Uttar Pradesh crime: కేంద్ర మంత్రి ఇంట్లో యువకుడి హత్య; మంత్రి కొడుకుపైనే అనుమానం
01 September 2023, 18:55 IST
Uttar Pradesh crime: కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ కౌశల్ కిశోర్ (Kaushal Kishore) ఇంట్లో ఒక యువకుడి మృతదేహం లభ్యం కావడం ఉత్తర ప్రదేశ్ లో కలకలం రేపింది. ఆ యువకుడి శరీరంపై బుల్లెట్ గాయాలు ఉన్నాయి. కేంద్ర మంత్రి కుమారుడే ఈ హత్య చేసినట్లు భావిస్తున్నారు.
ప్రతీకాత్మక చిత్రం
Uttar Pradesh crime: ఉత్తర ప్రదేశ్ లోని లక్నోలో కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ కౌశల్ కిశోర్ (Kaushal Kishore) ఇంట్లో శుక్రవారం ఉదయం 30 ఏళ్ల యువకుడి మృతదేహం కనిపించింది. పోలీసులకు సమాచారం తెలియడంతో, అక్కడికి వెళ్లిన పోలీసులు ఆ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కొడుకు పైననే అనుమానం..
ఆ మృతదేహం స్థానికంగా ఉండే వినయ్ శ్రీవాస్తవ్ దిగా పోలీసులు గుర్తించారు. అతడి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని పశ్చిమ లక్నో డీసీపీ రాహుల్ రాజ్ తెలిపారు. ఆ యువకుడి మృతదేహంపై బుల్లెట్ గాయాలున్నాయని పోలీసులు తెలిపారు. కేంద్ర మంత్రి కౌశల్ కిశోర్ కుమారుడు వికాస్ కిషోర్ కు చెందిన పిస్టల్ ను ఈ కాల్పులకు ఉపయోగించినట్లు తెలుస్తోందని వివరించారు. ఆ పిస్టల్ ను స్వాధీనం చేసుకున్నామన్నారు. శుక్రవారం తెల్లవారు జామున 4 గంటల సమయంలో ఈ హత్య జరిగి ఉంటుందని భావిస్తున్నామన్నారు. అయితే, వినయ్ శ్రీ వాస్తవ పై కాల్పులు జరిపింది వికాస్ కిషోరా? లేక మరెవరోనా? అన్న కోణంలో దర్యాప్తు జరుపుతున్నామన్నారు. గురువారం రాత్రి వికాస్ కిషోర్ ఆ ఇంట్లో లేడని కేంద్ర మంత్రి కౌశల్ కిశోర్ కుటుంబ సభ్యులు చెబుతున్నారని పోలీసులు వివరించారు.
ఇద్దరూ మంచి ఫ్రెండ్స్..
కాగా, మృతుడు వినయ్ శ్రీ వాస్తవ, అనుమానితుడు, కేంద్ర మంత్రి కుమారుడు వికాస్ కిషోర్ లు మంచి స్నేహితులని తెలుస్తోంది. తన సోదరుడిది ఆత్మహత్యగా చిత్రించే ప్రయత్నం జరుగుతోందని వినయ్ శ్రీ వాస్తవ సోదరుడు ఆరోపిస్తున్నాడు. వినయ్ శ్రీ వాస్తవ మృతదేహంపై ఉన్న షర్ట్ చినిగి ఉందని, దీన్నిబట్టి ఇది హత్యేనని, ఆ సమయంలో గొడవ జరిగిందని తెలుస్తోందని చెప్పారు. హత్య జరిగిన సమయంలో అక్కడ ముగ్గురు ఉన్నారని తనకు తెలిసిందన్నారు. కాగా, మృతుడు వినయ్ శ్రీ వాస్తవ, తన కుమారుడు మంచి స్నేహితులని కేంద్ర మంత్రి కౌశల్ కిశోర్ తెలిపారు. అతడి మృతి దురదృష్టకరమని, కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని వివరించారు. సంఘటన స్థలంలో లభించిన పిస్టల్ తన కుమారుడిదేనన్నారు.