PARLIAMENT SECURITY BREACH: పార్లమెంట్లో భారీ భద్రతా వైఫల్యం, చేతిలో టియర్ గ్యాస్ షెల్స్ తో లోక్ సభలోకి ఇద్దరు దుండగులు
13 December 2023, 17:18 IST
PARLIAMENT SECURITY BREACH: సరిగ్గా 22 సంవత్సరాల క్రితం పార్లమెంట్ పై దాడి జరిగిన రోజే, పార్లమెంట్లో మరో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ప్రేక్షకుల గ్యాలరీలో నుంచి ఇద్దరు దుండగులు లోక్ సభలో ఎంపీలు కూర్చునే ప్రాంతంలోకి దూకారు.
లోక్ సభలో స్మోక్ క్యానిస్టర్స్ తో పసుపు రంగు పొగను వెదజల్లుతూ ఇద్దరు దుండగుల అలజడి
PARLIAMENT SECURITY BREACH: సరిగ్గా 22 సంవత్సరాల క్రితం పార్లమెంట్ పై దాడి జరిగిన రోజే, పార్లమెంట్లో మరో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ప్రేక్షకుల గ్యాలరీలో నుంచి ఇద్దరు దుండగులు లోక్ సభలో ఎంపీలు కూర్చునే ప్రాంతంలోకి దూకారు. వారి చేతిలో టియర్ గ్యాస్ షెల్స్ ఉన్నట్లు సమాచారం. వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు వారిని అదుపులోకి తీసుకున్నాయి.
PARLIAMENT SECURITY BREACH: భద్రతాలోపం
పార్లమెంట్లో మరో భారీ భద్రతాలోపం బుధవారం బయటపడింది. పార్లమెంటు సమావేశాలు జరుగుతుండగా, లోక్ సభలో సభ్యులు అంతా ఉన్న సమయంలో, ఒక్కసారిగా ఇద్దరు దుండగులు ప్రేక్షకుల గ్యాలరీ లో నుంచి సభలోనికి దూకారు. వారి చేతిలో టియర్ గ్యాస్ షెల్స్ ఉన్నట్లు సమాచారం. వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు వారిని అదుపులోకి తీసుకున్నాయి. సరిగ్గా 22 సంవత్సరాల క్రితం, 2001లో పార్లమెంట్ పై దాడి జరిగిన డిసెంబర్ 13వ తేదీ రోజే ఈ ఘటన కూడా చోటు చేసుకోవడం గమనార్హం.
అసలేం జరిగింది..
లోక్ సభలో బుధవారం మధ్యాహ్నం 1.03 గంటల సమయంలో జీరో అవర్ కొనసాగుతోంది. సభాధ్యక్షుడిగా బీజేపీ ఎంపీ రాజేంద్ర అగర్వాల్ వ్యవహరిస్తున్నారు. ఆ సమయంలో అకస్మాత్తుగా డార్క్ బ్లూ షర్ట్ వేసుకున్న ఒక వ్యక్తి ప్రేక్షకుల గ్యాలరీ లో నుంచి సభ లోనికి దూకాడు. అతడి చేతిలో ఉన్న ఒక ట్యూబ్ వంటి దానిలో నుంచి పసుపు రంగు పొగ రాసాగింది. మొదట, ప్రేక్షకుల గ్యాలరీ లో నుంచి ప్రమాదవశాత్తూ ఆ వ్యక్తి సభలో పడ్డాడేమోనని ఎంపీలు భావించారు. ఇంతలో, మరో వ్యక్తి కూడా అలాంటి ట్యూబ్ నే పట్టుకుని లోక్ సభలోనికి దూకాడు. వారిద్దరూ స్పీకర్ స్థానం వైపునకు దూసుకురాసాగారు. ఇంతలో అప్రమత్తమైన ఎంపీలు, భద్రతా సిబ్బంది వారిని పట్టుకునే ప్రయత్నం చేశారు. ఎంపీలు, భద్రతా సిబ్బంది నుంచి తప్పించుకునే ప్రయత్నంలో వారు సభలో టేబుల్స్ పై నుంచి దూకుతూ నలు వైపులకు వెళ్లారు. చివరకు వారిని భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నారు.
భద్రతా వైఫల్యం
అత్యంత పటిష్టమైన భద్రత ఉండే పార్లమెంట్ లోకి ప్రమాదకర రసాయనాలు ఉన్న ట్యూబ్ వంటి వాటితో రావడం అతి పెద్ద భద్రతా వైఫల్యంగా భావిస్తున్నారు. ప్రేక్షకుల గ్యాలరీ లోనికి రావడానికి కూడా ఐదంచెల సెక్యూరిటీ సిస్టమ్ ను దాటి రావాల్సి ఉంటుంది. అలాంటి, భద్రతా వ్యవస్థను దాటి సభలోనికి వారు ప్రవేశించడంపై సభ్యులు తీవ్ర అసంతృప్తి, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారి చేతిలోని ట్యూబ్ లో నుంచి వచ్చిన పొగ ప్రాణాంతకమైన విష రసాయనం అయి ఉంటే పరిస్థితి ఏంటి అని ఎంపీ కార్తి చిదంబరం ప్రశ్నించారు.
ఎంపీ అనుమతితో..
కాగా, ఆ ఇద్దరు దుండగులు కర్నాటకకు చెందిన బీజేపీ ఎంపీ ప్రతాప సింహ కార్యాలయం నుంచి పార్లమెంట్ లోనికి ప్రవేశించడానికి అనుమతించే పాస్ లను పొందినట్లు తెలుస్తోంది. వారిద్దరిని మైసూరుకు చెందిన మనోరంజన్, సాగర్ శర్మ గా గుర్తించారు. సభలో వారు నియంతృత్వం ఇక చెల్లదు అంటూ నినాదాలు చేశారు. ఈ ఘటన అనంతరం సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. మరోవైపు, పార్లమెంటు వెలుపల మరో ఇద్దరు వ్యక్తులను కూడా పొగను వదిలే స్మోక్ కానిస్టర్స్ తో ఉండగా, భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. వారిలో ఒకరు మహిళ. వారు తమ వద్ద ఉన్న స్మోక్ కానిస్టర్స్ ను పేల్చడంతో పసుపు, ఎరుపు రంగు పొగ వెలువడింది. వారిని నీలమ్, అమోల్ షిండేలుగా గుర్తించారు.