Bypoll results: ఉప ఎన్నికల పోరులో విపక్ష కూటమిదే విజయం
08 September 2023, 19:35 IST
Bypoll results: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. కేరళ, పశ్చిమబెంగాల్, జార్ఖండ్, యూపీ, త్రిపుర, ఉత్తరాఖండ్ లోని మొత్తం 7 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి.
కేరళలోని పుతుపల్లి స్థానం నుంచి గెలుపొందిన ఊమెన్ చాందీ
Bypoll results: ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఆ ఉప ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెలువడ్డాయి. ఈ ఉప ఎన్నికల్లో విపక్ష కూటమిలోని పార్టీలు నాలుగు స్థానాలను, బీజేపీ మూడు స్థానాలను గెలుచుకున్నాయి. త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయేను ఎదుర్కోవడం కోసం ప్రత్యేకంగా ఇండియా పేరుతో కూటమిని ఏర్పాటు చేసిన విపక్ష పార్టీలకు ఈ ఉప ఎన్నికల్లో విజయం మంచి ఉత్సాహాన్ని ఇచ్చింది. ప్రతిపక్ష పార్టీలు ఇండియా పేరుతో కూటమిని ఏర్పాటు చేసిన తరువాత జరిగిన తొలి ఎన్నికలు ఇవే కావడం విశేషం.
ఎక్కడెక్కడ?
విపక్ష కూటమిలో.. పశ్చిమబెంగాల్ లోని ధుంప్గురి అసెంబ్లీ స్థానంలో అధికార టీఎంసీ విజయం సాధించింది. రెండో స్థానంలో బీజేపీ నిలిచింది. జార్ఖండ్ లోని దుమ్రి స్థానంలో సిటింగ్ పార్టీ జేఎంఎం విజయం సాధించింది. కేరళలో కాంగ్రెస్ నేత, మాజీ సీఎం, దివంగత చాందీ ఊమెన్ కుమారుడు ఊమెన్ చాందీ పుతుపల్లి స్థానం నుంచి గెలుపొందారు. ఉత్తర ప్రదేశ్ లోని ఘోసి సీట్ లో సమాజ్ వాదీ పార్టీ గెలుచుకుంది. త్రిపుర లోని బొక్స నగర్, ధన్ పూర్ సీట్లను, ఉత్తరాఖండ్ లోని బాగేశ్వర్ స్థానాన్ని బీజేపీ గెలుచుకుంది.
రానున్న ఎన్నికల్లో..
త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు, 2024 లోక్ సభ ఎన్నికలకు లిట్మస్ టెస్ట్ గా ఈ ఉప ఎన్నికలను భావించారు. త్వరలో మధ్యప్రదేశ్, రాజస్తాన్, చత్తీస్ గఢ్, తెలంగాణ, మిజోరం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.