US H-1B visa news: హెచ్ 1 బీ వీసాదారుల కుటుంబ సభ్యులకు శుభవార్త
28 June 2023, 16:54 IST
US H-1B visa news: అమెరికాలో ఉద్యోగం చేయడానికి అవకాశం కల్పించే హెచ్ 1బీ వీసా ఉన్నవారి కుటుంబ సభ్యులకు కెనడా శుభవార్త తెలిపింది. హెచ్ 1 బీ వీసాదారుల కుటుంబ సభ్యులకు కెనడాలో ఉద్యోగం చేయడానికి కానీ, చదువుకోవడానికి కానీ ఎలాంటి ఆంక్షలు లేకుండా అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించింది.
కెనడా ఇమిగ్రేషన్ మంత్రి సీన్ ఫ్రేజర్
US H-1B visa news: అమెరికాలో ఉద్యోగం చేయడానికి అవకాశం కల్పించే హెచ్ 1బీ (H-1B vis) వీసా ఉన్నవారికి కెనడా శుభవార్త తెలిపింది. హెచ్ 1 బీ వీసాదారులు కెనడా (Canada)లో ఉద్యోగం చేయడానికి ఓపెన్ వర్క్ పర్మిట్ విధానాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. ప్రతీ సంవత్సరం 10 వేల మందికి ఈ అవకాశం కల్పిస్తామని వెల్లడించింది. అలాగే, హెచ్ 1 బీ వీసాదారుల కుటుంబ సభ్యులకు కెనడాలో ఉద్యోగం చేయడానికి కానీ, చదువుకోవడానికి కానీ ఎలాంటి ఆంక్షలు లేకుండా అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కెనడా ఇమ్మిగ్రేషన్ మంత్రి సీన్ ఫ్రేజర్ ప్రకటించారు. ఈ నిర్ణయంతో అమెరికాలో హెచ్ 1 బీ వీసాపై ఉద్యోగం చేస్తున్న విదేశీయులకు, ముఖ్యంగా భారతీయులకు ప్రయోజనం కలుగుతుంది.
జులై 16, 2023 నాటికి..
‘‘అమెరికాలోని కంపెనీల్లో వేల సంఖ్యలో విదేశీయులు వివిధ హై టెక్ రంగాల్లో ఉద్యోగాల్లో ఉన్నారు. వారిలో అత్యధికులు హెచ్1 బీ వీసా కలిగి ఉంటారు. జులై 16, 2023 నాటికి హెచ్ 1 బీ వీసా కలిగి ఉన్న విదేశీయులు, వారితో పాటు ఉన్న వారి సమీప కుటుంబ సభ్యులు కెనడాకు వచ్చేందుకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు’’ అని కెనడా ఇమ్మిగ్రేషన్ విభాగం ప్రకటించింది. వారికి కెనడాలో మూడేళ్ల పాటు ఉద్యోగం చేయడానికి వర్క్ పర్మిట్ లభిస్తుంది. వారు కెనడా లో ఎక్కడ అయినా, ఏ కంపెనీలో అయినా ఆ మూడేళ్లు ఉద్యోగం చేసుకోవచ్చు. వారి జీవిత భాగస్వామ్యులకు, వారిపై ఆధారపడినవారికి కెనడాలో వర్క్ లేదా స్టడీ వీసా ఇస్తారు. అలాగే, వారు కెనడాలో తాత్కాలిక రెసిడెంట్ వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వివిధ టెక్ ఫీల్డ్స్ లో నైపుణ్యం, అనుభవం కలిగిన వారు.. ఉద్యోగం ఉన్నా.. లేకపోయినా.. కెనడాకు రావడానికి, కెనడాలో ఉద్యోగం కోసం ప్రయత్నించడానికి అవకాశం కల్పించే ఇమిగ్రేషన్ విధానాన్ని ఈ సంవత్సరం చివరి నాటికి అమల్లోకి తీసుకురావాలని కెనడా యోచిస్తోంది.