తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Ews Quota: ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు కీలక తీర్పు

EWS quota: ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు కీలక తీర్పు

08 November 2022, 16:52 IST

google News
  • EWS quota: ఆర్థికంగా వెనకబడిన వర్గాల(ఈడబ్ల్యూఎస్)కు 10 శాతం రిజర్వేషన్లు కల్పించడంపై సుప్రీం కోర్టు కీలక తీర్పు ప్రకటించింది.

ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై భారత సర్వోన్నత న్యాయస్థానం
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై భారత సర్వోన్నత న్యాయస్థానం

ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై భారత సర్వోన్నత న్యాయస్థానం

ఆర్థికంగా బలహీనంగా ఉన్న వర్గాలకు 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పించే చట్టం చెల్లుబాటుపై సుప్రీం కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. 10 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ తెచ్చిన 103వ రాజ్యాంగ సవరణ చెల్లుబాటుకు సంబంధించి దాఖలైన అనేక పిటిషన్లను ధర్మాసనం విచారించి ఈ తీర్పు వెలువరించింది. ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 3-2 మెజారిటీతో ఆమోద ముద్ర వేసింది. జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్ బేలా త్రివేది జస్టిస్ జేబీ పార్ధీవాల ఈడబ్ల్యూఎస్‌ వర్గీకరణను సమ్మతించింది. అంతేకాకుండా రిజర్వేషన్లను నిరవధికంగా కొనసాగించడం సరికాదని జస్టిస్ జేబీ పార్ధీవాలా అభిప్రాయపడ్డారు. అయితే జస్టిస్ రవీంద్ర భట్ మాత్రం దీనిని వ్యతిరేకించారు. ఆర్థిక ప్రాతిపదికన తెస్తే అభ్యంతరం లేదని, అయితే ఇందులోనుంచి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను మినహాయించడం సరికాదని రాజ్యంగ సవరణను తన తీర్పులో కొట్టేశారు. జస్టిస్ రవీంద్ర భట్ తీర్పుతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్ కూడా ఏకీభవించారు.

ఆర్థిక అంశాలను ప్రాతిపదికగా తీసుకుని కేంద్రం రిజర్వేషన్లు సహా ప్రత్యేక ప్రొవిజన్లు ఏర్పాటు చేయడం కోసం తెచ్చిన 103వ రాజ్యాంగ సవరణ రాజ్యాంగ మౌలిక స్వరూపానికి ఉల్లంఘనగా మారదా అనే అంశాలను పలు పిటిషన్లు ప్రశ్నించాయి. అలాగే ప్రయివేటు అన్‌ఎయిడెడ్ పాఠశాలల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వర్తింపజేసేందుకు వీలుగా ప్రత్యేక ప్రొవిజన్లు తేవడానికి కేంద్రాన్ని అనుమతించడం రాజ్యాంగ మౌలిక స్వరూపానికి ఉల్లంఘనగా మారుతుందా అనే అంశాలను కూడా పిటిషన్లు ప్రశ్నించాయి.

103వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 15(6), ఆర్టికల్ 16(6)లను రాజ్యాంగంలో చేర్చారు. వీటి ప్రకారం విద్యా సంస్థల్లో ప్రవేశాలు, ఉద్యోగ నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీయేతర ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తారు. వారి కుటుంబ గరిష్ట వార్షిక ఆదాయం రూ. 8 లక్షలకు మించరాదన్న నిబంధనను కూడా చేర్చారు.

అయితే 1992లో ఇందిరా సహానీ (మండల్ కమిషన్) కేసులో సుప్రీం కోర్టు రిజర్వేషన్లు 50 శాతానికి మించి ఉండరాదని ఇచ్చిన తీర్పును 103వ రాజ్యాంగ సవరణ ఉల్లంఘిస్తోందని కూడా పిటిషనర్లు లేవనెత్తారు. అసాధారణ పరిస్థితుల్లో తప్ప రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని ఇందిరా సహానీ కేసులో 9 మంది న్యాయమూర్తులతో కూడిన విస్తృత ధర్మాసనం తీర్పు ఇచ్చింది.

కాగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్ రేపు పదవీ విరమణ చేయబోతున్నారు. ఆయన పదవీ కాలంలో ఈ తీర్పు చారిత్రంకంగా మారనుంది.

టాపిక్

తదుపరి వ్యాసం