Nepal Earthquake: నేపాల్‍ను వణికించిన భూకంపం.. గంట వ్యవధిలో రెండుసార్లు.. ఉత్తరాఖండ్‍లోనూ ప్రకంపనలు
28 December 2022, 6:54 IST
- Nepal Earthquake: నేపాల్‍లో భూకంపం సంభవించింది. బుధవారం అర్ధరాత్రి దాటాక గంట వ్యవధిలోనే రెండుసార్లు భూకంపం వచ్చింది. మరోవైపు భారత్‍లోని ఉత్తరాఖండ్‍లోనూ భూమి కంపించింది.
Nepal Earthquake: నేపాల్‍ను వణికించిన భూకంపం.. గంట వ్యవధిలో రెండుసార్లు..
Nepal Earthquake: నేపాల్‍ను భూకంపం వణికించింది. బుధవారం అర్ధరాత్రి దాటాక భయోత్పాతాన్ని సృష్టించింది. గంట వ్యవధిలోనే రెండుసార్లు భూకంపం సంభవించింది. నేపాల్‍లోని బాగ్లుంగ్ (Baglung) జిల్లాలో 4.7, 5.7 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఈ విషయాన్ని నేపాల్‍లోని నేషనల్ భూకంప మానిటరింగ్, రీసెర్చ్ సెంటర్ (NEMRC) ప్రకటించింది.
వెంట వెంటనే..
అర్థరాత్రి 1.23 గంటల సమయంలో (నేపాల్ కాలమానం) ముందుగా తొలిసారి భూమి కంపించింది. బాగ్లుంగ్ జిల్లా.. అధికరి చౌర్ (Adhikari Chaur) ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 4.7 తీవ్రతతో భూకంపం వచ్చింది. “బాగ్లుంగ్ జిల్లాలోని అధికరి చౌర్ వద్ద 4.7 తీవ్రతతో ఓ భూకంపం సంభవించింది” అని NEMRC ముందుగా వెల్లడించింది. ఆ తర్వాత గంట గడవకముందే మరింత ఎక్కువ తీవ్రతతో మరో భూకంపం నేపాల్‍లో వచ్చింది.
బాగ్లుంగ్ జిల్లా పరిధిలోని ఖుంగా (Khunga) ప్రాంతంలో 2.07 గంటల సమయంలో రెండోసారి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.3గా నమోదైంది. ఈ విషయాన్ని నేపాల్ ఎన్ఈఎంఆర్సీ ట్వీట్ల ద్వారా వెల్లడించింది. ఈ భూకంపాల వల్ల ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్టు ఇంకా గుర్తించలేదని పేర్కొంది. పూర్తి వివరాలు ఇంకా తెలియరావాల్సి ఉంది.
ఉత్తరాఖండ్‍లోనూ..
Uttarakhand Earthquake: భారత్‍లోని ఉత్తరాఖండ్‍లోనూ బుధవారం అర్ధరాత్రి దాటాక భూమి స్వల్పంగా కంపించింది. ఉత్తర కాశీ ప్రాంతంలో ఇది సంభవించింది. రిక్టర్ స్కేలు దీని తీవ్రత 3.1గా నమోదైంది. జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం (National Centre for Seismology) ఈ విషయాన్ని వెల్లడించింది. అర్ధరాత్రి దాటాక 2.19 గంటల ప్రాంతంలో ఇది జరిగింది.
కాగా, ఇండోనేషియాలో నవంబర్ నెలలో సంభవించిన భూకంపం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. వెస్ట్ జావాలోని సియాంజూర్ ప్రాంతం మొత్తం తీవ్రంగా ధ్వంసం అయిపోయింది. 5.6 తీవ్రతతో నవంబర్ 21న భూకంపం సంభవించింది. ఈ దుర్ఘటనలో సుమారు 600 మంది మృతి చెందారు. వేలాది ఇళ్లు నేలమట్టం అయ్యాయి.