Climate Risk: దేశంలోని ఈ 9 రాష్ట్రాల్లో వాతావరణం ప్రమాదకరంగా మారనుందట
21 February 2023, 10:21 IST
- Climate Risk: వాతావరణ మార్పుల వల్ల ఎక్కువగా నష్టపోయే భారత్‍లోని రాష్ట్రాలు ఏవో ఓ నివేదిక వెల్లడించింది. క్లైమేట్ రిస్క్ టాప్-50 ర్యాంకింగ్‍ల్లో 9 రాష్ట్రాలు ఉన్నాయి.
Climate Risk: దేశంలోని ఈ 9 రాష్ట్రాల్లో వాతావరణం ప్రమాదకరంగా మారనుందట
Climate Risk: ప్రపంచమంతా వాతావరణ మార్పులపై ఆందోళన వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల్లో ఈ వాతావరణ మార్పుల ప్రమాదం మరింత ఎక్కువగా కనిపిస్తోంది. ఈ తరుణంలో క్రాస్ డిపెండెన్సీ ఇనిషియేటివ్ (Cross Dependency Initiative - XDI) అనే క్లైమేట్ రిస్క్ స్పెషలిస్ట్ సంస్థ ఓ నివేదిక వెల్లడించింది. ‘గ్రాస్ డొమెస్టిక్ క్లైమేట్ రిస్క్’ (Gross Domestic Climate Risk) పేరుతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న 2,600 రాష్ట్రాలకు ర్యాంకింగ్స్ ఇచ్చింది. 2050 కల్లా వాతావరణ రిస్క్ వల్ల ఆ రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాలకు ప్రమాదం ఉంటుందని పేర్కొంది. ఇందుకోసం ర్యాంకింగ్‍లను ప్రకటించింది. టాప్-50 క్లైమేట్ హైరిస్క్ స్టేట్‍లలో ఇండియాకు చెందిన తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి. 2050 కల్లా చైనాలోని 50 ప్రావిన్స్‌ల్లో అక్కడి మౌలిక సదుపాయాలు అత్యధిక క్లైమేట్ రిస్క్ ఎదుర్కొంటాయని వెల్లడించింది. వివరాలివే..
భారత్‍లో ఇవే..
Climate Risk: పంజాబ్, బిహార్, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, గుజరాత్, కేరళ, అసోం రాష్ట్రాలు ‘గ్రాస్ డొమెస్టిక్ క్లైమేట్ రిస్క్’ టాప్-50 ర్యాంకింగ్‍ల్లో ఉన్నాయి. 2050 కల్లా వాతావారణ మార్పులు అక్కడి మౌలిక సదుపాయాలకు ప్రమాదంగా మారతాయని ఆ నివేదిక పేర్కొంది. ముఖ్యంగా దేశ వాణిజ్య రాజధాని ముంబైలో ఈ తీవ్రత ఎక్కువ ఉంటుందని చెప్పింది. టాప్-50లో చైనాకు చెందిన 26 ప్రావిన్స్‌లు, అమెరికాకు చెందిన ఐదు రాష్ట్రాలు ఉన్నాయి. ఇక టాప్-100లో మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, హర్యానా, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా 2,600 రాష్ట్రాలకు ర్యాంకింగ్స్ ఇచ్చింది ఆ సంస్థ.
ప్రమాదం ఇలా..
Climate Risk: వాతావరణ రిస్క్ వల్ల మౌలిక సదుపాయాలకు వివిధ విధాలుగా ప్రమాదం జరగవచ్చని గ్రాస్ డొమెస్టిక్ క్లైమేట్ రిస్క్ నివేదిక చెప్పింది. ఉపరితల వరదలు, తీరప్రాంతాలకు వరద ముంపు, విపరీతమైన వేడి, దావాలనాలు, కరువు, తీవ్రమైన హోరుగాలులు, విపరీతైన శీతల పరిస్థితుల వల్ల మౌలిక సదుపాయాలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుందని పేర్కొంది. .
Climate Risk: చైనాలోని దాదాపు 80శాతం భూభాగంలోని మౌలిక సదుపాయాలు 2050 కల్లా వాతావరణ ప్రమాదాన్ని ఎదుర్కొనే అవకాశం ఉందని ఈ నివేదిక వెల్లడించింది. అమెరికాలోని కాలిఫోర్నియా, ఫ్లోరిడా, టెక్సాస్ ఎక్కువగా ప్రభావితమవుతాయని పేర్కొంది. సముద్ర మట్టం పెరగడం వల్ల అమెరికాలోని చాలా రాష్ట్రాలకు ప్రమాదకరంగా ఉండనుందని ఈ నివేదిక పేర్కొంది. గ్రాస్ డొమెస్టిక్ క్లైమేట్ రిస్క్ టాప్-50లో బ్రెజిల్, పాకిస్థాన్, ఇండోనేషియాకు చెందిన రాష్ట్రాలు ఉన్నాయి.
టాపిక్