తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Yogi Adityanath | యోగి దగ్గర రూ.లక్ష విలువైన తుపాకీ.. ఆస్తుల లిస్ట్‌ ఇదీ!

Yogi Adityanath | యోగి దగ్గర రూ.లక్ష విలువైన తుపాకీ.. ఆస్తుల లిస్ట్‌ ఇదీ!

Hari Prasad S HT Telugu

05 February 2022, 6:33 IST

google News
    • ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ తొలిసారి అసెంబ్లీ ఎన్నికల కోసం శుక్రవారం నామినేషన్‌ వేసిన విషయం తెలుసు కదా. ఈ సందర్భంగా తన ఆస్తులకు సంబంధించిన అఫిడవిట్‌ను ఆయన సమర్పించారు. తన దగ్గర ఉన్న నగదు, బ్యాంకు అకౌంట్లలో బ్యాలెన్స్‌, ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల గురించి ఇందులో వివరించారు.
యూపీ ఎన్నికల్లో నామినేషన్ వేస్తున్న యోగి ఆదిత్యనాథ్
యూపీ ఎన్నికల్లో నామినేషన్ వేస్తున్న యోగి ఆదిత్యనాథ్ (Pramod Adhikari (Hindustan Times))

యూపీ ఎన్నికల్లో నామినేషన్ వేస్తున్న యోగి ఆదిత్యనాథ్

గోరఖ్‌పూర్‌: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాతో కలిసి యోగి ఆదిత్యనాథ్‌ నామినేషన్‌ వేశారు. ఈయన గోరఖ్‌పూర్‌ అర్బన్‌ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. 

ఈ సందర్భంగా తన ఎన్నికల అఫిడవిట్‌లో తనకు రూ. కోటీ 54 లక్షల 94 వేల 054 విలువైన ఆస్తులు ఉన్నట్లు వెల్లడించారు. ఈ లిస్ట్‌లో రూ.49 వేల విలువైన 20 గ్రాముల బంగారు చెవి పోగులు, రూ.20 వేల విలువైన 10 గ్రాముల రుద్రాక్షతో కూడిన బంగారు చెయిన్‌ ఉన్నట్లు చూపించారు. రూ.12 వేల విలువైన స్మార్ట్‌ఫోన్‌ యోగి దగ్గర ఉంది. 

ఇక తన దగ్గర రూ.లక్ష విలువైన ఓ రివాల్వర్‌, రూ.80 వేల విలువైన రైఫిల్‌ కూడా ఉన్నట్లు అఫిడవిట్‌లో యోగి వెల్లడించారు. తన పేరిట ఎలాంటి వాహనం లేదని స్పష్టం చేశారు.

యోగి గత ఐదేళ్ల సంపాదన ఇదీ..

గత ఐదేళ్లలో యోగి సీఎంగా ఉన్న విషయం తెలిసిందే. మరి ఈ ఐదేళ్లలో తాను ఏం సంపాదించారో కూడా ఆయన చెప్పారు. 2020-21లో రూ.13,20,653, 2019-20లో రూ.15,68,799, 2018-19లో రూ.18,27,639, 2017-18లో రూ.14,38,670, 2016-17లో రూ.8,40,998 సంపాదించినట్లు తన అఫిడవిట్‌లో యోగి వెల్లడించారు. 

తన పేరిట ఎలాంటి వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తులు లేనట్లు చెప్పారు. అదే సమయంలో తనకు అప్పులు కూడా లేవని తెలిపారు. యోగికి సైన్స్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ ఉంది. యెగి పోటీ చేస్తున్న గోరఖ్‌పూర్‌ అర్బన్‌ నియోజకవర్గంలో ఆరో విడతలో భాగంగా మార్చి 3న ఎన్నికలు జరగనున్నాయి. 

యూపీ ఎన్నికలు మొత్తం ఏడు విడతల్లో ఫిబ్రవరి 10, 14, 20, 23, 27, మార్చి 3, 7 తేదీల్లో జరగనున్నాయి. మార్చి 10న ఓట్ల లెక్కింపు ఉంటుంది. 2017 ఎన్నికల్లో బీజేపీ 312 సీట్లు గెలిచి చారిత్రక విజయం సాధించిన విషయం తెలిసిందే.

తదుపరి వ్యాసం