Supreme Court: ‘‘విలువైన సమయం వృథా చేశారు’’ : గుజరాత్ హైకోర్టుపై సుప్రీంకోర్టు ఆగ్రహం
19 August 2023, 13:40 IST
Supreme Court: గుజరాత్ హై కోర్టుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రతీక్షణం విలువైనదైన కేసు విషయంలో అనవసర జాప్యంతో సమస్యను మరింత క్లిష్ట చేశారని మండిపడింది.
సుప్రీంకోర్టు
Supreme Court: గుజరాత్ హై కోర్టుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రతీక్షణం విలువైనదైన కేసు విషయంలో అనవసర జాప్యంతో సమస్యను మరింత క్లిష్ట చేశారని మండిపడింది.
స్పెషల్ సిట్టింగ్
ఒక అత్యాచార బాధితురాలు తన గర్భాన్ని తొలగించుకోవడానికి అనుమతించాలని గుజరాత్ హై కోర్టును ఆశ్రయించింది. 26 వారాల గర్భాన్ని తొలగించుకోవడానికి అనుమతించాలని ఆ బాధితురాలు కోర్టును కోరింది. ఆ అభ్యర్థనను గుజరాత్ హై కోర్టు తోసిపుచ్చింది. దాంతో, ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కేసు ఎమర్జెన్సీని గుర్తించిన సుప్రీంకోర్టులోని జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ బుయాన్ ధర్మాసనం శనివారం ప్రత్యేకంగా ఈ కేసు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా గుజరాత్ హై కోర్టు తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రెగ్నెన్సీకి సంబంధించిన కేసులో ప్రతీక్షణం విలువైనదని, అలాంటి ముఖ్యమైన కేసు విచారణను పలుమార్లు వాయిదా వేసి అనవసర జాప్యం చేశారని మండిపడింది. దాంతో, అత్యంత విలువైన సమయం వృధా అయిందన్నారు.
ఆగస్ట్ 7నుంచి..
పిటిషనర్ తరఫు న్యాయవాది తెలిపిన వివరాల ప్రకారం.. 25 ఏళ్ల రేప్ బాధితురాలు.. తన 26 వారాల ప్రెగ్నెన్సీని తొలగించడానికి అనుమతించాలని కోరుతూ ఆగస్ట్ 7వ తేదీన హై కోర్టులో పిటిషన్ వేశారు. ఆగస్ట్ 8న కేసు విచారణకు వచ్చిందని, గర్భం ఏ స్థితిలో ఉందో పరిశీలించాలని, అలాగే పిటిషనర్ హెల్త్ కండిషన్ ను పరిశీలించాలని కోరుతూ హై కోర్టు ఒక మెడికల్ బోర్డును ఏర్పాటు చేసింది. ఆ బోర్డు ఆగస్ట్ 10వ తేదీన రిపోర్ట్ ను కోర్టుకు అందించింది. ఆగస్ట్ 10న ఆ నివేదికను స్వీకరించిన హైకోర్టు తదుపరి విచారణను ఆగస్ట్ 23వ తేదీకి వాయిదా వేసింది. దీనిపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇంత ముఖ్యమైన, ప్రతీ క్షణం విలువైన కేసులో 13 రోజుల పాటు విచారణను వాయిదా వేయడం ఏంటని ప్రశ్నించింది. మరోవైపు, రేప్ బాధితురాలి పిటిషన్ ను కొట్టేస్తున్నట్లు గుజరాత్ హై కోర్టు ఆగస్ట్ 17వ తేదీననే ఆదేశాలిచ్చినట్లు కేసు స్టేటస్ చూపిస్తోందని, అయితే, ఆ ఆదేశాలను హై కోర్టు వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది తెలిపారు.
విచారణ జరపాలి
దీనిపై సుప్రీంకోర్టు మరింత ఆగ్రహం వ్యక్తం చేసింది. 17వ తేదీన ఇచ్చిన ఆదేశాలను వెబ్ సైట్ లో ఎందుకు అప్ లోడ్ చేయలేదో హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ నుంచి వివరణ తీసుకోవాలని సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ ను ధర్మాసనం ఆదేశించింది. ఇలాంటి ముఖ్యమైన కేసుల్లో నిర్లక్ష్యం తగదని హితవు పలికింది. అనంతరం, బాధితురాలికి వైద్య పరీక్షలు జరిపి, ప్రస్తుత ఆరోగ్య స్థితిని ఆదివారం సాయంత్రం 6 గంటల్లోగా తమకు తెలియజేయాలని ఆదేశించింది. మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చట్టం ప్రకారం 24 వారాల దాటిన తరువాత అబార్షన్ చేయడం చట్ట విరుద్ధం. నేరం.