ప్రేమ కోసం ఒంటరిగా అడవి దాటి.. నదిని ఈది..!
31 May 2022, 20:34 IST
ప్రేమికుడిని కలుసుకుని, పెళ్లి చేసుకోవడం కోసం పెద్ద సాహసమే చేసిందో బంగ్లాదేశ్ యువతి. బంగ్లాదేశ్ నుంచి బయల్దేరి, ప్రమాదకర సుందర్‌బన్స్ అడవులు దాటి, దారిలో ఉన్న ఒక నదిని ఈది.. భారత్‌కు వచ్చింది. విజయవంతంగా ప్రేమికుడిని కలుసుకుని, పెళ్ల చేసుకుంది. కానీ..!
ప్రేమ కోసం సాహసం చేసిన యువతి కృష్ణ మండల్
బంగ్లాదేశ్‌కు చెందిన కృష్ణ మండల్‌కు భారత్‌లోని పశ్చిమబెంగాల్‌కు చెందిన ఆభిక్‌తో ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. కొన్నాళ్ల స్నేహం తరువాత, వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ, భారత్ రావడానికి కృష్ణ మండల్‌కు పాస్‌పోర్ట్ లేదు.
క్రూర మృగాలున్న అడవి దాటి..
లీగల్ గా భారత్ రావడానికి అవకాశం లేకపోవడంతో.. అక్రమమే అయినా, సాహసం చేయాలని నిర్ణయించుకుంది. బంగ్లాదేశ్, భారత్‌ల మధ్య ఉన్న సుందరబన్స్ అడవులను, చిన్న నదిని దాటి భారత్ చేరుకోవాలని సంకల్పించింది. సుందర్‌బన్స్ అడవులు రాయల్ బెంగాల్ టైగర్స్ సహా క్రూర జంతువులకు ఫేమస్. ఆ అడవిలో అన్ని జాగ్రత్తలు తీసుకుని ప్రయాణించడమే డేంజర్. అలాంటిది, ఒంటరిగా, ధైర్యంగా ఆ అడవిని దాటేందుకు సిద్ధమైంది కృష్ణ. విజయవంతంగా అటవీ ప్రాంతం దాటిన తరువాత, భారత్‌లోకి అడుగుపెట్టేందుకు ఒక నది అడ్డుగా కనిపించింది. దాంతో, అదీ దాటేయాలని నిర్ణయించుకుంది. దాదాపు గంటకు పైగా ఈది ఆ నదిని కూడా దాటేసింది. అలా సాహసం చేసి, విజయవంతంగా భారత్‌లో అడుగుపెట్టింది. ప్రేమికుడిని కలుసుకుంది.
పెళ్లైంది కానీ..
అనంతరం, రెండు రోజుల తరువాత కోల్‌కతాలోని కాళీఘాట్ ఆలయంలో వారిరువురి వివాహం జరిగింది. కానీ, ఆ మర్నాడే కృష్ణ మండల్ సాహసం స్థానిక అధికారులకు తెలిసింది. అక్రమంగా భారత్‌లో అడుగుపెట్టిన నేరానికి ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. బంగ్లాదేశ్ హై కమిషన్‌ను అప్పగించాలని నిర్ణయించారు.
చాక్లెట్ కోసం
ఇటీవల 13 ఏళ్ల కుర్రాడు ఇష్టమైన చాక్లెట్ కొనుక్కోవడం కోసం సరిహద్దుల్లో ఉన్న చిన్న నదిని దాటి బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి వచ్చాడు. ఇమాన్ హుస్సేన్ అనే ఈ బాలుడు, సరిహద్దుల్లో ఉన్న కంచెకున్న చిన్న గ్యాప్ నుంచి ఇటువైపు వచ్చి, దార్లో ఉన్న చిన్న నదిని ఈది భారత భూభాగంలోకి వచ్చాడు. ఇష్టమైన చాక్లెట్ బార్ కొనుక్కున్నాడు కానీ, పోలీసులకు చిక్కాడు. కోర్టు ఆ బాలుడికి 15 రోజుల రిమాండ్ విధించింది.
టాపిక్