Three disabled minors raped: అంధ విద్యార్థినులపై పదేళ్లుగా అత్యాచారం; నిందితుల అరెస్ట్
09 September 2023, 14:51 IST
Disabled minors raped: అనాథలుగా షెల్టర్ హోం లో ఉంటున్న ముగ్గురు అంధ విద్యార్థినులపై దాదాపు గత పదేళ్లుగా అత్యాచారం జరుగుతున్న దారుణం ఇటీవల వెలుగు చూసింది. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
ప్రతీకాత్మక చిత్రం
Disabled minors raped: కోల్ కతాలోని ఒక అనాథాశ్రయంలో ఈ దారుణం చోటు చేసుకుంది. ముగ్గురు అంధ అనాథ బాలికలపై దాదాపు గత పదేళ్లకు పైగా అత్యాచారానికి పాల్పడుతున్నారు. ఆ అనాథాశ్రయం వ్యవస్థాపక డైరెక్టర్ జబేశ్ దత్తా, ఆ షెల్టర్ హోం వంటవాడు బబ్లూ కుందు సహా ముగ్గురు వ్యక్తులు ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ దారుణం వెలుగు చూడడంతో శనివారం పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ఈ దారుణం గురించి తెలిసి కూడా, పోలీసులకు సమాచారం ఇవ్వని ఆ షెల్టర్ హోం ప్రిన్సిపాల్ కబేరీ దాస్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వాలంటీర్ ద్వారా..
ఒక స్వచ్చంధ సంస్థకు చెందిన వాలంటీర్ ఇటీవల ఆ షెల్టర్ హోంకు వెళ్లాడు. అతడికి అక్కడ ఒక బాధితురాలు ఈ దారుణాన్ని తెలియజేసింది. దాంతో, ఆ వాలంటీర్ పశ్చిమబెంగాల్ చిన్నారుల హక్కుల రక్షణ కమిషన్ (West Bengal Commission for Protection of Child Rights WBCPCR) ఫిర్యాదు చేశాడు. వారి ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు.
ముగ్గురిపై..
పోలీసుల విచారణ, స్వచ్చంధ సంస్థ కౌన్సెలింగ్ తో తమపై జరిగిన దారుణాలను ఆ షెల్టర్ హోం లోని బాధిత బాలికలు వెల్లడించారు. ప్రస్తుతం సుమారు 20 ఏళ్ల వయస్సు ఉన్న ఒక అంధ యువతి తనపై గత పదేళ్లుకు పైగా అత్యాచారం చేస్తున్నారని కన్నీళ్లతో వెల్లడించింది. 2010లో షెల్టర్ హోం నిర్వాహకుడు ఈ దారుణాన్ని ప్రారంభించాడని తెలిపింది. మరో ఇద్దరు బాధిత బాలికలు కూడా తమపై జరిగిన దారుణాలను వెల్లడించారు. తమపై గత ఐదేళ్లుగా అత్యాచారం జరుగుతోందని తెలిపారు. ఆ షెల్టర్ హోం లో ఉన్న మిగతా వారిని కూడా కౌన్సెలింగ్ చేస్తే మరిన్ని దారుణాలు వెలుగు చూస్తాయని WBCPCR చైర్ పర్సన్ రాయ్ తెలిపారు. ప్రస్తుతం ఆ హోంలో 70 మందికి పైగా అంధులైన బాలికలు, యువతులు ఉన్నారని ఆమె తెలిపారు. బాధిత బాలికల ఫిర్యాదుతో నిందితులను అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. వారిపై పొక్సొ సహా సంబంధిత చట్టాల్లోని సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు.