British pound falls: బ్రిటీష్ పౌండ్ విలువ పతనం.. పన్నుల కోత ఫలితం
26 September 2022, 12:17 IST
- British pound falls: అమెరికా డాలరుతో పోల్చితే అన్ని కరెన్సీలు తమ విలువను కోల్పోతున్నాయి. ఇందుకు బ్రిటీష్ పౌండ్ కూడా మినహాయింపు కాదని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
లండన్‌లో కరెన్సీ ఎక్స్ఛేంజీ కార్యాలయం ముందు బోర్డు (ఫైల్ ఫోటో)
లండన్: బ్రిటీష్ పౌండ్ సోమవారం ప్రారంభంలో యు.ఎస్. డాలర్‌తో పోల్చితే 1.0349 డాలర్ల కంటే తక్కువగా పడిపోయింది. కానీ తరువాత 2.3% తగ్గి 1.0671 యూఎస్ డాలర్లకు పుంజుకుంది.
పన్ను కోత ప్రణాళిక అమలు చేయడం కారణంగా ప్రజల రుణాలు పెరుగుతాయని, ఇది దేశంలో జీవన వ్యయ సంక్షోభాన్ని మరింత దిగజార్చుతుందని ఆందోళనలు పెరిగాయి. బ్రిటిష్ కరెన్సీ శుక్రవారం 3% పైగా పడిపోయింది. ఇది 1980ల నాటి స్థాయిలలో ట్రేడ్ అయ్యింది.
ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవటానికి అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచినందున ఇతర కరెన్సీలు కూడా డాలర్‌తో పోలిస్తే బలహీనపడ్డాయి. జపాన్ సెంట్రల్ బ్యాంక్ గత వారం యెన్‌కు మద్దతుగా జోక్యం చేసుకుని పతనాన్ని అదుపులో పెట్టగలిగింది.
ట్రెజరీ చీఫ్ క్వాసి క్వార్టెంగ్ మాట్లాడుతూ తాజా చర్య ఆర్థిక వృద్ధిని పెంచుతుందని ప్రకటించారు. గృహాలు, వ్యాపారాల కోసం పెరుగుతున్న ఇంధన బిల్లుల సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు.
తాజా పరిణామంతో యూఎస్ డాలరుతో పోల్చితే పౌండ్ విలువలో అతిపెద్ద తగ్గుదల నమోదైంది. బ్రిటిష్ కరెన్సీ శుక్రవారం లండన్‌లో 1.0822 డాలర్ల వద్ద ముగిసింది. గురువారం అది 1.1255 డాలర్లుగా ఉంది.
నూతన ప్రదాన మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన ప్రధాని లిజ్ ట్రస్.. 40 ఏళ్ల గరిష్టస్థాయి 9.9% ద్రవ్యోల్భణాన్ని ఎదుర్కోవటానికి ప్రయత్నిస్తున్నారు. సుదీర్ఘ మాంద్యం నుండి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు. రెండేళ్లలో సాధారణ ఎన్నికలను ఎదుర్కోవాల్సి ఉన్నందున ఆమె సత్వర ఫలితాలను సాధించాల్సిన అవసరం ఉంది.