యూఎస్ లా ప్రొఫెసర్ నోటి దురుసు.. భారత్ ఓ చెత్త దేశమంటూ వ్యాఖ్య
13 April 2022, 18:24 IST
- నూతన ప్రపంచ స్వర్గ ధామంగా భావించే, విభిన్న జాతుల ప్రజలకు సమానావకాశాలు కల్పిస్తున్నామని చెప్పుకునే అమెరికాలో జాత్యహంకార ధోరణులు ఇంకా తగ్గలేదని, ఆసియా, ఆఫ్రికా దేశాలపై చిన్న చూపు కొనసాగుతోందని నిరూపించే మరో ఉదాహరణ ఇది.
టకర్ కార్ల్‌సన్ షోలో మాట్లాడుతున్న లా ప్రొఫెసర్ ఎమీ వాక్స్
ఒక టీవీ లైవ్ షోలో భారత్ ఒక అత్యంత చెత్త దేశమని ఉన్నత విద్యా వంతురాలైన ఒక ప్రొఫెసర్ నోరు పారేసుకుంది. దీనిపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికన్ల జాత్యహంకారాన్ని దుయ్యబడుతూ నెటిజన్లు మెసేజ్‌లు పెడుతున్నారు. `బ్లాక్ లైవ్స్ మ్యాటర్` లాంటి ఉద్యమాలు, నిరసన ప్రదర్శనలు, సమానత్వం దిశగా ముందుచూపున్న నాయకులు తీసుకున్న నిర్ణయాలు మొదలైనవి మెజారిటీ అమెరికన్ల జాత్యహంకారంపై ఎలాంటి ప్రభావం చూపలేదని అర్థమవుతోందని విమర్శిస్తున్నారు.
‘బ్రాహ్మణ మహిళలతో అదే సమస్య’
`టకర్ కార్ల్‌సన్ టాక్ షో`లో పెన్సిల్వేనియా యూనివర్సిటీలో లా ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఎమీ వాక్స్ ఈ జాత్యహంకార వ్యాఖ్యలు చేశారు. అమెరికాలోని ఇమిగ్రెంట్‌ను, ముఖ్యంగా భారతీయులను, భారత బ్రాహ్మణ మహిళలను, భారత దేశాన్ని ఉద్దేశించి అవమానకర రీతిలో అత్యంత తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
భారత్ అత్యంత అనాగరిక, చెత్త దేశమని నోరు పారేసుకున్నారు. ఆమె వ్యాఖ్యలకు సంబంధించిన రెండు వీడియోలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.
`బ్రాహ్మణులం కాబట్టి మనం ఇతరులందరి కన్నా అధికుల మని వారికి(భారత్ నుంచి వచ్చిన బ్రాహ్మణ మహిళలు) చిన్నప్పటి నుంచి నూరిపోశారు. వారితో ఇదే సమస్య. అదే సమయంలో, వాళ్ల దేశం ఒక అత్యంత చెత్త, అనాగరిక దేశం` అని ఒక వీడియోలో ఆమె వ్యాఖ్యానించారు.
పాశ్చాత్య దేశాల ప్రజలంటే నల్లవారికి, ఆసియా దేశాల వారికి అసూయ అని మరో వీడియోలో నోరు చేసుకున్నారు. `పాశ్చాత్య దేశాల ప్రజలు సాధించిన విజయాలు, దేశాభివృద్ధికి వారు అందించిన తోడ్పాడు చూసి బ్లాక్స్, ఆసియన్లు అసూయ పడుతుంటారు. వైట్స్‌పై ద్వేషం, అసహనం పెంచుకుంటూ ఉంటారు` అని ఆ వీడియోలో ప్రొఫెసర్ వాక్స్ ఆఫ్రికన్లు, ఆసియన్లపై విద్వేషం వెళ్లగక్కారు.