US Visa Interview waiting Time : యూఎస్ వీసా కావాలా?.. మూడేళ్లు ఆగండి..!
23 November 2022, 15:02 IST
US Visa Interview waiting Time : కొన్ని కేటగిరీల్లో అమెరికా వీసా పొందడానికి, దాదాపు మూడేళ్లకు పైగా ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. వీసా ఇంటర్వ్యూ కోసమే కనీసం 1000 రోజులు పడ్తోంది.
ప్రతీకాత్మక చిత్రం
US Visa Interview waiting Time : భారతీయుల వీసా దరఖాస్తులను త్వరిత గతిన ప్రాసెస్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని గత వారమే అమెరికా ప్రకటించింది. వీసాల జారీ విషయంలో కోవిడ్ ముందు నాటి పరిస్థితులను 2023 నాటికి మళ్లీ నెలకొల్పడంపై దృష్టి పెట్టామని వివరించింది.
US Visa Interview waiting Time: కనీసం 1000 రోజులు
కానీ, అమెరికా హోం శాఖ వెబ్ సైట్ తెలిపే వివరాల ప్రకారం, భారత్ లోని వారు అమెరికా వెళ్లడానికి దరఖాస్తు చేసుకున్న తరువాత వీసా ఇంటర్వ్యూ కోసం దాదాపు 1000 రోజులు ఎదురు చూడాల్సి ఉంటుంది. ముఖ్యంగా, బీ1(B1 visa), బీ2(B2 visa) వీసా కేటగిరీలకు ఈ ఆలస్యం ఎక్కువగా ఉంది. బీ1(B1 visa) బిజినెస్((business) కేటగిరీకి, బీ2(B2 visa) టూరిస్ట్(tourist) కేటగిరీకి చెందినదన్న విషయం తెలిసిందే.
Different waiting periods for US Visa: వివిధ నగరాల్లో వేర్వేరు వెయిటింగ్ పీరియడ్
అమెరికా స్టేట్ డిపార్ట్ మెంట్ వెబ్ సైట్ లోని వివరాల ప్రకారం.. నవంబర్ 23న భారత్ లోని వివిధ నగరాల్లో ఈ B1 లేదా B2 వీసా ఇంటర్వ్యూ కోసం స్వల్ప తేడాతో దాదాపు మూడేళ్ల వెయిటింగ్ పీరియడ్ ఉంది. ముంబైలో నివసించే వారికి ఈ వెయిటింగ్ పీరియడ్ 999 రోజులు కాగా, హైదరాబాద్ నివాసితులకు 994 రోజులుగా, చెన్నై నుంచి దరఖాస్తు చేసుకునే వారికి 948 రోజులుగా, కేరళ వాసులకు మాత్రం 904 రోజులుగా ఈ వెయిటింగ్ పీరియడ్ ఉంది. దరఖాస్తుల సంఖ్య, అందుబాటులో ఉన్న ఉద్యోగుల ఆధారంగా ఈ వెయిటింగ్ పీరియడ్ వారంవారం మారుతూ ఉంటుంది.
India's concern on US Visa delay: భారత్ ఆందోళన
అమెరికా వీసా దరఖాస్తుల ప్రాసెసింగ్ లో జరుగుతున్న తీవ్ర జాప్యంపై భారత్ తన ఆందోళననను ఇప్పటికే అమెరికాకు వెల్లడించింది. ఈ సెప్టెంబర్ లో అమెరికాలో పర్యటించిన భారత విదేశాంగ మంత్రి జైశంకర్.. ఈ అంశాన్ని యూఎస్ హోం మంత్రి ఆంటోనీ బ్లింకెన్ దృష్టికి తీసుకువెళ్లారు. కోవిడ్ కారణంగా ఈ పరిస్థితి తలెత్తిందని, సాధ్యమైనంత త్వరగా వీసా జారీ విషయంలో కోవిడ్ ముందునాటి పరిస్థితులు నెలకొంటాయని బ్లింకిన్ హామీ ఇచ్చారు. యూఎస్ వీసాల విషయంలో ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉందని వివరించారు. ఇటీవల, కొన్ని కేటగిరీల్లో, ముఖ్యంగా గతంలో యూఎస్ వీసా పొందిన వారి విషయంలో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునిస్తూ అమెరికా నిర్ణయం తీసుకుంది.