తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Supreme Court: ఎన్జీవోలకు విరాళాల స్వీకరణ హక్కు కాదు

Supreme Court: ఎన్జీవోలకు విరాళాల స్వీకరణ హక్కు కాదు

HT Telugu Desk HT Telugu

09 April 2022, 7:15 IST

google News
    • ప్రభుత్వ కొత్త నిబంధనలతో విరాళాల స్వీకరణకు ఆటంకం కలుగుతోందని పలు స్వచ్ఛంధ సంస్థలు సుప్రీంను ఆశ్రయించాయి. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. ఫారిన్‌ కంట్రిబ్యూషన్స్‌ రెగ్యులేషన్‌ యాక్ట్‌ నిబంధనలో సవరణలు, ఆంక్షలపై జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది.
ఫారిన్‌ కంట్రిబ్యూషన్స్‌ రెగ్యులేషన్‌ యాక్ట్‌ నిబంధనలో సవరణలపై సుప్రీం విచారణ(ఫైల్ ఫోటో)
ఫారిన్‌ కంట్రిబ్యూషన్స్‌ రెగ్యులేషన్‌ యాక్ట్‌ నిబంధనలో సవరణలపై సుప్రీం విచారణ(ఫైల్ ఫోటో)

ఫారిన్‌ కంట్రిబ్యూషన్స్‌ రెగ్యులేషన్‌ యాక్ట్‌ నిబంధనలో సవరణలపై సుప్రీం విచారణ(ఫైల్ ఫోటో)

ఫారిన్‌ కంట్రిబ్యూషన్స్‌ రెగ్యులేషన్‌ యాక్ట్‌ నిబంధనలో సవరణలు, ఆంక్షలపై జోక్యం చేసుకునేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎఫ్‌సిఆర్‌ఏ నిబంధనల్లో మార్పులు చేయడంతో పాటు ఖచ్చితమైన ఆడిట్ నిబంధనలు అమలు చేస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా వేలాది సంస్థలు లైసెన్సులు కోల్పోయాయి. వీటిలో ఎక్కువగా మత సంస్థలు ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనలతో విరాళాల స్వీకరణకు ఆటంకం కలుగుతోందని పలు స్వచ్ఛంధ సంస్థలు కోర్టును ఆశ్రయించాయి.

అది హక్కు కాదు...

విదేశాల నుంచి విరాళాలను స్వీకరించి సేవా కార్యక్రమాలు నిర్వహించడం భారత పౌరులకు సంపూర్ణ హక్కు కాదని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. విదేశీ నిధుల్ని అనుమతించే విషయం ప్రభుత్వ విధానపరమైన నిర్ణయంగా పేర్కొంది. విదేశీ విరాళాలను పూర్తిగా నిషేధించే హక్కు కేంద్రానికి ఉందని తేల్చిచెప్పింది. భారత్‌లోని ధార్మిక సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు విదేశీ విరాళాలు తీసుకోవడంపై ఆంక్షలు విధిస్తూ కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన విదేశీ విరాళాల క్రమబద్ధీకరణ సవరణ -2020) చట్టానికి రాజ్యాంగబద్ధత ఉందని పేర్కొంది. ‘నోయల్‌ హార్పర్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా’ కేసులో కీలక తీర్పు శుక్రవారం వెలువరించింది. ‘విదేశీ విరాళాలను స్వీకరించే హక్కు దేశ పౌరులకు లేదని., నిధుల్ని స్వీకరించేందుకు అనుమతివ్వాలో, వద్దు అనేది కేంద్ర ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని తేల్చి చెప్పింది. ఈ విరాళాలను ప్రభుత్వాలు సంపూర్ణంగా నిషేధించవచ్చని, దేశంలో దాతలకు కొదవ లేదని ధార్మిక సంస్థలు వారిపై దృష్టిపెట్టాలన్నారు.

విదేశీ విరాళాలతో దేశంపై ప్రభావం....

విదేశీ విరాళాలతో ఏ దేశమైనా మనల్ని ప్రభావితం చేయడాన్ని చట్ట సవరణ ద్వారా అడ్డుకోవచ్చని కోర్టు పేర్కొంది. పార్లమెంటు నిర్దేశించిని చట్టానికి వెలుపల విదేశీ విరాళాలు తీసుకునే హక్కు ఎవరికీ సంక్రమించలేదనేది, ఇలాంటి విరాళాలు దేశ విధానాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని అభిప్రాయపడింది. విదేశీ రాజకీయ సిద్ధాంతాలను భారత దేశంపై రుద్దడానికి దారి తీస్తుందని భావించింది. ఇలాంటి ప్రమాదాలున్నందున వాటిని నియంత్రించాలని, రాజ్యాంగ నైతిక సిద్ధాంతం దృష్ట్యా వాటిని పూర్తిగా అడ్డుకోలేకున్నా, కనిష్ఠ పరిమాణంలో ఉండేలా చూడాలని జస్టిస్‌ ఏఎం ఖన్విల్కర్‌, జస్టిస్‌ దినేశ్‌ మహేశ్వరి, జస్టిస్‌ సీటీ రవికుమార్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది.ఎ

ఆ నిబంధనలు సబబే..... దేశంలో సేవ కూడా వ్యాపారమే

ఎఫ్‌సీఆర్‌ఏ సవరణ చట్టంలోని సెక్షన్‌ 7 (విదేశీ విరాళాల బదిలీపై నిషేధం), సెక్షన్‌ 12ఏ (ముందస్తు అనుమతికి ఆధార్‌ నంబరును గుర్తింపు కార్డుగా చూపాలనడం), సెక్షన్‌ 17 మేరకు ఢిల్లీలో కేంద్రం నోటిఫై చేసిన ఎస్‌బీఐ బ్రాంచ్‌లో ఎఫ్‌సీఆర్‌ఏ ప్రాథమిక ఖాతా తెరవడం తప్పనిసరిలను సవాల్‌ చేస్తూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది గోపాల్‌ శంకరనారాయణన్‌, న్యాయవాది గౌతమ్‌ ఝా వాదనలు వినిపంచారు. ప్రభుత్వం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా, అదనపు సొలిసిటర్‌ జనరల్‌ సంజయ్‌ జైన్‌ వాదనలు వినిపించారు.

దేశంలో సేవా కార్యక్రమాలు వ్యాపారంగా మారాయని సుప్రీంకోర్టు పేర్కొంది. భారత్‌లోనే విరాళాలు స్వీకరిస్తే వాటిని వేరే విధానంలో నియంత్రిస్తున్నారని., ఇలాంటి విరాళాలను నియంత్రించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. విదేశీ విరాళాల విషయంలోనూ అలాగే చేయడం సాధ్యం కాదని., వాటిని ప్రాథమిక దశలోనే నియంత్రించాలని తెలిపింది. విదేశీ విరాళాలకు, విదేశీ పెట్టుబడులకు తేడా ఉందని పేర్కొంది. విదేశీ విరాళాలపై ఆధారపడి ఏ దేశ ఆకాంక్షలనైనా నెరవేర్చలేమని, పౌరుల సంకల్పం, దృఢనిశ్చయం, పరిశ్రమల కఠోర కృషి ద్వారా మాత్రమే లక్ష్యాలను సాధించగలమని స్పష్టం చేసింది. సెక్షన్లు 12ఏ, 17ల మార్పులలో చట్టబద్ధతను సమర్థించింది. విరాళాలకు అనుమతులు తీసుకునేవారి విషయంలో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా సరైన వ్యవస్థను తీసుకొచ్చిన ఘనత పార్లమెంటుదేనని తెలిపింది. అయితే 12ఏ విషయంలో కాస్త ఔదార్యం చూపింది. ఎఫ్‌సీఆర్‌ఏ క్లియరెన్స్‌కు ఆధార్‌ నంబర్‌ అక్కర్లేదని. భారత పౌరులైన ధార్మిక సంఘాలు/స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తమ గుర్తింపు కోసం పాస్‌పోర్టులు కూడా సమర్పించేందుకు అనుమతించాలని ధర్మాసనం సూచించింది. ఎఫ్‌సీఆర్‌ఏ చట్టం కింద.. విదేశీ విరాళాల స్వీకరణకు ముందస్తు అనుమతి తీసుకున్నవారు, రిజిస్టర్‌ చేసుకున్నవారు గానీ, లైసెన్స్‌ పొందినవారు, వచ్చిన నిధులను ఇతరులకు మళ్లించకుండా ఆ మొత్తాన్ని మాతృ సంస్థ ద్వారానే ఖర్చుపెట్టాలని, ఇతరుల ద్వారా ఖర్చు చేయకూడదని సెక్షన్‌ 7 చెబుతోంది. సాంస్కృతిక, ఆర్థిక, విద్య, సామాజిక కార్యక్రమాల కోసం అందుకున్న విరాళాలను అందుకోసమే బదిలీ చేస్తే ఆమోదయోగ్యమేనని పేర్కొంది. ఎఫ్‌సీఆర్‌ఏ ప్రాథమిక ఖాతాను ఢిల్లీ బ్యాంకులో తెరవాలనడాన్ని సమర్థించింది. ఆ ఖాతా ద్వారానే నిధుల వినియోగం జరగాలన్న నిబంధన ఏదీలేదని.. ఇతర షెడ్యూల్డ్‌ బ్యాంకుల్లో ఖాతాలు నిర్వహించుకోవచ్చని పేర్కొంది.

ఆ నిబంధనలు చెల్లవు....

2010నాటి ఎఫ్‌సీఆర్‌ఏ చట్టంలోని సవరించని సెక్షన్‌ 7 మెరుగ్గా ఉందని.. ఎక్కువ నియంత్రణలు లేవన్న వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. కేవలం అసౌకర్యం కలిగినంత మాత్రాన చట్టం రాజ్యాంగబద్ధతను సవాల్‌ చేయడానికి అది ప్రాతిపదిక కాదని స్పష్టం చేసింది. సవరించిన నిబంధనలు ఏ విధంగా రాజ్యాంగవిరుద్ధమో తమకు అర్థం కావడం లేదని పేర్కొంది. విదేశీ విరాళాలు ణ ఔషధ గుణాలున్న మత్తు పదార్థాల వంటివని అవి అమృతంలా పనిచేసినా., వాటిని పరిమితంగా, విచక్షణతో వాడాలని సూచించింది. బాగున్నాయని అపరిమితంగా, విచక్షణరహితంగా వాడితే చెప్పలేనంత బాధ, దుఃఖం కలిగించే సామర్థ్యం వాటికి ఉంటుందని అభిప్రాయపడింది. నియంత్రణ లేకుండా విదేశీ విరాళాలు దేశంలోకి ప్రవేశిస్తే దేశ సార్వభౌమాధికారానికి, సమగ్రతకు.. శాంతిభద్రతలకు ముప్పు ఏర్పడుతుందని ప్రజా ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుందని స్పష్టం చేసింది. విదేశీ నిధుల దుర్వినియోగం, గత అనుభవాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌సిఆర్‌ఏ చట్ట సవరణ సరైనదేనని తేల్చింది.

టాపిక్

తదుపరి వ్యాసం