UP Election 2022| ఉత్తరప్రదేశ్ లో అధికారం ఎవరిది? గెలుపును నిర్ణయించే దళితులు ఎటు వైపు?
02 February 2022, 14:38 IST
- మరికొన్ని రోజుల్లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. సహజంగానే ఈ రాష్ట్రంపై దేశం దృష్టి ఉంటుంది. ఇక ఇక్కడ ఎన్నికలంటే మాటలా? అందరి చూపు యూపీ వైపే. ఉత్తరప్రదేశ్ లో దళితులది నిర్ణయాత్మకమైన ఓటు బ్యాంకు. వాళ్లు ఎవరి వైపు ఉంటారనేది ఇప్పుడు అసలు ప్రశ్న?
ఉత్తరప్రదేశ్ ఎన్నికలు 2022
ఉత్తరప్రదేశ్ లో కీలక ఓటు బ్యాంకుల్లో దళితులది ముఖ్యమైన పాత్ర. యూపీలో 22 శాతం మంది ఓటర్లు దళితులు. వారి నుంచి గాలి ఏ పార్టీ వైపు వీస్తే.. వాళ్లదే విజయం అనేంతలా ఉంటుంది. యూపీలో జనాభాతోపాటు అసెంబ్లీ స్థానాలు ఎక్కువే. 15 కోట్ల మంది ఓటర్లు ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు దశల్లో ఎన్నికల్లో పాల్గొంటారు. 403 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. మార్చి 10న ఓట్ల లెక్కింపు.. ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో తేలిపోనుంది. అయితే ఈ గెలుపు ఓటముల్లో యూపీలోని దళితుల పాత్ర చాలా ముఖ్యమైనది.
ఇతర వెనుకబడిన తరగతులు (OBC), జాట్‌లు, ముస్లింలు, బ్రాహ్మణులు ఎన్నికల్లో నిర్ణయాత్మకమైన పాత్రే అయినప్పటికీ.. గెలుపు ఓటములను నిర్ణయించేది మాత్రం దళితులే అనేది వాస్తవం. బహుజన్ సమాజ్ పార్టీ (BSP) దళితుల వాయిస్ గా ఉంది. కానీ, చాలా రోజులుగా సమీకరణాలు మారుతున్నాయి. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారానికి బీఎస్పీ నుంచి సరైన నాయకత్వం లేదని విమర్శలు వస్తున్నాయి. అయితే, బీఎస్పీ నేతలు మాయావతి, సతీష్ చంద్ర మిశ్రా మాత్రం.. కావాలనే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని అంటున్నారు. ఇక్కడ దళితుల్లో 66 ఉప జాతులు ఉన్నాయి. దాదాపు 55 శాతం దళిత ఓట్లు జాట్లవే. చాలా ఏళ్లుగా బీఎస్పీకి, మాయావతికి అండగా నిలుస్తూ వచ్చారు.
2007 ఎన్నికల్లో బీఎస్పీ అధికారంలోకి రావడానికి ఈ ఓట్లు ఎంతో కీలకంగా ఉపయోగపడ్డాయి. కానీ రానురాను బీఎస్పీకి వీరి నుంచి మద్దతు తగ్గుతూ వస్తోంది. బీఎస్పీకి దళితుల నుంచి 2012 అసెంబ్లీ ఎన్నికల్లో 25 శాతం ఓట్లు వచ్చాయి. 2017లో 20 శాతానికి తగ్గిపోయాయి. అయితే తక్కువ స్థానాలే వచ్చినా.. దళిత ఓట్ల శాతం మాత్రం బీఎస్పీతోనే ఉంది.
2012లో సమాజ్‌వాదీ పార్టీ స్పష్టమైన మెజారిటీ సాధించినప్పుడు, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రిజర్వ్‌డ్ స్థానాల్లో 58 స్థానాలను గెలుచుకుంది. 2017లో దళితులు, ఎస్టీలకు రిజర్వ్ చేసిన 86 స్థానాల్లో 76 స్థానాలను బీజేపీ, దాని మిత్రపక్షాలు కైవసం చేసుకున్నాయి. 2014 నుంచి దళితులు బీజేపీ వైపు ఓట్లు వేయడం కనిపిస్తూ వచ్చింది.
2022ల దళితులు ఎవరికి ఓటు వేస్తారు?
దళిత ఓటర్లు మాయవతికి అండగా నిలుస్తారని బీఎస్పీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. 2009 నుంచి జరిగిన అన్ని ఎన్నికల్లో రిజర్వ్‌డ్ కేటగిరీ స్థానాల ఫలితాలు, ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఎన్నికలలో బీఎస్పీ దాదాపు 20 శాతం ఓట్ షేర్‌ను కలిగి ఉంది. కానీ దళితుల ఓటు బ్యాంకుపై ఆమె పార్టీ పట్టు కోల్పోయిందని సమీకరణాలు సూచిస్తున్నాయి. ఈసారీ దళితుల ఓట్లు చీలే అవకాశం లేదని.., ముస్లిం, బ్రాహ్మణ ఓట్లు కూడా బీఎస్పీకే వస్తాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఒకవేళ ఇదే జరిగితే.. బీఎస్పీకి కలిసి వచ్చే అంశమే.
మాయావతి సొంత కుల ఓటర్లు, జాట్లు ఆమెకు బలమైన ఓటు బ్యాంకుగా ఉంది. ఇటీవలి కాలంలో బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీలు జాటేతర ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నలు చేశాయి. భీమ్ ఆర్మీ చీఫ్, అజాద్ సమాజ్ పార్టీ అధ్యక్షుడు చంద్ర శేఖర్ ఆజాద్ 'రావణ్' ద్వారా సమాజ్ వాదీ పార్టీ ప్రణాళికలు వేస్తోంది. అయితే ఆ పార్టీకి రెండు స్థానాలు ఇస్తామని చెప్పడంతో చంద్రశేఖర్ ఎస్పీతో పొత్తుపై సైలెంట్ అయిపోయారు. మరోవైపు బీఎస్పీ నుంచి బయటకు వచ్చిన నేతల కోసం.. అఖిలేష్ యాదవ్ పార్టీలో తలుపులు తెరిచారు. దళిత నేతలను ఆకట్టుకోడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇక బీజేపీ సైతం.. దళిత ఓటుబ్యాంకును తమ వైపు తిప్పుకునేలా ప్రణాళికలు వేస్తోంది. గతంలో మాదిరిగా రిజర్వ్ స్థానాల్లో గెలిస్తే.. మళ్లి అధికారం వస్తుందని ఆశతో ఉంది. అంతేకాదు.. పాసీ, కోరీ, ధోబీ లాంటి కులాలపై దృష్టి కేంద్రీకరిస్తోంది. పార్టీ టికెట్ల విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది.
ఎప్పటి నుంచో యూపీలో పాగా వేయాలని భావిస్తున్న కాంగ్రెస్ సైతం.. దళితుల ఓట్లను దక్కించేందుకు కావాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తోంది. ప్రియాంకా గాంధీ, రాహుల్ గాంధీ తరచూ అణచివేతకు గురైన దళితుల ఇళ్లకు వెళ్తున్నారు. యూపీలో సంచలనం రేపిన.. హథ్రాస్ ఘటన బాధితురాలికి ఇంటికి వెళ్లిన తర్వాత అక్కడ వివిధ రకాల పరిణామాలు చోటుచేసుకున్న విషయం కూడా తెలిసిందే. పోలీసుల అదుపులో మరణించినట్లు ఆరోపణలు ఉన్న అరుణ్ వల్మీక్ ఇంటికి కూడా వెళ్లారు.
కానీ విశ్లేషకులు మాత్రం.. ఈసారి బీజేపీ వర్సెస్ సమాజ్ వాద్ పార్టీ అన్నట్టుగానే యూపీ ఎన్నికలు ఉంటాయని చెబుతున్నారు. దళితుల ఎవరికి ఓటు వేస్తారో.. అధికారం ఎటువైపు వెళ్తుందో వేచి చూడాలి.