పట్టివేత

చెన్నైలో ఆడిటర్ హత్య...ఒంగోలులో నిందితుల పట్టివేత

HT Telugu Desk HT Telugu

08 May 2022, 7:09 IST

google News
    • నమ్మకంగా పనిచేస్తోన్న వారికి యాజమాని దగ్గరున్న డబ్బుపై ఆశ పుట్టింది. అమెరికా నుంచి తిరిగి వస్తున్నారనే సమాచారంతో దంపతుల హత్యకు పక్కా స్కెచ్ వేశారు. మృతుల ఫాంహౌస్‌లోనే శవాలను పూడ్చిపెట్టి భారీగా నగదు, నగలు దోచుకుని పారిపోతూ ఆంధ్రా పోలీసులకు దొరికిపోయారు.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (HT_PRINT)

ప్రతీకాత్మక చిత్రం

నమ్మకానికి మారుపేరైనా నేపాలీలు దారుణానికి పాల్పడ్డారు. పదేళ్లుగా పని చేస్తున్న ఇంటి ‍యజమానిని నిర్దాక్షణ్యంగా హతమార్చారు. వృద్ద దంపతుల్ని హతమార్చి ఇంట్లలో నగదు, నగలను దోచుకున్నారు. చెన్నై మైలాపూర్‌ ప్రాంతంలోని బృందావన్‌ నగర్ ద్వారకా కాలనీకి చెందిన శ్రీకాంత్ ఆడిటర్‌గా పనిచేస్తుంటారు. ఆయన భార్య అనురాధతో కలిసి నెలరోజుల క్రితం అమెరికా వెళ్లారు. కుమార్తె ప్రసవం కోసం అమెరికా వెళ్లిన దంపతులు శనివారం తెల్లవారుజామున 3.30కు స్వదేశానికి తిరిగి వచ్చారు. విమానాశ్రయం నుంచి ఇంటికి రాగానే డ్రైవర్‌ లాల్ కృష్ణ, తన స్నేహితుడు రవితో కలిసి వారిపై దాడి చేసి చంపేశాడు.

తల్లిదండ్రులు ఇంటికి క్షేమంగా చేరారో లేదో తెలుసుకోడానికి అమెరికాలో ఉంటున్న వారి కుమార్తె సునంద ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫోన్లు కలవకపోవడంతో కంగారుపడి చెన్నైలోని బంధువులకు సమాచారం ఇచ్చింది. ఇంద్రానగర్‌లో ఉండే వారి బంధువు దివ్య, ఆమె భర్త రమేష్‌లు శనివారం మధ్యాహ్నం మూడున్నర గంటలకు శ్రీకాంత్ ఇంటికి వెళ్లి చూస్తే ఇంటికి తాళం వేసి ఉంది. వారు అనుమానంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. మైలాపూర్‌ పోలీసుల దర్యాప్తులో విమానాశ్రయం నుంచి శ్రీకాంత్ దంపతుల్ని డ్రైవర్ లాల్ కృష్ణ ఇన్నోవా కారులో తీసుకువెళ్లినట్లు గుర్తించారు. లాల్‌కృష్ణ, అతని స్నేహితుడు రవి అప్పటికే పరారైనట్లు గుర్తించి, జిపిఎస్‌ ట్రాక్ చేశారు.

హత్య చేసిన తర్వాత వారి వాహనం ఆంధ్రా మీదుగా ప్రయాణిస్తున్నట్లు గుర్తించి ప్రకాశం జిల్లా పోలీసుల్ని అప్రమత్తం చేశారు. ఒంగోలు పోలీసులు టంగటూరు టోల్ గేటు వద్ద 16వ నంబరు జాతీయ రహదారిపై వాహనాల తనిఖీ చేపట్టారు. నిందితులు ప్రయాణిస్తున్న వాహనాన్ని గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. టంగుటూరు పోలీసుల విచారణలో అమెరికా నుంచి వచ్చిన శ్రీకాంత్ దంపతుల్ని మైలాపూర్ ఇంట్లో హతమార్చిన తర్వాత చెంగల్పట్టు జిల్లా నెమిలిచ్చేరి సమీపంలో ఉన్న శ్రీకాంత్ ఫాం హౌస్‌లో వారిని పూడ్చి పెట్టినట్టు అంగీకరించారు. దంపతుల్ని హత్య చేసిన తర్వాత నిందితులు ఇంట్లో ఉన్న 20లక్షల రుపాయల నగదు, నగలు, వెండి ఆభరణాలతో కారులో పరారయ్యేందుకు ప్రయత్నించారు. నిందితుల వద్ద 50కేజీల బంగారం, వెండిని స్వాధీనం చేసుకున్నారు.

టాపిక్

తదుపరి వ్యాసం