Thailand visa: థాయిలాండ్ వెళ్లాలనుకుంటున్నారా..? ఇక వీసా కూడా అక్కర్లేదు..
31 October 2023, 21:42 IST
Thailand visa: భారత దేశం నుంచి వచ్చే పర్యాటకుల కోసం థాయిలాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారతీయులు వీసా లేకుండానే థాయిలాండ్ కు రావచ్చని స్పష్టం చేసింది.
ప్రతీకాత్మక చిత్రం
Thailand visa: భారత్, తైవాన్ దేశాల పర్యాటకులకు థాయిలాండ్ శుభవార్త తెలిపింది. ఆ రెండు దేశాల వారు థాయిలాండ్ కు వీసా (Thailand visa) లేకుండానే రావచ్చని వెల్లడించింది. ఈ సదుపాయం వచ్చే సంవత్సరం మే (మే, 2024) వరకు, అంటే ఆరు నెలలు అందుబాటులో ఉంటుంది.
30 రోజుల పాటు..
థాయిలాండ్ లో భారతీయ పర్యాటకులు ఇకపై వీసా లేకుండా, 30 రోజుల పాటు పర్యటించవచ్చని థాయిలాండ్ అధికారులు తెలిపారు. భారత్, తైవాన్ ల నుంచి మరింత ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని థాయిలాండ్ అధికారులు తెలిపారు.
చైనా కూడా..
చైనా నుంచి వచ్చే పర్యాటకులకు వీసా అవసరం లేదని గత నెలలో థాయిలాండ్ ప్రకటించింది. తాజాగా, భారత్, తైవాన్ లను ఆ జాబితాలో చేర్చింది. మొత్తంగా ఈ సంవత్సరం థాయిలాండ్ కు 2.2 కోట్ల మంది పర్యాటకులు వెళ్లారు. వారి వల్ల ఆ దేశానికి 927.5 బిలియన్ల బాట్ (25.67 బిలియన్ డాలర్లు) ల ఆదాయం సమకూరింది. మొత్తంగా, ఈ సంవత్సరం డిసెంబర్ 31 నాటికి 2.8 కోట్ల మంది పర్యాటకులను ఆకర్షించాలని థాయిలాండ్ లక్ష్యంగా పెట్టుకుంది.
భారత్ 4వ స్థానం
థాయిలాండ్ కు వెళ్లే పర్యాటకుల్లో భారత్ నుంచి వెళ్లేవారు నాలుగో స్థానంలో ఉంటారు. తొలి మూడు దేశాల్లో మలేసియా, చైనా, దక్షిణ కొరియా ఉంటాయి. భారత్ నుంచి ఈ సంవత్సరం ఇప్పటివరకు 12 లక్షల మంది పర్యాటకులు థాయిలాండ్ పర్యటనకు వెళ్లారు. వివిధ విమాన యాన సంస్థలు కూడా భారత్ నుంచి థాయిలాండ్ కు వెళ్లేవారి కోసం పలు ఆఫర్స్ ను ప్రకటిస్తున్నాయి.