NEET ROW | కేరళ `నీట్` వివాదంపై విచారణకు కేంద్రం ఆదేశాలు
19 July 2022, 15:23 IST
నీట్ (National Eligibility- cum- Entrance Test - NEET) పరీక్ష సందర్భంగా కేరళలో విద్యార్థినులకు జరిగిన అవమానంపై కేరళ స్టుడెంట్స్ మండిపడుతున్నారు. ఘటన జరిగిన విద్యాసంస్థపై విద్యార్థులు దాడి చేశారు. ఈ ఘటనపై కేంద్రం విచారణకు ఆదేశించింది.
ప్రతీకాత్మక చిత్రం
NEET ROW | కేరళలో నీట్ పరీక్ష సందర్భంగా విద్యార్థినులకు జరిగిన అవమానం పార్లమెంట్ వరకు చేరింది. ఈ ఘటనపై కేంద్రం విచారణకు ఆదేశించింది. కేరళ ఎంపీ ప్రేమచంద్రన్ తక్షణమే ఈ ఘటనపై పార్లమెంట్లో చర్చ జరగాలని నోటీసు ఇచ్చారు.
NEET ROW | కేంద్రం ఆదేశాలు
కేరళలో విద్యార్థినులకు జరిగిన అవమానంపై దేశవ్యాప్తంగా దుమారం చెలరేగడంతో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించింది. ఈ దారుణ ఘటనను కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దృష్టికి కేరళ విద్యాశాఖ మంత్రి ఆర్ బిందు తీసుకువెళ్లారు. ఈ పరీక్ష రాయడానికి ముందు జరిగిన ఈ అమానవీయ ఘటన విద్యార్థినుల నైతిక స్థైర్యాన్ని, ఏకాగ్రతను దెబ్బ తీసిందని, ఈ ఆటవిక ఘటనకు బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రికి రాసిన లేఖలో ఆర్ బిందు డిమాండ్ చేశారు.
NEET ROW | నిరసనల్లో ఉద్రిక్తత
నీట్ పరీక్ష రాయడానికి వచ్చిన విద్యార్థినులకు జరిగిన అవమానంలపై కేరళ విద్యార్థి లోకం స్పందించింది. వివిధ పట్టణాల్లో విద్యార్థులు నిరసన ర్యాలీలు చేపట్టారు. ఆ అవమానకర ఘటన జరిగిన కొల్లాంలోని మార్‌థోమా కాలేజ్‌పై విద్యార్థులు దాడి చేసి, ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. పోలీసులను తోసుకుంటూ కాలేజీ లోపలకి వెళ్లి, విధ్వంసం సృష్టించారు. అనంతరం, పోలీసులు లాఠీ చార్జి చేసి వారిని చెదరగొట్టారు. పోలీసుల లాఠీ చార్జిలో కొందరు విద్యార్థులకు గాయాలయ్యాయి.
NEET ROW | అసలేం జరిగింది..
ఆదివారం వైద్య విద్య ప్రవేశాలకు సంబంధించిన నీట్ పరీక్ష జరిగింది. దేశవ్యాప్తంగా ఈ పరీక్షనుC నిర్వహించింది. కేరళలోని కొల్లాంలో ఉన్న మార్‌థోమా కాలేజ్‌లో ఈ పరీక్ష కేంద్రం ఉంది. ఆ కేంద్రంలో పరీక్ష రాయడానికి వచ్చిన విద్యార్థినులను వారి బ్రా లను తొలగించిన తరువాతనే పరీక్షకు అనుమతించారు. సెక్యూరిటీ కారణాలు చూపుతూ.. మెటల్ హుక్స్ ఉన్న బ్రాలను ధరించిన విద్యార్థులను అవమానకర రీతిలో వేరే రూమ్‌లోకి పంపించి, ఆ బ్రా లను తొలగించిన తరువాతే ఎగ్జామ్ హాళ్లోకి అనుమతించారు. పరీక్ష తరువాత ఆ బ్రాలను ఒక పెద్ద అట్టపెట్టెలో పెట్టి పరీక్ష కేంద్రం వెలుపల పెట్టారు.
NEET ROW | పోలీసు ఫిర్యాదు
ఈ ఘటనపై ఒక విద్యార్థిని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మానవ హక్కుల సంఘం దృష్టికి కూడా తీసుకువెళ్లారు. దాంతో, ఈ అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది.
NEET ROW | ఎన్‌టీఏ వివరణ
ఈ ఘటనపై పరీక్షాకేంద్రం సూపరింటెండెంట్ నుంచి వివరణ తీసుకున్నామని National Testing Agency - NTA ఎన్‌టీఏ వెల్లడించింది. ఆ ఫిర్యాదు దురుద్దేశంతో చేసిన తప్పుడు ఫిర్యాదు అని ఆ సూపరింటెండెంట్ వివరణ ఇచ్చాడని తెలిపింది. అలాంటి ఘటనేదీ ఆ సెంటర్‌లో చోటు చేసుకోలేదని వివరించింది. లోదుస్తులను విప్పాలన్న నిబంధన ఏదీ కూడా నీట్ డ్రెస్ కోడ్‌లో లేదని స్పష్టం చేసింది.