Bulldozer action : ‘ప్రజా భద్రతే ముఖ్యం- ఆ మతపరమైన నిర్మాణాలను..’- సుప్రీంకోర్టు
01 October 2024, 13:24 IST
- Bulldozer action SC : బుల్డోజర్ చర్యపై తమ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు మరోమారు పునరుద్ఘటించింది. అయితే..రహదారులు, జలవనరులు, రైలు పట్టాలను ఆక్రమించే మతపరమైన నిర్మాణాల కంటే ప్రజా భద్రతకే ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేసింది. "ఆలయం అయినా, దర్గా అయినా వెళ్లాల్సిందే అని పేర్కొంది.
భారత దేశ సుప్రీంకోర్టు..
రహదారులు, జలవనరులు, రైల్వే లైన్లను ఆక్రమించే మతపరమైన నిర్మాణాల కంటే ప్రజా భద్రతకే ప్రాధాన్యమిస్తూ సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. బుల్డోజర్, ఆక్రమణ వ్యతిరేక కార్యకలాపాలపై తాము ఇచ్చిన ఆదేశాలు, మతాలకు సంబంధం లేకుండా అందరికి సమానంగా వర్తిస్తుందని పేర్కొంది. నేరస్థులపై బుల్డోజర్ చర్యలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
"ఆలయం అయినా, దర్గా అయినా వెళ్లాల్సిందే. ప్రజా భద్రతే ముఖ్యం,' అని జస్టిస్ గవాయ్ పేర్కొన్నారు.
వివిధ నేరాల్లో నిందితులుగా ఉన్న వారికి సంబంధించిన కట్టడాలను కూల్చివేయడం ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. అయితే కొన్ని మతాల వారినే టార్గెట్ చేస్తున్నారన్న ఆరోపణలు సైతం ఉన్నాయి.
"నేరానికి పాల్పడిన వారిపై బుల్డోజర్ చర్యలు సరైనవేనా?" అని అడిగిన ప్రశ్నకు.. అస్సలు కాదని ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్ తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పేర్కొన్నారు. అత్యాచారం, ఉగ్రవాదం వంటి తీవ్రమైన నేరాలతో పాటు ఏ కేసులోనైనా నిందితుడిగా ఉన్నప్పటికీ, బుల్డోజర్ చర్యలు సరైనవి కావని స్పష్టం చేశారు. ముందస్తు నోటీసు ప్రాముఖ్యతను మెహతా నొక్కిచెప్పారు. నిష్పాక్షికతను నిర్ధరించడానికి రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా జారీ చేయాలని సూచించారు. కానీ కొన్ని మతాల వారినే టార్గెట్ చేస్తూ బుల్డోజర్ చర్యలు చేపడుతున్నారని కొన్ని ఉదాహరణలు తీసుకునే సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీచేస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి:- Zakir Naik : ఎన్ఐఏ వాంటెడ్ జాకిర్ నాయక్‌కి పాకిస్థాన్‌లో ఘన స్వాగతం- రెడ్ కార్పెట్ వేసి..
వివిధ రాష్ట్రాల్లో బుల్డోజర్ చర్యలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై ఇప్పటికే విచారణ జరిపిన సుప్రీంకోర్టు సెప్టెంబర్ 17న తమ అనుమతి లేకుండా దేశంలో ఆస్తుల కూల్చివేతలు చేపట్టరాదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రజా రహదారులు, ఫుట్‌పాత్‌లు, రైల్వే లైన్లు లేదా ఇతర బహిరంగ ప్రదేశాల్లో ఆక్రమణలకు ఈ ఉత్తర్వులు వర్తించవని సుప్రీంకోర్టు తెలిపింది.
పబ్లిక్ రోడ్లు, నీటి వనరులు, రైల్వే లైన్లలో కూల్చివేతల మినహాయించి, అక్టోబర్ 1 వరకు తమ అనుమతి లేకుండా దేశవ్యాప్తంగా బుల్డోజర్ కూల్చివేతను నిలిపివేయాలని రాష్ట్రాలను సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.
మున్సిపల్ చట్టాల ప్రకారం ఆస్తులను ఎప్పుడు, ఎలా కూల్చివేయవచ్చనే దానిపై మార్గదర్శకాలను రూపొందిస్తామని సుప్రీంకోర్టు వెల్లడించింది.
“ఆక్రమణల కూల్చివేతకు చట్టాలు ఉండాలి. మతాలు, విశ్వాసాలతో ముడిపడి ఉండకూడదు,” అని జస్టిస్ గవాన్ అభిప్రాయపడ్డారు.
మరోవైపు కూల్చివేతలపై ప్రజల్లోనూ అసంతృప్తి వ్యక్తమవుతోంది. యూపీలోని ఓ గ్రామంలో కూల్చివేతలపై అసంతృప్తితో ఉన్న గ్రామస్తులు ఇద్దరు రెవెన్యూ అధికారులను చితకబాదారు. ఉఖ్రా గ్రామంలో శనివారం జరిగిన ఈ ఘటనలో ప్రభుత్వ భూమిలో నిర్మించిన పలు నిర్మాణాలను బుల్డోజర్లతో జిల్లా యంత్రాంగం కూల్చివేసింది.