Tata Consumer Products: హిమాలయన్ బ్రాండ్‌తో తేనె, ప్రిజర్వ్స్
14 July 2022, 15:40 IST
Tata Consumer Products: టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ హిమాలయన్ బ్రాండ్ ద్వారా తేనె, ప్రిజర్వ్స్ అందుబాటులోకి తేనుంది.
హిమాలయన్ బ్రాండ్ ద్వారా అందుబాటులో ఉన్న ఉత్పత్తులు
న్యూఢిల్లీ, జూలై 14: టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ తాగునీటి బాటిల్‌ను హిమాలయన్ బ్రాండ్ ద్వారా మార్కెట్లోకి తేవడంతో ఆ బ్రాండ్ బాగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు హిమాలయన్ బ్రాండ్ ద్వారానే తేనె, ప్రిజర్వ్స్ కేటగిరీలో పలు ఉత్పత్తులు మార్కెట్లోకి తేనున్నట్టు టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ కంపెనీ తెలిపింది.
హిమాలయాల దిగువ నుంచి సహజసిద్ధమైన నీటిని నాచురల్ మినరల్ వాటర్‌గా అందించడం ద్వారా హిమాలయన్ బ్రాండ్‌కు మార్కెట్లో గణనీయమైన వాటా ఉందని కంపెనీ తెలిపింది.
‘బ్రాండ్‌కు గల విశ్వసనీయతను అనుసరించి తాజాగా హిమాలయన్ బెల్ట్ నుంచి సేకరించిన ఉత్పత్తుల ద్వారా కొత్త ప్రొడక్ట్స్ ఆఫర్ చేయాలని భావిస్తున్నాం..’ అని టాటా గ్రూప్ ఎఫ్ఎంసీజీ విభాగం తెలిపింది.
ఈ ప్రొడక్ట్‌ల ద్వారా బ్రాండ్ తన ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియోను కొత్త కేటగిరీలకు విస్తరించనుంది. ఆయా ఉత్పత్తులను దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ప్రీమియం ఔట్‌లెట్లలో విక్రయిస్తామని కంపెనీ తెలపింది.
హిమాలయన్ ప్రాంతంలో పండే పండ్లను స్థానిక ప్రజలకు అండగా ఉండే స్థానిక భాగస్వాముల నుంచి సేకరించి హాండ్‌మేడ్‌గా హిమాలయన్ ప్రిజర్వ్స్ అందుబాటులోకి తేనున్నట్టు కంపెనీ తెలిపింది.
స్ట్రాబెర్రీ, ఆప్రికాట్, బ్లాక్ చెర్రీ, ఆపిల్ సినామిన్ తదితర 5 ఫ్లేవర్లతో ప్రిజర్వ్స్ అందుబాటులోకి తేనుంది. అలాగే ఎలాంటి చక్కెరలు, నిల్వ ఉంచే రసాయనాలు కలపని మూడు రకాల ఫ్రూట్ మార్మలేడ్స్ కూడా అందుబాటులోకి తేనున్నట్టు టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ తెలిపింది.
టాటా ట్రస్ట్ అసోసియేట్ ఆర్గనైజేషన్ అయిన పహాడీ ఉత్పాద్ సంస్థ నుంచి తేనెను సేకరించనుంది. ఈ సంస్థ సంప్రదాయ తేనె తీసే పద్ధతులపై పని చేస్తోంది. కల్తీ లేని పర్వత తేనెను సేకరించే పనిలో నిమగ్నమైంది. పర్వత ప్రాంత తేనెను సేకరించి ఒక వ్యాల్యూ చైన్ ఏర్పాటు చేసేందుకు పనిచేస్తోంది.
టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ అనుబంధ నౌరిష్‌కో బేవరేజెస్ లిమిటెడ్ ఎండీ విక్రమ్ గ్రోవర్ మాట్లాడుతూ హిమాలయ పర్వత ప్రాంతాల సహజ సిద్ధమైన వనరులను అనుభూతి చెందగల వినియోగదారులను హిమాలయన్ బ్రాండ్ కలిగి ఉందని తెలిపారు.
హిమాలయన్ హనీ 250 గ్రాములకు రూ. 300 ధరలో లభ్యమవుతుంది. అలాగే ప్రిజర్వ్స్ 450 గ్రాముల ప్యాక్ రూ. 425 ధరలో లభ్యమవుతుంది.
టాటా కెమికల్స్ నుంచి కన్జ్యూమర్ ప్రొడక్ట్స్‌ను, టాటా గ్లోబల్ బేవరేజెస్‌తో విలీనం చేయడం ద్వారా టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ఏర్పడింది. ఆయా ఉత్పత్తులు 201 మిలియన్ కుటుంబాలకు చేరుతాయని అంచనా. వార్షిక టర్నోవర్ రూ. 12,425 కోట్లుగా ఉంది.
టాపిక్