తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Caa | సిటిజెన్‌షిప్ అమెండ్‌మెంట్ యాక్ట్: అసోంలో మళ్లీ ఉద్యమాలు

CAA | సిటిజెన్‌షిప్ అమెండ్‌మెంట్ యాక్ట్: అసోంలో మళ్లీ ఉద్యమాలు

24 January 2022, 20:57 IST

google News
    • సిటిజెన్‌షిప్ అమెండ్‌మెంట్ యాక్ట్ (CAA)-2019 పార్లమెంటులో ఆమోదం పొంది రెండేళ్లయింది. తాజాగా అసోంలో మరోసారి CAAకు వ్యతిరేకంగా ఉద్యమాలు ఊపందుకుంటున్నాయి. బిల్లు ఆమోదం పొంది రెండేళ్లవడం ఒక ఎత్తయితే అంతకుమించిన ప్రేరణ మరొకటి ఉంది.
ఫైల్ ఫొటో: అస్సాం అకార్డ్‌లోని క్లాజ్ 5, క్లాజ్ 6 అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గువహటిలో అసోం జాతీయ పరిషద్ మద్దతుదారుల నిరసన (ANI Photo)
ఫైల్ ఫొటో: అస్సాం అకార్డ్‌లోని క్లాజ్ 5, క్లాజ్ 6 అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గువహటిలో అసోం జాతీయ పరిషద్ మద్దతుదారుల నిరసన (ANI Photo) (Pitamber Newar)

ఫైల్ ఫొటో: అస్సాం అకార్డ్‌లోని క్లాజ్ 5, క్లాజ్ 6 అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గువహటిలో అసోం జాతీయ పరిషద్ మద్దతుదారుల నిరసన (ANI Photo)

ఏడాది కాలానికిపైగా విజయవంతంగా సాగిన రైతు ఉద్యమాలు.. అసోంలో మళ్లీ పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమాలకు ప్రేరణ ఇచ్చినట్టు అవగతమవుతోంది.

దేశవ్యాప్తంగా రైతు సంఘాలు ఐక్యంగా పోరాడడంతో కేంద్రం వాటి డిమాండ్లకు తలొగ్గి మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంది. రైతుల ప్రయోజనాల కోసమే ఆ చట్టాలు తెచ్చామన్న కేంద్ర ప్రభుత్వ వాదన.. రైతుల సంఘటిత శక్తి ముందు వీగిపోయింది. 

ఇప్పుడు ఇదే అసోంలో ఉద్యమానికి మరోసారి ఊపిరిపోసింది. 2021, డిసెంబరు 10 నుంచి మలి ఉద్యమానికి ప్రణాళిక రచించింది. నిజానికి అసోంలో అక్రమ వలసదారుల వ్యతిరేక ఉద్యమంలో మొదట చనిపోయిన ఖర్గేశ్వర్ తాలూక్‌దార్ వర్ధంతి కూడా డిసెంబర్ 10 కావడం గమనార్హం.

సిటిజెన్‌షిప్ అమెండ్‌మెంట్ యాక్ట్ (CAA) -2019 అంటే ఏమిటి?

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఈ బిల్లు డిసెంబరు 11, 2019న పార్లమెంటు ఆమోదం పొందింది. ఈ చట్టం ప్రకారం అఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాల్లో ముస్లిమేతరులై వివక్షకు, దాడులకు గురై 2014 డిసెంబరు 31 నాటికి భారతదేశంలో శరణార్థులుగా ఆశ్రయం ఉన్న వారికి భారతదేశ పౌరసత్వం ఇవ్వాల్సి ఉంటుంది.

అయితే ఈ కేంద్ర ప్రభుత్వ చర్య అసోంలో ఆందోళనలకు కారణమైంది. బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసదారులతో రాష్ట్రం నిండిపోతుందని, ఇప్పటికే ఇతర రాష్ట్రాలలో శరణార్థులుగా వచ్చి ఉన్న వారు కూడా అసోం రాష్ట్రంలో స్థిరపడతారని, స్థానికులుగా ఉన్న తమకు అన్యాయం జరుగుతుందని అసోంలో ఆందోళనలు మొదలయ్యాయి.

దశలవారీగా ఉద్యమాలు

ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ (ఏఏఎస్‌యూ), కృషక్ ముక్తి సంగ్రామ్ సమితి (కేఎంఎస్ఎస్)లు ఈ ఉద్యమాలకు నేతృత్వం వహించాయి. సీఏఏ కారణంగా బంగ్లాదేశ్ నుంచి వలసదారులు పెరిగిపోతారని, స్థానిక అసోం ప్రజల ఉనికి దెబ్బతింటుందని ఆందోళనలు చేపట్టారు.పైగా ఇది 1985 నాటి అస్సాం ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. 

2019 జనవరిలో పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టగానే అసోంలో బీజేపీ నేతృత్వంలోని అధికార కూటమి నుంచి అసోం గణ పరిషత్తు వైదొలగింది. అప్పటి నుంచి బిల్లు ఆమోదం పొందేవరకు దశల వారీగా ఉద్యమాలు ఊపందుకున్నాయి. ఆయా నిరసనల సందర్భంగా సాయుధ దళాలు జరిపిన కాల్పుల్లో ఐదుగురు నిరసనకారులు మృతి చెందారు.

రెండేళ్ల తరువాత మళ్లీ..

2020 మార్చి 20 నుంచి దేశంలో కోవిడ్ వ్యాప్తి పెరగడం, కేంద్రం లాక్ డౌన్ చర్యలు చేపట్టడంతో క్రమంగా ఈ ఉద్యమానికి బ్రేక్ పడింది. తాజాగా రెండేళ్ల అనంతరం ఈ ఉద్యమం మళ్లీ రెక్కలు తొడుగుతోంది. 

ఏఏఎస్‌యూ, కేఎంఎస్ఎస్‌లతో పాటు, ఏడాది క్రితం పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా సాగిన ఉద్యమం ద్వారా ఆవిర్భవించిన అసోం జాతీయ పరిషద్ కూడా మలి విడత ఉద్యమంలో పాలు పంచుకుంటోంది. రైతు ఉద్యమం తమకు స్ఫూర్తిగా నిలిచిందని కూడా ఆ పార్టీ అధ్యక్షుడు లురిన్‌జ్యోతి గొగోయ్ వ్యాఖ్యానించారు.

 

తదుపరి వ్యాసం