Jhansi hospital fire : ఏడుగురు శిశువులను కాపాడిన వీరుడు- సొంత బిడ్డలను పోగొట్టుకున్నాడు!
19 November 2024, 9:00 IST
- Jhansi hospital fire news : ఝాన్సీలోని హాస్పిటల్లో జరిగిన అగ్నిప్రమాదంలో 12మంది పసికందులు మరణించారు. అయితే ఓ వ్యక్తి వీరోచితంగా పోరాడి, ఏడుగురు శిశువులను రక్షించాడు. కానీ తన సొంత బిడ్డలను కాపాడుకోలేకపోయాడు.
ఝాన్సీ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం..
ఉత్తర్ ప్రదేశ్ ఝాన్సీ హాస్పిటల్లో జరిగిన అగ్నిప్రమాదం, యావత్ భారత దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే ప్రమాదం సమయంలో ఐసీయూలోని పసికందులను రక్షించేందుకు కొందరు వీరోచితంగా పోరాటం చేశారు. వారిలో యాకూబ్ మన్సూరి ఒకరు. మంటలు చెలరేగుతున్నా ధైర్యం చేసి ఏడుగురు శిశువులను రక్షించాడు. కానీ సొంత బిడ్డలను కాపాడుకోలేకపోయాడు!
ఇదీ జరిగింది..
మహారాణి లక్ష్మీబాయి మెడికల్ కాలేజీలోని నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఎన్ఐసీయూ)లో గత శుక్రవారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం 12 మంది నవజాత శిశువులు మృతి చెందారు. అనేక మంది గాయపడ్డారు!
అయితే ఈ ప్రమాదానికి ముందు యాకూబ్ మన్సూరి అనే వ్యక్తికి చెందిన ఇద్దరు బిడ్డలు ఐసీయూలో అడ్మిట్ అయ్యారు. మంటలు చెలరేగిన సమయంలో యాకూబ్ సమీపంలోనే ఉన్నాడు. మంటలు చెలరేగిన వెంటనే వీరోచితంగా అతను వార్డులోకి పరుగులు తీశాడు. అగ్నిప్రమాదంలో మంటలు ఎగిసిపడుతున్నా, విజిబిలిటీ తగ్గిపోయినా, ఏడుగురు శిశువులను కాపాడాడు.
"చాలా పెద్ద ప్రమాదం జరిగింది. ఎవరు ధైర్యం చేయలేదు. అంతా గందరగోళంగా ఉంది. పొగ అలుముకుంది. సహాయక చర్యలు సవాలుగా మారాయి," అని చెప్పాడు యాకూబ్.
ఇన్ని ప్రతికూలతల మధ్యలోనూ ఐసీయూ కిటికీని పగలగొట్టి లోపలికి వెళ్లిన యాకూబ్.. శిశువులను కాపాడాడు.
అయితే, తన ఇద్దరు ఆడబిడ్డలు ఉన్న వార్డులోకి మాత్రం యాకూబ్ వెళ్లలేకపోయాడు.
"చాలా ప్రయత్నించాను. కానీ నా బిడ్డలు ఉన్న వార్డులోకి వెళ్లలేకోపాయాను. నాతో పాటు మరికొందరు ప్రయత్నించారు. కానీ ఫలితం దక్కలేదు. ఇతర వార్డుల్లోని పిల్లలను కాపాడాము," అని యాకూబ్ చెప్పుకొచ్చాడు.
"నాకు ఇద్దరు ఆడబిడ్డలు. ఇద్దరినీ కోల్పోయాను," అని కన్నీళ్లతో చెప్పాడు యాకూబ్.
ఝాన్సీ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం ఘటన తర్వాతి రోజు మృతదేహాలను గుర్తించారు.
బిడ్డలను కోల్పోయామని, తమకు న్యాయం జరగాలని యాకూబ్ చెబుతున్నాడు.
"మా బిడ్డలకు న్యాయం జరగాలి. అంతే," అని యాకూబ్ అన్నాడు.
ఘటనకు కారణం ఏంటి?
ఝాన్సీ హాస్పిటల్లో అగ్నిప్రమాదం ఘటనపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. అయితే, షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక దర్యాప్తు చెబుతోంది.
వైద్య విద్య, శిక్షణ డైరెక్టర్ జనరల్ కింజల్ సింగ్ నేతృత్వంలోని నలుగురు సభ్యుల బృందం సోమవారం మెడికల్ కాలేజీని సందర్శించి అగ్నిప్రమాదంపై విచారణ జరిపింది. వైద్యులు, సిబ్బంది వాంగ్మూలాలను నమోదు చేసిన ఈ బృందం, మంటలు దెబ్బతిన్న వార్డు, పరికరాలను పరిశీలించి, రక్షించిన నవజాత శిశువుల సమాచారాన్ని సేకరించింది. ఏడు రోజుల్లో విచారణ కమిటీ తన నివేదికను సమర్పించనుంది.