నేరం ఒప్పుకున్న యాసిన్ మాలిక్.. దోషిగా నిర్ధారించిన ఎన్ఐఏ కోర్టు
19 May 2022, 15:13 IST
కశ్మీర్ వేర్పాటువాద నాయకుడు యాసిన్ మాలిక్‌ను ఎన్ఐఏ కోర్టు దోషిగా నిర్ధారించింది. భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులను సమకూర్చిన నేరంలో ఆయన దోషి అని స్పష్టం చేసింది. మే 25న ఆయనకు శిక్షను ఖరారు చేయనుంది.
యాసిన్ మాలిక్
కశ్మీర్ వేర్పాటువాద నాయకుడు యాసిన్ మాలిక్‌ను ఎన్ఐఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) కోర్టు దోషిగా నిర్ధారించింది. విచారణ చివరి రోజు తన నేరాన్ని యాసిన్ మాలిక్ అంగీకరించాడు.
ఆస్తుల వివరాలివ్వండి
మాలిక్ సామాజిక, ఆర్థిక స్థితిగతులపై నివేదిక ఇవ్వాలని కోర్టు ఎన్ఐఏను ఆదేశించింది. ఇందుకు కశ్మీర్ స్థానిక అధికారుల సాయం తీసుకోవాలని సూచించింది. మాలిక్ ఆదాయ మార్గాలు, ఆయన స్థిర, చర ఆస్తుల వివరాలను సమగ్రంగా అందించాలని ఆదేశించింది. శిక్ష ఖరారుకు సంబంధించిన తుది వాదనలు మే 25న జరగనున్నాయి. అదే రోజు ఎన్ఐఏ కోర్టు న్యాయమూర్తి ప్రవీణ్ సింగ్ శిక్షను ఖరారు చేస్తారు.
యూఏపీఏ అండ్ ఐపీసీ
ఎన్ఐఏ తనపై ఆరోపించిన నేరాలను తాను వ్యతిరేకించడం లేదని విచారణ చివరి రోజైన గురువారం మాలిక్ ఎన్ఐఏ కోర్టుకు తెలిపారు. ఎన్ఐఏ మాలిక్‌పై యూఏపీఏ(అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్)లోని సెక్షన్ 16(ఉగ్రవాద చర్యలు), సెక్షన్ 17(ఉగ్రవాద సంస్థలకు నిధులను సమీకరించడం), సెక్షన్ 18(ఉగ్రవాద చర్యలకు కుట్ర పన్నడం), సెక్షన్ 20(ఉగ్రవాద సంస్థలో సభ్యుడిగా ఉండడం)తో పాటు ఐపీసీలోని 120బీ(నేరపూరిత కుట్ర), 124ఏ(దేశ ద్రోహం) సెక్షన్ల కింద ఆరోపణలను నమోదు చేసింది. ఇవే ఆరోపణలపై మాలిక్‌తో పాటు పలువురు ఇతర కశ్మీరీ వేర్పాటువాద నాయకులపై కూడా ఎన్ఐఏ కేసులు నమోదు చేసింది. ఫారూఖ్ అహ్మద్ దార్, షబ్బీర్ షా, నయీం ఖాన్, రాజా మెహ్రాజుద్దీన్ కల్వాల్, మసరత్ ఆలమ్.. తదితరులు అందులో ఉన్నారు. పాకిస్తాన్ సహకారంతో, వారి ఆదేశాల మేరకు భారతదేశానికి వ్యతిరేకంగా ఒక ఉమ్మడి కుట్రలో నిందితులంతా భాగస్వామ్యులైనట్లు కోర్టు విశ్వసిస్తోందని ఈ సందర్భంగా ఎన్ఐఏ కోర్టు వ్యాఖ్యానించింది. విచారణ సమయంలో, ఏ సందర్భంలోనూ తమపై వచ్చిన ఆరోపణలను యాసిన్ మాలిక్ ఖండించలేదని కోర్టు గుర్తు చేసింది.
ఆరోపణలను ఖండించని మాలిక్
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాద చర్యలకు పాల్పడడంతో పాటు వేర్పాటు వాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్, హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్, కశ్మీరీ వేర్పాటువాద నాయకులు యాసిన్ మాలిక్, షబ్బీర్ షా, మసరత్ ఆలం తదితరులపై చార్జ్‌షీట్ దాఖలు చేయాలని మార్చ్ 16న ఎన్ఐఏను కోర్టు ఆదేశించింది. వారితో పాటు కశ్మీర్ రాజకీయ నాయకుడు రషీద్ ఇంజినీర్, వ్యాపారవేత్త జాహుర్ అహ్మద్ షా, అఫ్తాబ్ అహ్మద్ షా తదితరులను కూడా నిందితులుగా చేర్చాలని ఆదేశించింది.
టాపిక్