Monkeypox | మంకీ పాక్స్.. గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ
23 July 2022, 21:33 IST
Monkeypox | ప్రపంచ దేశాల్లో శరవేగంగా విస్తరిస్తున్న మంకీపాక్స్ వైరస్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టడం, ప్రపంచ ప్రజల్లో దీనిపై అవగాహన తీసుకురావడం లక్ష్యంగా శనివారం ఒక ప్రకటన చేసింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చీఫ్ టెడ్రోస్
Monkeypox | పలు దేశాల్లో వేగంగా విస్తరిస్తున్న `మంకీ పాక్స్`పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organisation WHO) శనివారం కీలక ప్రకటన చేసింది. మంకీపాక్స్‌ను గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ (global public health emergency)గా ప్రకటించింది. ఈ ఆరోగ్య సమస్యను తీవ్రంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది.
Monkeypox | టెడ్రోస్ స్టేట్‌మెంట్
ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ వ్యాప్తి ఆందోళనకర స్థాయిలో ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organisation WHO) చీఫ్ టెడ్రోస్ ఘెబ్రియేసస్(Tedros Ghebreyesus) వ్యాఖ్యానించారు. అంతర్జాతీయంగా ప్రజారోగ్యంపై ఇది దారుణ ప్రభావం చూపే ముప్పు ఉందని హెచ్చరించారు. గత నెలలో మంకీపాక్స్ వ్యాప్తిపై WHO ఎమర్జెన్సీ సమావేశం నిర్వహించిన నాటికి, నేటికి ఆ వైరస్ మెజారిటీ దేశాలకు విస్తరించిందన్నారు. ప్రస్తుతం 75 దేశాలకు ఇది విస్తరించిందన్నారు. యూరోప్ దేశాలు మినహా ఇతర దేశాల్లో ఈ వైరస్ వ్యాప్తి సాధారణం కన్నా కొంత ఎక్కువగా ఉందని తెలిపారు. కానీ యూరోప్ ప్రాంతంలో మాత్రం ఈ వైరస్ ఆందోళనకర స్థాయిలో విస్తరిస్తోందని హెచ్చరించారు. అయితే, ఇతర దేశాల్లోనూ దీని వ్యాప్తి వేగవంతమయ్యే ముప్పు ఉందన్నారు.
Monkeypox | 75 దేశాల్లో మంకీపాక్స్
ప్రస్తుతం మంకీపాక్స్ 75 దేశాలకు విస్తరించిందని, ఆయా దేశాల్లో 16 వేలకు పైగా కేసులు నమోదయ్యాయని టెడ్రోస్ వివరించారు. ఇప్పటివరకు ఈ వైరస్ కారణంగా ఐదుగురు చనిపోయారని తెలిపారు.
Monkeypox | ఎందుకు ఈ గ్లోబల్ ఎమర్జెన్సీ
మంకీ పాక్స్ ను లేదా ఏ అంటువ్యాధిని అయినా అంతర్జాతీయ ఆరోగ్య సమస్యగా నిర్ధారించడానికి కొన్ని అంశాలను పరిశీలనలోకి తీసుకుంటారు. అవి
1) ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో ఆ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండడం.
2) ఆ స్థాయిలో వైరస్ వ్యాప్తి గతంలో జరగకపోవడం.
3) సంపూర్ణ అధ్యయనం తరువాత.. ఈ సమస్యను గ్లోబల్ ఎమర్జెన్సీగా ప్రకటించాలని WHO నిపుణుల కమిటీ సూచించడం(మంకీపాక్స్ విషయంలో ఈ కమిటీలో ఏకాభిప్రాయం వ్యక్తం కాలేదు)
4) సైంటిఫిక్ డేటా ద్వారా సమస్య తీవ్రతను అంచనావేయడం. (మంకీపాక్స్ విషయంలో సైంటిఫిక్ డేటా, ఎవిడెన్సెస్, ఇతర విశ్వసనీయ సమాచారం అవసరమైనంతగా అందుబాటులో లేదు)
5) మానవుల ఆరోగ్యంపై చూపే ప్రతికూల ప్రభావం