Ukraine | ఆయుధాలు పట్టిన పౌరులకు 'క్రాష్ కోర్స్'
06 March 2022, 21:32 IST
- యుద్ధం వేళ ఉక్రెయిన్ పౌరులు చూపిస్తున్న ధైర్య సాహసాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి. అయితే ఆయుధాలపై పట్టు ఉన్న కొందరు.. సాధారణ పౌరులకు ‘క్రాష్ కోర్స్’ ఇస్తున్నారు. పౌరులకు ఆయుధాలపై ట్రైనింగ్ ఇచ్చి.. వారిని ప్రోత్సహిస్తున్నారు.
రష్యన్ సైనికుల నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలు
Ukraine crash course | రష్యా దండయాత్ర వేళ ఉక్రెయిన్ సైన్యానికి అక్కడి పౌరులు అండగా నిలుస్తున్నారు. జీవితంలో ఇప్పటివరకు ఒక్కసారి కూడా గన్లు పట్టని ప్రజలు.. ఇప్పుడు ఏకంగా రైఫిళ్లు పట్టుకుని రోడ్ల మీదకు దిగుతున్నారు. 'మేము వెనకడుగు వేయము. చంపుతాం.. లేకపోతే చస్తాం,' అని నినాదాలు చేస్తున్నారు. ఒక్కోసారి వీరి ధైర్యానికి రష్యన్ సైనికులు కూడా తలవంచక తప్పడం లేదు. కేవలం కొన్ని రోజుల్లోనే ఆయుధాలపై పట్టు సాధించి షాక్‌లు ఇస్తున్నారు. ఇది ఎలా సాధ్యం అని శత్రువులు తలలు పట్టుకుంటున్నారు.! దీని వెనక పలువురు యుద్ధ వీరులు ఉన్నట్టు తెలుస్తోంది. ఆయుధ శిక్షణలో పౌరులకు వారు 'క్రాష్ కోర్స్' ఇస్తున్నట్టు సమాచారం.
డెన్నిస్ కుహౌట్ అనే వ్యక్తి గతంలో.. డాన్‌బాస్‌లోని అగ్నిమాపక దళంలో పనిచేశాడు. ఇప్పుడు ఆయన ఉక్రెయిన్ ఎల్వివ్‌లో పౌరులకు ఆయుధాలపై శిక్షణ ఇస్తున్నారు. అదివారం సైతం ఇలాంటి శిక్షణా కార్యక్రమం జరిగింది. ఆయుధాల్లో శిక్షణ అంటే.. సాధారణ విషయాలు తెలుసుకునేందుకే రోజులు పట్టేస్తుంది. కానీ ఈయన మాత్రం ఒక్క రోజులో అంతా చెప్పేశారు.
పౌరుల సహాయంతోనే ఇది జరుగుతోంది. దేశం కోసం పోరాడాలన్న తపన.. అక్కడి పౌరుల్లో ఎక్కువగా ఉంది. అందుకే డెన్నిస్ చెప్పిన పాఠాలను అత్యంత శ్రద్ధగా విని అమలు చేస్తున్నారు. ఫలితంగా డెన్నిస్‌కు పని కాస్త సులభమైంది.
"ఈ గదిలో ఉన్న వారిలో కనీసం 10మంది ఆయుధాలు పట్టి.. రష్యా సైనికులపై పోరాడితే.. నా శిక్షణకు మంచి ఫలితం, విలువ దక్కినట్టుగా భావిస్తాను," అని డెన్నిస్ చెప్పుకొచ్చాడు.
శిక్షణలో భాగంగా.. రైఫిల్‌ను ఎలా పట్టుకోవాలి, ఎలా నిలబడాలి, శత్రువులు దాడి చేసినప్పుడు.. మన కదలికలు ఎలా ఉండాలి, పొత్తికడుపుపై పడుకుని ఆయుధాలు ఎలా వినియోగించాలి.. వంటి అంశాలను డెన్నిస్ నేర్పించాడు. వీటిని పౌరులు ఎంతో జాగ్రత్తగా విన్నారు.
'రష్యా దళాలపై పోరుకు సిద్ధమేనా? అంటే.. నేను ఇంకా రెడీ కాదు అనే చెబుతాను,' అని అన్న ఓ పౌరుడు.. 'కానీ అవసరమైతే క్షేత్రస్థాయిలోకి దిగుతాను, ఇప్పుడు లభించిన శిక్షణతో దేశం కోసం పోరాడతాను,' అని తేల్చిచెప్పాడు. యుద్ధం త్వరలో ముగియాలని ఓ ఐటీ ప్రాజెక్ట్ మేనేజర్ ప్రార్థనలు చేశాడు. 'ఒక వేళ యుద్ధం కొనసాగితే.. నా భార్య, పిల్లలను సురక్షిత ప్రాంతానికి పంపించి.. నేను ఆయుధాలు పట్టుకుని రోడ్డు మీదకు వెళతాను,' అని స్పష్టం చేశాడు. 'ఇది మా భూమి.. ఇది మా దేశం.. కచ్చితంగా కాపాడుకుంటాము,' అని నినాదాలు చేశాడు.
ఉక్రెయిన్ లెక్కల ప్రకారం.. యుద్ధం మొదలైన నాటి నుంచి.. లక్ష మందికిపైగా పౌరులు.. ఆయుధాలు పట్టుకున్నారు. రోడ్డు మీదకొచ్చి.. సైన్యానికి తమవంతు సాయం చేస్తున్నారు.
మేము సైతం…
రష్యా దండయాత్రను అడ్డుకునేందుకు ఉక్రెయిన్ అన్ని విధాలుగా శ్రమిస్తోంది. అక్కడి ప్రభుత్వానికి, సైనికులకు.. పౌరులు సైతం మద్దతుగా నిలుస్తున్నారు. రాజధాని కీవ్వాసులు.. రోడ్ల మీదకొచ్చి ధైర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. వీరికి అధికారులు ఆయుధాలను సమకూరుస్తున్నారు. అయితే 'మేము తక్కువ కాదు..' అంటూ ఉక్రెయిన్ మహిళలు సైతం ఆయుధాలను పట్టుకుంటున్నారు. శత్రువులను ఒడించేందుకు శిక్షణ పొందుతున్నారు. ఈ క్రమంలో.. ఉక్రెయిన్ మహిళా ఎంపీ, ఆ దేశా మాజీ బ్యూటీ క్వీన్.. ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
కిరా రూడిక్..
ఉక్రెయిన్ పార్లమెంట్ సభ్యురాలు కిరా రూడిక్.. ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. కలాష్నికోవ్ గన్ పట్టుకుని.. యుద్ధానికి సై అంటూ ఆమె సామాజిక మాధ్యమాల్లో ఫొటో షేర్ చేశారు.
"యుద్ధంలో పోరాడేందుకు నేను కలాష్నికోవ్ గన్ పట్టుకున్నాను. ఇలాంటి ఓ రోజు వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. పురుషులతో పాటు.. ఉక్రెయిన్ను కాపాడుకునేందుకు మహిళలు సైతం ముందుకొస్తారు," అని కిరా పేర్కొన్నారు.
2015 మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ బ్యూటీ కాంటెస్ట్‌లో ఉక్రెయిన్ తరఫున ప్రాతినిధ్యం వహించిన అనాస్తాసియా లెన్నా సైతం ఇప్పుడు ఆయుధాలు పట్టుకున్నారు. గన్లు పట్టుకుని ఉన్న కొన్ని ఫొటోలను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు.
పిల్లలు కూడా యోధులే..
Ukraine children Odessa | రష్యా దండయాత్రను అడ్డుకునేందుకు ఉక్రెయిన్ సైనికులు, పురుషులు, మహిళలు ఏ విధంగా ప్రయత్నిస్తున్నారో.. ప్రపంచ దేశాలు చూస్తూనే ఉన్నాయి. తాజాగా.. ఈ జాబితాలోకి చిన్న పిల్లలు కూడా చేరారు! 'మా దేశాన్ని రక్షించుకుంటాము..' అంటూ ముందడుగు వేస్తున్నారు.
ఉక్రెయిన్ తీర ప్రాంతాల్లో ఒడెస్సా ఒకటి. రష్యన్ దళాన్ని అడ్డుకునేందుకు అక్కడి పౌరులు ఓ ప్రణాళికను రచించారు. సిటీ సెంటర్లో బ్యారికేడ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం సమీప బీచ్‌లలో నుంచి మట్టిని తీసుకొస్తున్నారు. వీరికి పిల్లలు కూడా సాయం చేస్తున్నారు. బీచ్‌ల వద్ద బ్యాగుల్లో మట్టిని నింపుతూ పలువురు చిన్నారులు కనిపించారు. మట్టి బ్యాగులను త్వరితగతిన ట్రక్కుల్లో ఎక్కించేందుకు నగరవాసులు మానవహారాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ కూడా చిన్నారులు ఉన్నారు. 'ఒడెస్సాను కాపాడుకుంటాం..' అని ఓ 11ఏళ్ల బాలిక చెప్పిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
టాపిక్