UK student visa explained: యూకే స్టూడెంట్ వీసా కావాలా? ఇది ఫాలో అయిపోండి..
12 October 2022, 20:27 IST
భారతీయ విద్యార్థులు పై చదువుల కోసం ఎక్కువగా చూసే దేశాల్లో అమెరికా తొలి స్థానంలో ఉంటే, తదుపరి స్థానంలో బ్రిటన్ ఉంటుంది. బ్రిటన్ లో ఉన్నత విద్య అభ్యసించాలంటే ఏం చేయాలి?
ప్రతీకాత్మక చిత్రం
యూకేలో ఉన్నత విద్య చాలా మంది భారతీయ విద్యార్థులకు కల. అది నెరవేరడం కోసం అహర్నిషలు కష్టపడుతుంటారు. యూకే స్టూడెంట్ వీసా రాగానే తమ కల నిజమైందని సంతోషపడుతుంటారు. ఇంతకీ యూకే స్టుడెంట్ వీసా కావాలంటే ఏం చేయాలి?
ఆర్నెళ్ల ముందు అప్లై చేసుకోవాలి
యూకేలో చదువుకోవాలనుకునే విద్యార్థులు కోర్సు ప్రారంభానికి ఆర్నెళ్లు ముందే స్టూడెంట్ వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్థి వయస్సు, యూకేలో చదవాలనుకునే కోర్సు పై ఆధారపడి వీసా టైప్ ఉంటుంది. అయితే, ముందుగా విద్యార్థి తనకు వీసా సాధించేందుకు అన్ని అర్హతలు ఉన్నాయా? లేదా? అన్నది చూసుకోవాలి.
ఏమేం కావాలి?
విద్యార్థి యూకే స్టూడెంట్ వీసా కోసం దరఖాస్తు చేసుకోవడానికి ముందుగా, అతడికి యూకేలోని విద్యాసంస్థ నుంచి confirmation of acceptance for studies (CAS) రిఫరెన్స్ నెంబర్ తో ఆఫర్ లెటర్ వచ్చి ఉండాలి. అలాగే, ఇంగ్లీష్ భాష పరిజ్ఞానాన్ని నిర్ధారించే IELTS వంటి పరీక్షల్లో మంచి స్కోర్ వచ్చి ఉండాలి. అలాగే, యూకేలో కోర్సు పూర్తి చేయడానికి అవసరమైన స్థోమతు ఉందన్న ప్రూఫ్ చూపించాలి. సాధారణంగా లండన్ లో ఏదైనా కోర్సు చేయడానికి కనీసం నెలకు రూ. 1334 పౌండ్లు అవసరమవుతాయి. లండన్ కు వెలుపల అయితే, నెలకు 1023 పౌండ్లు సరిపోతాయి.
డాక్యుమెంట్లు ఏం కావాలి?
యూకే వీసా పొందడానికి ముఖ్యంగా పాస్ పోర్ట్, విద్యార్హతల సర్టిఫికెట్లు, ఫండ్స్ ప్రూఫ్, CAS రిఫరెన్స్ నెంబర్ తో పాటు కొన్ని సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఉండాలి. యూకే స్టూడెంట్ వీసా కోసం ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. బ్రిటన్ ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్ Gov.UK ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్ ఫీ 363 పౌండ్లు ఉంటుంది.