Wrestlers Protest: “ఇలాంటి రోజు చూసేందుకే దేశానికి పతకాలు గెలిచామా?”: పోలీసులు దాడి చేశారంటూ కంటతడి పెట్టిన రెజర్లు
04 May 2023, 6:41 IST
- Wrestlers Protest: ఢిల్లీ పోలీసులు తమపై దాడి చేశారంటూ టాప్ రెజర్లు ఆవేదన వ్యక్తం చేశారు. తమను దూషించారని కంటతడి పెట్టుకున్నారు. భావోద్వేగానికి లోనయ్యారు.
Wrestlers Protest: పోలీసులు దాడి చేశారంటూ కంటతడి పెట్టిన రెజర్లు
Wrestlers Protest: దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్(Jantar Mantar) వద్ద ఆందోళన చేస్తున్న భారత టాప్ రెజర్ల శిబిరం వద్ద బుధవారం రాత్రి తీవ్రమైన గొడవ జరిగింది. మద్యం తాగివచ్చిన ఢిల్లీ పోలీసులు తమను లక్ష్యంగా చేసుకొని దాడి చేశారని రెజర్లు ఆరోపించారు. ఆందోళన శిబిరం వద్ద నిద్రించేందుకు తాము ఏర్పాట్లు చేసుకుంటుండగా దాడి చేశారని రెజర్లు చెప్పారు. పోలీసులు తమను కొట్టారని, మహిళా రెజర్లను తిట్టారని వెల్లడించారు. ఈ ఘటనలో కొందరు రెజ్లర్లకు గాయాలయ్యాయి. ఒకరు స్పృహ తప్పటంతో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో రెజర్లు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.
కంట తడి పెట్టిన వినేశ్, సాక్షి మాలిక్
Wrestlers Protest: ఆసియా, కామన్‍వెల్త్ స్వర్ణ పతకాల విజేత వినేశ్ ఫొగాట్, ఒలింపిక్ పతక విజేత సాక్షి మాలిక్ కంటతడి పెట్టారు. పోలీసులు తమను తీవ్రంగా దూషించారని ఆవేదన వ్యక్తం చేశారు. “ఇలాంటి రోజు చూసేందుకా మేము దేశానికి పతకాలు గెలిచింది?” అని వినేశ్ భావోద్వేగానికి లోనయ్యారు.
Wrestlers Protest: మద్యం సేవించి వచ్చిన పోలీసు అధికారి ఒకరు ముందుగా శిబిరంలోని ఓ ఇద్దరిపై దాడి చేశారని వారు ఆరోపించారు. ఆ తర్వాత మరికొందరు పోలీసులు అందరినీ తోస్తూ.. తిట్టారని చెప్పారు.
Wrestlers Protest: “మేం క్రిమినల్స్ కాదు. కానీ వారు మాతో అలా ప్రవర్తిస్తున్నారు. ఓ పోలీసు నన్ను తోశారు. దూషించారు. అసలు మహిళా పోలీసులు ఎక్కడ ఉన్నారు” అని వినేశ్ ఫొగాట్ ప్రశ్నించారు.
Wrestlers Protest: తాను సాధించిన పతకాలను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలంటూ ప్రపంచ చాంపియన్‍షిప్‍లో నాలుగుసార్లు మెడల్స్ సాధించిన టాప్ రెజ్లర్ బజరంగ్ పూనియా భావోద్వేగానికి లోనయ్యారు.
Wrestlers Protest: వర్షం పడుతున్న కారణంగా ఆందోళన శిబిరం వద్ద ఉన్న దుప్పట్లను రెజర్లు మడత పెడుతున్న సమయంలో.. పోలీసులు అందుకు నిరాకరించటంతో ఈ గొడవ మొదలైందని తెలుస్తోంది. బెడ్‍ల గురించి అడిగితే రెజర్లు, వారి మద్దతుదారులు దూకుడు ప్రదర్శించారని, ఓ ట్రక్ నుంచి బెడ్‍లు తీసేందుకు ప్రయత్నించారని ఢిల్లీ పోలీసులు చెప్పారు. అనుమతి లేకుండా ఫోల్డ్ చేసిన బెడ్‍లతో ఆమ్ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సోమ్‍నాథ్ భారతీ.. ఆందోళన శిబిరం వద్దకు వచ్చారని వెల్లడించారు.
Wrestlers Protest: లైగింక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆప్ ఇండియా (WFI) చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‍పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 23వ తేదీ నుంచి జంతర్ మంతర్ వద్దే రెజర్లు ఆందోళన చేస్తున్నారు. ఓ మైనర్ సహా ఏడుగురు మహిళా రెజర్లను ఆయన వేధించారని వారు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలను బ్రిజ్ భూషణ్ ఖండిస్తున్నారు. ఇవి నిరాధార ఆరోపణలని, పార్టీ చెబితే తాను రాజీనామా చేస్తానని అన్నారు. మరోవైపు, బ్రిజ్ భూషణ్‍పై ఢిల్లీ పోలీసులు ఇటీవలే రెండు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు.