Woman abuses crew: సిబ్బందిని కొట్టి, దుస్తులు విప్పుకుని; విమానంలో మహిళ వీరంగం
08 January 2024, 20:37 IST
Woman abuses crew: అబు దాబి నుంచి ముంబై వస్తున్న విమానంలో ఒక మహిళ వీరంగం సృష్టించింది. సిబ్బందిని కొట్టి, దుస్తులు విప్పుకుని అర్థనగ్నంగా తయారై, విమానం లోపల అటు ఇటు తిరుగుతూ సహ ప్రయాణికుల్లో భయాందోళనలు సృష్టించింది.
ప్రతీకాత్మక చిత్రం
Woman abuses crew: అబు దాబీ (Abu dhabi) నుంచి ముంబై వస్తున్న విమానం (flight) సోమవారం ఈ ఘటన జరిగింది. విమానయాన సంస్థ విస్తారా (Air Vistara) ఫిర్యాదు చేయడంతో ఆ మహిళను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు.
Ruckus in the flight: విమానంలో భయాందోళనలు..
ఎయిర్ విస్తారా ఫ్లైట్ UK 256 (Air Vistara flight UK 256) సోమవారం రాత్రి అబుదాబీ (Abu dhabi) నుంచి ముంబై వస్తోంది. విమానంలో ఎకానమీ క్లాస్ లో కూర్చున్న ఒక 45 ఏళ్ల మహిళ అకస్మాత్తుగా లేచి బిజినెస్ క్లాస్ లోకి వెళ్లి అక్కడ ఖాళీగా ఉన్న సీట్లో కూర్చుంది. ఇది గమనించిన విమాన సిబ్బంది ఆమెను తిరిగి తన సీట్లోకి వెళ్లాల్సిందిగా కోరారు. దాంతో, ఒక్క సారిగా కోపం తెచ్చుకున్న ఆ మహిళ తన ఎదురుగా ఉన్న ఉద్యోగి (flight crew) ముఖంపై కొట్టింది. మరో ఉద్యోగిపై దాడి చేయడం ప్రారంభించింది. అనంతరం, అకస్మాత్తుగా తన దుస్తుల్లో కొన్నింటిని తొలగించి, అర్ధనగ్నంగా తయారై, సీట్ల మధ్య అటు ఇటు తిరగడం ప్రారంభించింది. ఇదంతా చూస్తున్న ఇతర ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. ఆతరువాత కాసేపటికి నెమ్మదించి, తిరిగి తన సీట్లోకి వెళ్లి కూర్చుంది.
police case on a Italy woman: కేసు నమోదు
మంగళవారం తెల్లవారుజామున ముంబై విమానాశ్రయంలో ఫ్లైట్ (Air Vistara flight UK 256) ల్యాండ్ కాగానే, విమానాశ్రయ సెక్యూరిటీ ఆ మహిళను అదుపులోకి తీసుకుంది. ఎయిర్ విస్తారా ఫిర్యాదు మేరకు ముంబై పోలీసులు కేసు నమోదు చేసుకుని, ఆ మహిళను అరెస్ట్ చేశారు. ఆమెను ఇటలీ (Italy) కి చెందిన పావోలా పెరూషియో (Paola Perruccio) గా గుర్తించారు.