Rains in India : అలర్ట్.. ఆ ప్రాంతాలకు భారీ వర్ష సూచన!
16 August 2022, 10:28 IST
- Rains in India : రాజస్థాన్‌తో పాటు మధ్య భారతంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అతి భారీ వర్షాలకు ఇప్పటికే మధ్యప్రదేశ్ విలవిలలాడిపోతోంది.
ఆ ప్రాంతాలకు భారీ వర్ష సూచన!
Rains in India : ఉత్తర ఛత్తీస్‌గఢ్‌పై అలుముకున్న అల్పపీడన ద్రోణి కారణంగా.. మధ్య భారతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని భారత వాతావరణశాఖ వెల్లడించింది. రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్, గుజరాత్, కచ్‌లో.. ఈ వారం భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. కాగా.. వాయువ్య బంగాళాఖాతంలో ఈ నెల 19నాటికి కొత్తగా మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని.. ఫలితంగా పశ్చిమ్ బెంగాల్, ఒడిశా, ఝార్ఖండ్లలో భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది.
రుతుపవనాల ద్రోణి సైతం మరో మూడు, నాలుగు రోజుల పాటు.. సాధారణ స్థానం కన్నా దక్షిణంవైపునకు ఉంటుందని, అందువల్ల విస్తృతంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. పశ్చిమ, మధ్య భారతంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అల్లాడించే అవకాశం ఉందని పేర్కొంది.
మధ్యప్రదేశ్ వర్షాలు..
Madhya Pradesh rains : రుతుపవనాల కారణంగా మధ్యప్రదేశ్‌లో ఇప్పటికే భారీ వర్షాలు పడుతున్నాయి. ఐఎండీ ప్రకారం.. భోపాల్, జబల్పూర్లో మరో 24 గంటల పాటు అతి భారీ వర్షాలు కొనసాగుతాయి. భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. బార్ఘి డ్యామ్‌కు చెందిన 21 గేట్లలో.. ఇప్పటికే 13 గేట్లను ఎత్తేశారు.
తాజా పరిస్థితులతో నర్మదాపురం, భోపాల్‌లోని పాఠశాలలకు స్థానిక యంత్రాంగాలు సెలవును ప్రకటించాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించాయి.